పాఠకుడు బతికి ఉంటే పత్రిక చదువుతాడు… కానీ అతని ప్రాణానికే ప్రమాదం ఏర్పడిన పరిస్థితుల్లో పత్రిక మనుగడ మిన్న కాదుగా? జర్నలిస్టు సురక్షితంగా జీవించి ఉంటే పత్రికకు వార్తలు రాస్తాడు. కానీ ఆ విలేకరే ‘కరోనా వైరస్’ కోరల్లో చిక్కుకుంటే పత్రికలో అక్షరాలు రాసేవారెవరు? ఇప్పుడీ ప్రశ్నలన్నీ దేనికంటే… మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన తన కూతురి ద్వారా ఈ జర్నలిస్టుకు వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. కానీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా చేసిన పరిణామాల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆ జర్నలిస్టు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పటి మీడియా సమావేశంలో పాల్గొన్న మిగతా జర్నలిస్టులను క్వారంటైన్ కు పంపే దిశగా చర్యలు సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే మన తెలుగు రాష్ట్రాల్లోనూ పలు మీడియా సంస్థలు కూడా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ‘ప్రజాపక్షం’ దినపత్రిక ఈనెల 31వ తేదీ వరకు సెలవు ప్రకటించింది. కరోనా కారణంగా దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ, కొవిడ్-19 వైరస్ క్రిమి పేపర్ పై 18 గంటలపాటు సజీవంగా ఉంటుందని నిర్ధారణ అయిన కారణంగా పాఠకులు పత్రికను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని ‘ప్రజాపక్షం’ పత్రిక యాజమాన్యం నిన్ననే ప్రకటించింది. ఆయా అంశాలతోపాటు తమ సిబ్బంది ఆరోగ్యం, క్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని పత్రికకు ఈనెల 31వ తేదీ వరకు సెలవు ప్రకటిస్తున్నట్లు ‘ప్రజాపక్షం’ ఎడిటర్ కె. శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

కానీ ఇదే దశలో పత్రికల ద్వారా వైరస్ సోకదని, ప్రపంచంలోనే ఇటువంటి ఘటన ఒక్కటి కూడా లేదని, న్యూస్ ప్రింట్ పై వైరస్ వ్యాప్తి చెందదని, వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు తేల్చింది ఇదేనని ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ ‘ఇన్మా’ సీఈవో ఎర్ల్ విల్కిన్సన్ స్పష్టం చేసినట్లు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ గల ‘ఈనాడు’ పత్రిక మరో వార్తా కథనాన్ని తాజాగా ప్రచురించింది. ఈ నేపథ్యంలో అసలు విషయానికి వస్తే క్రిమి పేపర్ పై 18 గంటలపాటు వైరస్ సజీవంగా ఉంటుందని నిర్ధారణ అయిన కారణంగా పాఠకులు పత్రికను తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసిన ‘ప్రజాపక్షం’ ఎడిటర్ కె. శ్రీనివాసరెడ్డి సాధారణ జర్నలిస్టేమీ కాదు. అనేక జర్నలిస్టు ఉద్యమాలకు నాయకత్వం వహించి, జర్నలిజంలో అపార అనుభవం కలిగి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేేయూ)కు ప్రస్తుతం అధ్యక్షుని హోదాలో ఉన్న సీనియర్ సంపాదకుడు.

జాతీయ స్థాయి జర్నలిస్టు సంఘ నాయకుడే కరోనా వైరస్ గురించి వివరాలు వెల్లడిస్తూ, తాను సంపాదకత్వం వహిస్తున్న పత్రికకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికతోపాటు మరికొన్ని ప్రముఖ పత్రికలు కూడా పత్రికలు చదవడం వల్ల కరోనా సోకదనే సారాంశంతో పదే పదే వార్తా కథనాలు ప్రచురించడం, పాఠకున్ని కన్విన్స్ చేసేందుకు పడరాని పాట్లు పడుతున్న తీరు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ప్రసార సాధనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అయితే కరోనా కల్లోల పరిస్థితుల్లో తమ వ్యవస్థల్లో పనిచేసే సిబ్బందికి ప్రసార సాధనాల సంస్థలు ఎంత వరకు కనీస రవాణా, ఇతరత్రా సురక్షిత సౌకర్యాలు కల్పించిందన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే ‘దైనిక్ భాస్కర్’ వంటి ప్రముఖ పత్రిక ప్రచురణ సమయంలోనే ప్రతులపై ‘శానిటైజర్’ను స్ప్రే చేస్తున్న దృశ్యం తెలిసిందే. ఇటువంటి కనీస జాగ్రత్తలను మన తెలుగు పత్రికలు తీసుకుంటున్నాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలోనూ ఉగాది పండుగ రోజున ప్రధాన పత్రికలు తమ సిబ్బందికి కనీసం సెలవు కూడా ప్రకటించకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. యాజమాన్యాలకు పత్రిక మనుగడ ప్రధాన లక్ష్యం కావచ్చు, కానీ కరోనా కల్లోల పరిణామాల్లో అందులో పనిచేసే సిబ్బంది, వాటిని చదివే పాఠకుల ప్రాణాలు అంతకన్నా ముఖ్యమనేది నిర్వివాాదాంశం.

Comments are closed.

Exit mobile version