కొన్ని సంఘటనలు వివాదాస్పదమవుతుంటాయి. ఇందులో ప్రముఖులుంటే తీవ్ర వివాదంగానూ మారుతుంటాయి. వాళ్లు రాజకీయ నాయకులైనా కావచ్చు, అధికారులు… మరెవరైనా కావచ్చు. ఇక చెప్పేదేముంది. ఇటువంటి వివాదంలో చిక్కితే మన మీడియా ఊరుకుంటుందా? సంచలనాత్మకంగా వార్తా కథనాలతో ‘చించే’స్తుంటుంది కూడా. ఈ ‘చించే’ పదమేంటి? అని ఆశ్యర్యపోకండి. వివాదాస్పదమైన పదాలను వాడక తప్పని అనివార్య పరిస్థితి.

ఇంతకీ విషయమేంటంటే పైన గల ట్వీట్, రీట్వీట్ కామెంట్ ను నిశితంగా పరిశీలించండి. తెలంగాణాలోని జగిత్యాల కలెక్టర్ రవి హీరోయిన్ రష్మిక మందన్నాపై చేసినట్లు పేర్కొంటున్న వివాదాస్పద ట్వీట్ ఇది. అదేదో సినిమా ప్రి-రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా తీయించుకున్న కొన్ని ఫొటోలను హీరోయిన్ రష్మిక తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోకు ‘కలెక్టర్ జగిత్యాల’ పేరు మీద ఉన్నట్విట్టర్ ఖాతా నుంచి ‘చించావ్ పో’ అంటూ కామెంట్ వచ్చింది. ఇదీ ప్రస్తుత తాజా వివాదం. అయితే ఈ వివాదంపై కలెక్టర్ రవి స్పందిస్తూ, తన ట్విట్టర్ అకౌంటును ఎవరో హ్యాక్ చేశారని, రష్మికపై చేసినట్లు పేర్కొన్న కామెంట్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

మొత్తం వివాదంలో చాలా మంది గమనించని ఓ విషయం దాగి ఉండడమే ఇక్కడ అసలు విశేషం. ‘చించావు పో’ అంటూ తెలుగు అక్షరాలను ఇంగ్లీష్ లో టైప్ చేయడమే ప్రత్యేకత కాగా, ఓ జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి తనకు ఇంగ్లీష్ రానట్టు ‘Chinchaavu Po’ అని ఎందుకు రాస్తారనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. అంతేగాక రష్మిక పేరును ‘Radhmika’ (రధ్మిక) అని సంబోధించడం గమనార్హం. ఓ జిల్లా కలెక్టర్ ఇలా స్పెల్లింగ్ మిస్టేక్ తో పేరు రాస్తారా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కంప్యూటర్లోగాని, మోబైల్లోగాని కీబోర్డులో S పక్కనే D ఉంటుంది కదా? పొరపాటున చేతివేలు S మీద కాకుండా పక్కనే గల D కీపై పడి ఉండొచ్చు కదా? అంటారా? ఏమో మరి? మొత్తంగా తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని మాత్రం కలెక్టర్ రవి జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి మరి.

Comments are closed.

Exit mobile version