ఇరాన్ కీలక సైన్యాధికారి కాశిం సులేమానీని ఇరాక్ లో అమెరికా హత్య చేసింది. డమాస్కస్ నుండి విమానంలో బాగ్దాద్ చేరుకున్న ఆయన్ని లక్ష్యం చేసుకొని జనవరి 2వ తేదీ అర్ధరాత్రి దాటాక (మూడో తేదీ వేకువన) క్షిపణి దాడితో అమెరికా చంపింది. ఆయనతో పాటు ఇరాక్ లోని ఇరాన్ అనుకూల తిరుగుబాటు సంస్థల ప్రతినిధులు కూడా కొందరు మృతి చెందారు. ఆయన మృతితో ముఖ్యంగా ఇరాన్, ఇరాక్ దేశాల ప్రజల్లో ధర్మాగ్రహం కట్టలు తెంచుకుంది. ఇరాన్ లో మూడురోజులు నగరాలు, పట్టణాలు, పల్లెలు సంతాప ప్రదర్శనలు, సభలతో కదిలి పోయాయి. కోట్లాది జనం శోకసముద్రంలో మునిగి పోయారు. దీనికంటే అమెరికా పై ఆగ్రహ జ్వాలలతో రగిలి పోయారనడమే సరైనదేమో!
జనవరి 6న ఇరాన్ రాజధాని టెహారాన్ నగర వీధుల్ని జనం ముంచేత్తాయి. జనవరి 7న ఆయన స్వంత పట్టణం కెర్మన్ లో వీధులు కిక్కిరిసిపోయాయి. తొక్కిసలాటలోనే 57 మంది మృతి చెందారు. 1989 లో ఖోమైనీ మృతి సందర్భంగా అంతిమయాత్ర ఇరాన్ చరిత్ర లో ఇప్పటి వరకూ రికార్డు! దాన్ని బద్దలు కొట్టినట్లు వార్తలు వెలువడటం గమనార్హం! (నాటి తొక్కిసలాటలో 9మంది మృతి) కొన్ని వారాల క్రితం టేహారాన్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలో వేలాది ప్రదర్శకులు పాల్గొన్నారు. నేడు సులేమానీ హత్యని ఖండించడంలో దేశ ప్రజలు ఒకే గొంతుతో స్పందించారు. అట్టి జాతి జనుల ధర్మాగ్రహమే ఉగ్ర, అగ్ర రాజ్యమైన అమెరికా పై తక్షణ ప్రతీకారానికి ఇరాన్ సర్కారు ని పురికొల్పి వుంటుంది. అది అమెరికా సహజ ప్రతీకార విధానానికి బ్రేకు కూడా వేసింది. వర్తమాన ప్రపంచ గమనంలో అదో ముఖ్య మలుపు! దానికి ముఖ్యమైన కారకంగా నేడు కాశిం సులేమానీ అమరత్వం మారడం విశేషం!
పై తరహా హత్యలు చేయడం అమెరికాకి అలవాటే! గతంలో ఇలాంటివి పదులూ, వందలూ జరిగాయి. అమెరికాకి ఇవేమీ కొత్త కాదు. ప్రపంచ ప్రజలకు వాటిని వినడం కూడా వింత కాదు. దానికి అదో ‘హక్కు’ గా కూడా మారింది. ఆయా అమెరికా సంప్రదాయ ‘హక్కు’ ని కాశిం సులేమానీ అమరత్వం భగ్న పరిచింది. ఓ అగ్రరాజ్యానికి కేవలం ఒకే ఒక్క సులేమానీ అమరత్వం ఆయా దుస్థితిని కల్పించడం విశేషమే!
నిజానికి కాశిం సులేమానీ తరహా మరణాలు ప్రపంచానికి కొత్త కాదు. ఆయా మరణాలు సృష్టించే అమరత్వాలు కొత్త కాదు. అవి సృష్టించే ప్రజా ప్రతిఘటనలు కూడా కొత్త కాదు. ఐనా ఈసారి ఒక కొత్త అంశం వుంది. అది ఏమిటంటే, దురాక్రమణల చరిత్ర గల అమెరికాని తనపై దాడికి బదులు తీర్చుకోలేని ఆత్మరక్షణ స్థితికి నెట్టడం! తనకు ఎదురు లేదని విర్రవీగే మదపుటేనుగు వంటి అమెరికా అగ్రరాజ్యాన్ని చిట్టెలుక వంటి ఇరాన్ వెనకంజ వేయుంచడం! ఆయా స్థాయిలో సైనిక ప్రతిఘటనా శక్తిని నేడు సులేమానీ అమరత్వం ఇరాన్ కి కల్పించడం! అది కొత్త ఏడాది అమెరికాకి ఘోర రాజకీయ విషాదాన్ని మిగిల్చడం! అది వర్తమాన ప్రపంచ చరిత్రలో ఓ మైలురాయిగా లిఖించడం!
అంతకు ముందు కొన్ని రోజులుగా జరిగే సంఘటనల పరంపరలో భాగంగా ఇరాక్ లోని రెండు అమెరికన్ సైనిక స్థావరాలపై గత బుధవారం, అంటే ఈనెల 8న ఇరాన్ క్షిపణి దాడులకి దిగింది. ఆ దాడిలో 80 మంది అమెరికన్ సైనికులు కుక్కచావు చచ్చారని ఇరాన్ విజయగర్వంతో ఆరోజే అధికారిక ప్రకటన చేసింది. దానితో ఇరాన్ పై ‘అనకొండ’ విరుచుకు పడుతుందని ప్రపంచం ఉత్కంఠతగా ఎదురు చూసింది. ఆ కొండ విరుచుకు పడలేదు. పైగా అదే విరిగి పడినట్లు అయ్యుంది. అదే రోజు రాత్రి ట్రంప్ నోటి నుండి ‘గజం మిధ్య, పలాయనం మిధ్య’ వంటి ఓ ప్రకటన వెలువడింది. ‘ఏ ప్రాణ నష్టం ఇరాన్ నుండి మా అమెరికాకి జరగ లేదు, మా నుండి ఇరాన్ కి ఏ హాని వుండదు’ అనేది ట్రంప్ ప్రకటన సారం! ఇరాన్ కి అది హాని తలపెట్టక పోవడం శాశ్వత అంశం కాకపోవచ్చు. అది తాత్కాలిక అంశమే! కానీ తాత్కాలికంగానైనా ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. అయితే ఆ ఊపిరి పీల్చుకునే సంఘటన వెనక కూడా ఓ చరిత్ర వుంది. దాని పూర్వరంగ భౌతిక పరిస్థితి గూర్చి క్లుప్తంగా తెల్సుకుందాం.
ప్రపంచ చరిత్ర గమనంతో సంబంధం లేకుండా ఒంటరిగా ఏ ఒక్క దేశంలోనూ రాజకీయ ప్రాధాన్యతగల ఏ ఒక్క ప్రముఖ సంఘటన కూడా విడిగా జరక్క పోవచ్చు. పైకి విడివిడిగా మన కళ్ళకి కన్పించే సంఘటనల వెనక పరస్పర సంబంధం దాగి వుంటుంది. అటు తాజా ఇరాన్ ప్రతీకార చర్య, ఇటు అమెరికా తాత్కాలిక వెనకంజల మధ్య కూడా పరస్పర అనుబంధం వుంటుంది. నేటి ప్రాపంచిక రాజకీయ భౌతిక స్థితిగతుల వెలుగులో పరిశీలించాలి.
ట్రంప్ తాజా ప్రకటన అమెరికా ‘ఆత్మరక్షణ’ స్థితికి సంకేతం! అది ‘తాత్కాలిక’ స్థితే కావచ్చు. రేపు తాను ఓ ‘వ్యూహాత్మక’ ముందడుగు వేసే ముందు నేటి వెనకడుగు కావచ్చు. లేదంటే నిజంగానే వెనకంజ ఎత్తుగడ వేయాల్సిన వాస్తవ భౌతికస్థితి ని గుర్తించి కావచ్చు. ఏదైనా వరసగా ఎదురు దెబ్బలు తినే క్రమంలో తనకి ఎదురులేదని విర్రవీగే అగ్రరాజ్య అమెరికాకి ఇదో కోలుకోలేని ఎదురుదెబ్బ! తనపై ఈగవాలితే దుడ్డుకర్రతో ప్రతీకారదాడులకి దిగే అమెరికా సహజ విధానానికి విరుద్ధం! ఆయా ప్రతీకార చరిత్రకు భిన్నంగా గత బుధవారం ట్రంప్ సర్కారు ప్రకటన చేసింది. మెతుకుపట్టి అన్నం ఉడికిందీ లేనిదీ చెప్పొచ్చు. దీన్ని బట్టి కూడా వర్తమాన ప్రపంచ గమనంలో అమెరికా స్థితిని చెప్పొచ్చు.
నిజానికి గత బుధవారం రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి ఓ చిన్న సంకేతాత్మకమైనది మాత్రమే! ఆ తర్వాత ఇరాన్ చేసిన ప్రకటనలో ‘చివరి అమెరికన్ సైనికుడు చమురు వనరుల ప్రాంతమైన మధ్యప్రాచ్యం నుండి వైదొలిగేంత వరకూ ఈ సైనిక దాడులు సాగుతాయి’ అన్న హెచ్చరిక ముఖ్యమైనది. పైదాడిలో తన సైనికులు పది మందో వంద మందో మృతి చెందడం కంటే ఈ హెచ్చరిక అమెరికాకి ప్రతిష్ఠాత్మకమైనది. ఆ ప్రాంత చమురు నిల్వలపై తన అదుపు ను వదులుకునే పరిస్థితి వస్తే, అది అమెరికాకు ప్రతిష్ట కంటే అనేక రేట్లు నష్టం! ఐనా ఇరాన్ పై ప్రతీకారానికి అది ప్రస్తుతానికి దిగక పోవడం గమనార్హం! గతంలో ఎవరినీ ఇలా తాత్కాలికంగా కూడా ‘క్షమించిన’ చరిత్ర దానికి లేదు. ఇరాన్ దాడిలో తన సైనికులకి ఎట్టి ప్రాణనష్టం జరగలేదనే పేరుతో ప్రతీకార దాడుల్ని చేపట్టబోననడం నమ్మశక్యంగా లేదు. తన సైనికులు ఇరాన్ సైనికదాడిలో మరణించలేదని చెబుతున్న ట్రంప్ మాట కూడా యదార్ధం కాదని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. ఇరాన్ వంటి చిన్న దేశం ఎదుట తన లొంగుబాటును కప్పిపెట్టుకునే ప్రయత్నంలో భాగమని కూడా సందేహం కలుగుతోంది. దానికి రుజువు కోసం ఏ ఇతర ప్రత్యేక సాక్ష్యాలు అక్కరలేదు. భౌతిక స్థితిగతులే ప్రబల సాక్ష్యం!
నిజానికి సులేమానీ హత్య తర్వాత, ట్రంప్ ప్రభుత్వమే ఓ ముందస్తు హెచ్చరికని ఇరాన్ కి చేసింది. తనపై ఒకవేళ ప్రతీకార సైనిక దాడికి దిగితే, ఇరాన్ లో తాను ఎంపిక చేసిన 52 కీలక స్థానాలు, స్థావరాలపై ప్రతీకార దాడులతో విధ్వంసం చేస్తానని అమెరికా హెచ్చరించింది. తన పై ప్రతీకార దాడి జరక్కముందే కేవలం అనుమానంతో ట్రంప్ సర్కార్ అంతగా ఇరాన్ పై తెగ మొరిగింది. తనపై నిజంగానే దాడి జరిగాక అది కరవ లేదు. కనీసం మొరగడం కూడా చేయ లేదు. కన్నంలోనే దొరికిన దొంగ లా వ్యవహరించింది. అలాంటి దుస్థితి అమెరికాకి హఠాత్తుగా వచ్చింది కాదు. దాని వెనక ఓ నేపధ్య రాజకీయ చరిత్ర వుంది. (To be continued
-ఇఫ్టూ ప్రసాద్