వరంగల్ మహానగరంలో నిర్వహించిన ‘వెలమ’ల ఆత్మీయ సమ్మేళనంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హన్మకొండలోని అభిరామ్ గార్డెన్ లో ఆదివారం జరిగిన ఈ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గోని ప్రసంగిస్తూ, కేసీఆర్ తెలంగాణ పోరాటం చేసినప్పుడు తానూ తిట్టానని, అయితే విధాన పరంగా మాత్రమే మాట్లాడానని, ఇప్పుడు కొందరు కొత్త బిచ్చగాళ్ల లెక్క అరవలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పరోక్షంగా తాను చాలా చేశానని, తెలంగాణ వచ్చాక, సీఎం కేసీఆర్ పనులు, పథకాలు చూసి ఆయనను కాపాడుకోవాలని టీఆర్ఎస్ లో చేరానని ఎర్రబెల్లి అన్నారు. వెలమ సంఘం భవనానికి ఐదు ఎకరాల భూమని కేసీఆర్ ఇచ్చారని, కేసీఆర్ తోపాటు తన గౌరవం పెరిగేలా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఉండాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. సమాజంలో పలుకుబడి ఉన్న, ప్రజల్ని ప్రభావితం చేయగలిగిన మనం టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు.

అదేవిధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, కేవలం నాలుగు అంశాలు తప్ప ఎన్నికల హామీలన్నీ నెరవేర్చామన్నారు. సీఎం కేసీఆర్ చేసిన ఆయా పథకాలను మెచ్చుకోలేని కొందరు వ్యక్తులు, కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రాజకీయ వైషమ్యం, అధికార దాహంతో సిగ్గు విడిచి విమర్శిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేసిన పనులు, చేపట్టిన పథకాలు వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా చేయలేరన్నారు. ఈ సమ్మేళనంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, డైరెక్టర్ జగన్ మోహన్ రావు తదితర వెలమ సామాజిక వర్గ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.

Comments are closed.

Exit mobile version