మీరు చూస్తున్న ఈ ఫొటో నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామ సమీపం వద్ద జరిగిన ఘటనకు సంబంధించింది. అదేమిటి? రోడ్డుకు అడ్డంగా వాటర్ టాంకర్ ఉంది… రాళ్లు, రప్పలేగాక కంకర కలిపే డబ్బాకు సంబంధించిన ఇనుప రాడ్లతో మార్గాన్ని ఇలా దిగ్బంధిస్తే అంబులెన్స్ ముందుకెలా వెడుతుంది? అని అనుకుంటున్నారా? ts29.in ఈనెల 25వ తేదీన చెప్పిన అంశం కూడా ఇదే.

కరోనా వైరస్ కట్టడి పేరుతో పల్లెల సరిహద్దుల్లో రోడ్లు తవ్వడం, కందకాలు తీయడం, కంచెలు నిర్మించడం, బండరాళ్లు వేయడం, టాంకర్లు, ట్రాక్టర్ల కేజీ వీల్స్ తో గ్రామాల్లోకి రాకుంగా మార్గాలను మూసివేయడం అత్యంత ఆందోళనకర అంశమని ts29.in తన వార్తా కథనంలో ముందే హెచ్చరించింది. ‘కరోనా కట్టడి గిట్ల జేస్తే? ఎమర్జెన్సీ కష్టమెస్తే…? ప్రాణానికి నష్టమెస్తే…?’ శీర్షికన ఈనెల 25వ తేదీన పలు ఫొటోలతో వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.

ఆందోళనకర పరిస్థితులకు మార్గాల మూసివేతను అన్వయించిన విధంగానే నిజామబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. డెలివరీ కోసం ఓ గర్భిణీ స్త్రీని తీసుకువెళ్లే సందర్భంగా కోనసముందర్ కు వెళ్లాల్సిన 108 వాహనం బషీరాబాద్ మధ్యలో ఇలా చిక్కుకుపోయింది. ఆపద సమయంలో అర్జంటుగా వెళ్లాల్సిన వాహనాలకు గ్రామాల సరిహద్దుల్లోని ఇటువంటి ‘కట్టడి’ తీవ్ర విఘాతంగా పరిణమించిందని 108 వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పరిస్థితిని వివరిస్తూ 108 సిబ్బంది సెల్ఫీ వీడియో తీసి దుస్థితిని నివేదించారు. ‘లాక్ డౌన్’ అంటే పల్లెల్లో రోడ్లను మూసివేయడం కాదని, ఇల్లు దాటి బయటకు రాకుండా ఉంటే చాలనే అంశాన్ని ప్రజలు ఇప్పటికైనా గ్రహించాల్సి న అవసరముందంటున్నారు. అర్థమవుతున్నట్లే కదా…? కాకుంటే దిగువన వీడియో చూడండి.

Comments are closed.

Exit mobile version