పోడు భూముల పోరులో ముగ్గురు పసిపిల్లల తల్లులను, పిల్లలను జైలుకు పంపిన ఘటన తీవ్ర కలకలానికి దారి తీసింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ పోడు భూములకు సంబంధించి మహిళా రైతుల విషయంలో అటవీ అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావు కల్పించింది. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు కథనం ప్రకారం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం ఎల్లన్న నగర్ లో పోడు భూముల పోరాటం సాగుతోంది. మహిళా రైతులపై రేంజర్ రాధిక కక్ష గట్టి దాడులకు పూనుకుంటుంటున్నారనేది న్యూ డెమోక్రసీ పార్టీ నేతల ఆరోపణ. ఈ ఘటనలో అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు గడచిన 24 గంటల్లో 21 మందిని అరెస్ట్ చేయగా, అందులో 18 మంది మహిళలే ఉన్నారు. పోడు భూములకు సంబంధించిన ఈ కేసులో మొత్తం 70 మందిని అటవీ అధికారులు నిందితులుగా చూపుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన 18 మంది మహిళల్లో ముగ్గురు చంటి పిల్లల తల్లులు కూడా ఉండడం గమనార్హం. వీరందరినీ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు.

జైలు పాలైన 18 మహిళల్లో ఎత్తెర మౌనిక అనే మహిళ మూడు నెల బాలింత. ఆలపాటి కవిత అనే మరో మహిళ 8 నెలల కావ్య అనే చిన్నారికి తల్లి. అదేవిధంగా రాణి అనే మహిళ ఏడాది వయస్సు గల అక్షిత అనే పాపకు మాతృమూర్తి. పోడు భూముల వివాదానికి సంబంధించి మహిళలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని న్యూడెమోక్రసీ పార్టీ నేతలు పోటు రంగారావు, గోకినపల్లి వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆయా మహిళలు, పసిపిల్లల తల్లులు కబ్జాకోర్లు కాదని, రౌడీలు అంతకన్నా కాదని, భూమికోసం, దానిమీద బతుకు కోసం తపిస్తున్న వారని ఆయా నేతలు పేర్కొన్నారు. ఫారెస్ట్ రేంజర్ రాధిక కక్ష కట్టి మరీ 307 సెక్షన్ కింది కేసులు పెట్టడడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఎల్లన్ననగర్ ప్రాంతంలో పైరవీకార్లు, కబ్జాకోర్లు, దళారీలు భూముల కాజేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అటవీ అధికారులు అటువంటివారితో సఖ్యతగా ఉంటున్నారని కూడా ఆరోపించారు.

పంట చేలను ధ్వంసం చేయవద్దని కోరితే హత్యాయత్నం చేసినట్లా? అని న్యూ డెమోక్రసీ నేతలు ప్రశ్నించారు. చంటి పిల్లలను జైలుకు పంపిస్తారా? ఇదేనా కేసీఆర్ ప్రభుత్వ దళిత, గిరిజన ఉద్ధరణ? అని ప్రశ్నించారు. ప్రజలమీద దాడి చేసినందుకు, దూషించినందుకు రేంజర్ రాధికపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని వారుడ డిమాండ్ చేశారు. అంతేగాక రాధికను ఆ ప్రాంతంలో విధుల నుంచి తప్పించాలని కోరారు. అక్రమ కేసులను ఉపసంహరించాలని, పోలీసు, అటవీ అధికారులు తప్పుడు కేసులకు తోడ్పడి ప్రజలను హింసించవద్దని కోరుతున్నట్లు న్యూ డెమోక్రసీ పార్టీ నేతలు పోటు రంగారావు, గోకినపల్లి వెంకటేశ్వర్ రావు కోరారు.

ఫొటో: రిమాండుకు వెళ్లిన మహిళల్లో పిసిపిల్లల తల్లులు ఉన్న దృశ్యం

Comments are closed.

Exit mobile version