మనుషులనే కాదు, వారిలోని మానవత్వాన్ని సైతం కరోనా వైరస్ భీతి ఎలా చంపేస్తున్నదో, మరెలా భయకంపితులను చేస్తున్నదో నిన్నగాక మొన్ననే కరీంనగర్ కశ్మీర్ గడ్డలో ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోయిన హృదయ విదారక ఘటన గురించి చదివారు కదా? అందరూ ఉన్నా, అనాథగా మారిన ఈ రాజవ్వ ఉదంతం కూడా దాదాపు అదే తరహా విషాదం.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన కొసరి రాజవ్వ(55) భర్త దాదాపు మూడు నెలల క్రితం మరణించాడు. రాజవ్వ దంపతులకు సంతానం కూడా లేరు. తన భర్త తరపున, తన తరపున బంధువులు మాత్రం ఉన్నారు. భర్త మరణానంతరం మానసికంగా కుంగిన రాజవ్వ ‘చావు మైల’ సూచనతో తాను ఉంటున్న ఇంటిని తాత్కాలికంగా వదిలేసి, మరో ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఓవైపు భర్త దూరమైన దుఃఖం, మరోవైపు వేళకు పట్టెడు బువ్వ పెట్టేవారు కరవై మనోవేదనతో బాధపడుతున్న రాజవ్వ గురువారం అర్థరాత్రి దాటాక తుదిశ్వాస విడిచింది. శుక్రవారం ఉదయంగాని ఆమె మరణించిన విషయాన్ని గ్రామస్తులు గుర్తించలేదు.

విషయన్ని కోరుట్లలోని రాజవ్వ బంధువులకు గ్రామ సర్పంచ్ జానకితోపాటు స్థానిక ప్రజలు కూడా చేరవేశారు. అయితే ఓవైపు లాక్ డౌన్ పరిస్థితులు, ఇంకోవైపు కరోనా భయం వల్ల కాబోలు బంధువులెవరూ రాజవ్వను చివరి చూపు చూసేందుకు కూడా రాలేదు. పైగా దహన సంస్కార ఖర్చులు భరిస్తామని, కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉచిత సలహా ఇచ్చారట. దీంతో నొచ్చుకున్న గ్రామ సర్పంచ్ జానకితోపాటు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు బంధువులకు కాస్త కఠినంగానే సమాధానం చెప్పారట. స్థానిక ప్రజాప్రతినిధులు, నందిమేడారం ప్రజలు ఇందుకు ఆగ్రహించి దహన సంస్కార ఖర్చులు ఇవ్వాల్సిన అవసరం లేదని, తామే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులే రాజవ్వ భౌతిక కాయానికి ‘ఆ నలుగురు’గా మారి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో పలువురి కంట కన్నీరును చెమర్చింది. ఇది తెలంగాణాలో ‘కరోనా’ మిగిల్చిన మరో కల్లోల విషాద గాథ.

Comments are closed.

Exit mobile version