Facebook X (Twitter) YouTube
    Saturday, September 30
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»National News»ఇంద్రుడి అమరావతి అందరిది కాదు!

    ఇంద్రుడి అమరావతి అందరిది కాదు!

    January 15, 20203 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 amaravati

    నగరం నిర్మించిన పాలకుడెవరు? 2

    అమరావతి ఆలోచనలో మరో లోపం కూడా ఉంది. ఎప్పుడో శతాబ్దాల క్రితమే నిర్మాణం ప్రారంభమై, దశాబ్దాలుగా రాజధాని నగరాలుగా వెలుగొందుతున్న అనేక నగరాలతో పోల్చితే అసలు ప్రారంభమేకాని అమరావతి నగరం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందనంత దూరమైంది. అమరావతిలో భూముల ధరలు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నయ్ వంటి నగరాల ధరలకు మించి సృష్టించబడ్డాయి. చుట్టుపక్కల ఇళ్ళ అద్దెలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తు ఎగిరిపోయాయి. మురికివాడలు లేని నగరంగా అమరావతి నిర్మించాలని అనుకోవడం ఆహ్వానించదగ్గ నిర్ణయమే అయినా, అసలు పేదలు, మధ్యతరగతి ప్రజలు ఈ నగర ప్రణాళికలో విస్మరించబడ్డారు. వీరి కోసం అమరావతిలో తలపెట్టిన నిర్మాణాలు లేకపోవడం ఇది ప్రజల నగరం అనే భావన లేకుండా చేసింది. కడతామన్నవి లేదా కట్టిస్తున్నామన్న గృహ సముదాయాలు మధ్య తరగతి ప్రజలకు అందనంత దూరంలోనే ఉన్నాయి. అమరావతి ప్రణాళికలో శ్రామిక వర్గానికి చోటు ఉంది అని ఎవరైనా చెప్పినా ప్రజల్లో అలాంటి నమ్మకం కలగలేదు.

    బహుళ అంతస్తుల నిర్మాణం గురించి ఆలోచించిన పాలకులు ఆ నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీల గురించి, రేపు నిర్మాణం పూర్తయ్యాక నిర్వహణకు పని చేసే కూలీల గురించి మర్చిపోయారు. ఆ భవనాన్ని శుభ్రంగా ఉంచే కార్మికులు, విద్యుత్ నిర్వహణకు అవసరమైన ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఫిట్టర్లు… ఇలా రకరకాల మనుషులు అవసరమని, వారికి కూడా ఇక్కడే, ఈ మురికి వాడలు లేని నగరంలో చోటివ్వాలని పాలకులు ఆలోచన చేయలేదు. అందమైన రోడ్ల ప్రణాళిక సిద్ధం చేసిన పాలకులు, ఆ రోడ్లు తుడిచే వాళ్ళు ఎక్కడుండాలో ప్రణాళికలో చెప్పలేదు. గ్రీన్ సిటీ అంటూ పార్కులు ప్రణాళికలో చూపిన పాలకులు ఆ మొక్కలను పెంచే తోటమాలి ఎక్కడ నివాసం ఉండాలో చెప్పలేదు. ఎలక్ట్రీషియన్, లిఫ్ట్ మెకానిక్, ఏసీ మెకానిక్ ఎక్కడ ఉండాలో చెప్పలేదు. చివరికి రాజ్ భవన్, లేదా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే వంట వారు కానీ, గూర్ఖా కానీ, ఆఫీస్ బాయ్ కానీ ఎక్కడుండాలో అమరావతి ప్రణాళికలో చెప్పలేదు. నగర ప్రణాళికలో పాలకులు విస్మరించిన అంశాలివి.

    మొదటి భాగం కోసం ఇది క్లిక్ చేయండి: నగరం నిర్మించిన పాలకుడెవరు?

    అసలు నగరం నిర్మించాలనుకోవడమే పాలకుడి పొరపాటు ఆలోచన అయితే, ఆ నిర్మాణంలో అడుగడుగునా, ప్రతినిత్యం అవసరమయ్యే నిరుపేదల జీవనాన్ని పట్టించుకోకపోవడం మరింత పెద్ద తప్పు. అందుకే ‘డబ్బు, అధికారం, అవకాశం’ ఉన్న ఆ కొద్దిమందికే అమరావతి నగరంలా కనిపించింది కానీ మిగతా ప్రజలెవ్వరికీ అది పట్టలేదు. పాలకుడి అద్దాలమేడను శుభ్రంగా ఉంచే కార్మికుడు, పాలకుడు పాదాలకు మట్టి అంటకుండా రోడ్లు శుభ్రం చేసే కార్మికుడు, డ్రైనేజీ పొంగి పొర్లకుండా చూసుకునే కార్మికుడు, పాలకుడికి రుచికరమైన వంటలు చేసిపెట్టే వంట వాళ్ళు, దేవుడి గదిలో పూజకు రోజూ పూలు తెచ్చి ఇవ్వాల్సిన అవ్వలు, పొద్దున్నే పాలు తేవాల్సిన పాలవాళ్ళు, పేపరు తేవాల్సిన పేపర్ బాయ్స్… ఇలా ఏ ఒక్కరూ అమరావతిని ‘మా నగరం’ అనుకోలేదు. వీరికెవరికీ భాగస్వామ్యం లేని ఏ నగరమైనా అది అమరావతే అవుతుంది.

    ts29 ap capital 1

    అయినా, ఇంద్రుడు నివాసం ఉండే అమరావతి అందరిదీ కాదుగా… సర్వ గణాధిపతులతో పాటు దేవ వేశ్యలైన రంభ, ఊర్వశి, మేనక వంటి వాళ్ళు ఉండి, గానా బజానాలతో ఉంటుందని చెబుతుంటారు. ఆ అమరావతిలో పుణ్యవంతులకే చోటున్నట్టు, ఈ అమరావతిలో డబ్బు, అధికారం ఉన్నవారికే చోటు అనే భావన కూడా మామూలు ప్రజల్లో కలిగింది. బహుశా ఈ నగరం తమది కాదనే భావన కలగడం వల్లనేమో ఆ నగరం ఉన్న నియోజకవర్గంలో (కార్మికులకు రిజర్వు చేసిన) కూడా పాలకుడికి ప్రజల ఆమోదం లభించలేదు.

    ఈ మధ్య కాలంలో చంద్రబాబు చెప్పే ‘సైబరాబాద్’ నగరం కూడా ఒక మంచి ఉదాహరణే. నేదురుమిల్లి జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, మాదాపూర్ ప్రాంతాన్ని ఐటీ కోసం ఎంపిక చేసి అక్కడ ఐటీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఐటీ భవనాన్ని సరికొత్త హంగులతో నిర్మించారు. ఆ తర్వాత కొన్ని ఐటీ కంపెనీలను ఆహ్వానించి ఆ భవనంలో వారి కార్యాలయాలకు విడిది ఏర్పాటు చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల అభివృద్ధి మొదలైంది. ఆ అభివృద్ధి పరిసర గ్రామాలకు విస్తరించి అంతిమంగా ‘సైబరాబాద్’ నగరం ఏర్పడింది. అంతేకాని సైబరాబాద్ నగరం మొత్తం పాలకులు నిర్మించింది కాదు.

    నగరాలన్నీ ఉపాధి ఆధారితంగా విస్తరిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు నగర ప్రణాళికల్లో ఈ ఉపాధి ఒక అంశంగా లేకుండా పోయింది. కేవలం మౌళిక వసతులు, భవన నిర్మాణ నిబంధనలు మాత్రమే ప్రాతిపదికగా నగరాల ప్రణాళికలు వస్తుండడంతో గ్రామాల్లో ఉపాధి కోల్పోయి పట్టణానికి వలస వచ్చే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేటి నగరాలు తయారు కావడం లేదు. అందువల్లనే నగరాల్లో నేరాల సంఖ్య పెరుగుతోంది. క్లబ్బులు, పబ్బులు విస్తరించినంత వేగంగా ‘ఉపాధి’ కేంద్రాలు నగరాల్లో తయారు కావడం లేదు.

    గ్రామాల్లో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురికావడంతో నిరుద్యోగం పెరిగి బతుకుదెరువుకోసం పట్టణానికి వలస వస్తే, ఎటు చూసినా 1960-80 నాటి ఉపాధి అవకాశాలు ఇప్పుడు కనిపించడం లేదు. నగర ప్రణాళికలో (Town Planning) ఉపాధి (employment) అనే అంశమే లేకుండా పోయింది. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఉపాధి కల్పించలేని నగరాలు ప్రజలను నేరస్తులుగా తయారు చేస్తాయి. లేదా సజీవ స్మశానాలుగా మిగిలిపోతాయి.
    (to be continued…)

    -దారా గోపి

    Previous Articleఅమెరికా ‘ప్రతీకార చరిత్ర’ను తిరగరాసిన సులేమానీ అమరత్వం!
    Next Article అమరత్వ అస్త్రం సులేమానీ!

    Related Posts

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.