ప్రొ. ఘంటా చక్రపాణి


ఒక సమాజ శాస్త్ర విద్యార్థిగా, భారతీయ సమాజంలో భాగస్వామిగా Social Distancing అనే పదం నాకెందుకో ఇష్టంలేదు. తెలుగులో దీనిని సామాజిక దూరం అనాలి, హిందీలో
सामाजिक भेद అనొచ్చని గూగుల్ చూపిస్తోంది. కానీ ఈ రెండూ భాషాపరంగా, భావపరంగా తప్పేనని నా అభిప్రాయం.

ముఖ్యంగా తరతరాలుగా సామాజిక అంతరాల్లో మగ్గుతున్న సమాజాలకు ఇదేమంత ఆమోదయోగ్యమైన పదమేమీ కాదు. ఇప్పటికే వర్ణ బేధం, కుల మత, జాతి, లింగ వైరుధ్యాలకు దూరాన్ని పాటించే సందర్భాలకు సమాజ శాస్త్రాల్లో social distance అనే పదాన్ని వాడుతున్నారు. వ్యక్తులు, ప్రత్యేకించి వివిధ సామాజిక సమూహాలకు చెందినవారు (రంగు, జాతి, వర్గం, కులం, మతం, లింగం ఆధారంగా) మధ్య సామాజిక పరస్పర చర్యను అంగీకరించడం లేదా తిరస్కరించడానికి ఇదే ప్రామాణికం. ఇందులో వివక్ష ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగగ్రస్తుల కు దూరం ఉండే విషయంలో social distancing అనే పదాన్ని స్థిరపరిచారు. వారివి సామాజిక అసమానతలు, అంతరాలు లేని సమాజాలు కాబట్టి ఆ పదాన్ని వాడుతున్నారు.

ఒక రకంగా ఇతరులతో కనీస దూరాన్ని పాటించడం అనుకోవచ్చు. ఇది అవసరం, తుమ్మినా, దగ్గినా తుంపరలు మీద పడనంత దూరంలో ఉంటే చాలు. కానీ మనదేశంలో కొందరు అజ్ఞానులు ఈ సామాజిక భేదమంటే వెలివేత అనే అనుకుంటున్నాయి. ఇవాళ దేశంలో ఇదొక కొత్త సామాజిక వివక్షకు దారితీస్తోంది. దేశమంతటా డాక్టర్లను కిరాయి ఇళ్లల్లోంచి ఖాళీ చేయిస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందులో మన వరంగల్ ఎంజీఎం వైద్యులు కూడా ఇలాంటి వివక్షను, వెలివేతను ఎదుర్కోవడం సిగ్గుచేటు. ఈ సంఘటనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది తప్ప ఇప్పటివకు ఎక్కడా తగిన చర్యలు తీసుకోలేదు.

ఈ దేశంలోని మనుషుల్లో ఉన్న మూఢత్వం దీనికి కారణం. ఏ మాత్రం పొంతన లేని అంధ విశ్వాసాలు, వాటిని ప్రోదిచేసి ప్రచారం చేసిన మత ఛాందసాలు దీనికి కారణం. మతమేదయినా మనుషుల్ని మందమతుల్ని చేస్తుందని మధ్యయుగాల నుంచి అనేక అనుభవాలు చెపుతున్నాయి కానీ అవి ఇంకా దేశంలో ఉన్నాయి. ఈ దేశంలో భక్తి తప్ప భయంలేదని ఇటీవలి పరిణామాలను బట్టి అర్థం అవుతోంది.

కరోనా విజృంభిస్తున్న దశలో ముందస్తు సన్నాహక చర్యల్లో భాగంగా( అలాగని చెప్పక పోయినా) ‘జనతా కర్ఫ్యూ’ పేరుతో ఒకరోజు స్వచ్చంద బంద్ పాటించాలని స్వయంగా ఈ దేశ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ఇది కరోనా సృష్టించిన సంక్షోభ సమయంలో అలుపు లేకుండా నిస్వార్థ సేవ చేస్తోన్న మన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి గౌరవ సూచకంగా మనం శిరసు వంచి కృతజ్ఞతలు చెప్పాల్సిన సందర్భమని, స్వచ్చందంగా కర్ఫ్యూ పాటించి మనం వారికిచ్చే గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెపుదామని అన్నారు. అలాగే సామాజిక దూరాన్నీ పాటించాలని చెప్పారు. అంతే మరుసటి రోజు దేశమంతా బంద్ అయ్యింది. కానీ ఆ సాయంత్రానికి ఏమయ్యింది? వందలు, వేల సంఖ్యలో భజనమండలులన్నీ రోడ్ల మీదికి వచ్చిపడ్డాయి. సామాజిక దూరం పాటించాలన్న సంగతి ఈ సమూహాల చెవికెక్కలేదు. సంఘీభావం అంటే కూడా బోధపడినట్టులేదు. ఎందుకంటే ఆమరుసటి రోజునుంచే దేశంలో డాక్టర్ల పట్ల వివక్ష మొదలయ్యింది. ఎవరి సేవలకు దేశమంతా శిరసువంచి కృతజ్ఞత తెలిపిందో మరుక్షణమే వారిని మెడలుపట్టి నెట్టేస్తుంటే జాతి యావత్తూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. ఇకపోతే పారిశుధ్య కార్మికులంటే ఈ దేశంలో ఎంత చిన్న చూపు ఉందో, ఎంత సామాజిక దూరం పాటిస్తుంటారో చెప్పనవసరం లేదు.

నిజానికి ఇప్పుడు కావాల్సింది సామాజిక దూరంకాదు. కేవలం భౌతికంగా కాస్తంత ఎడంగా ఉండడం. సామాజిక, మానసిక ఐక్యతతో కలిసి కట్టుగా ఉండడం. ఒకరికి, ఒకరం తోడుగా ఉన్నామనే భావన ఈ సమాజంలో, ప్రజల్లో, దేశంలో కలగడం. మనుషులు దగ్గరవడం. ఒకరికి ఒకరు ఒక మీటరో, మూడు ఫీట్లో దూరంగా ఉన్నంత మాత్రాన మనుషులు సామాజికంగా దూరం అయినట్టు కాదు. అలా కాకూడదు కూడా!

ప్రొ . ఘంటా చక్రపాణి
https://ghantapatham.blogspot.com

Comments are closed.

Exit mobile version