తోపు జర్నలిజం అంటే ఏమిటి? అన్ని పత్రికలు ముందేసుకుని ‘కిచిడీ’ చేయడం కాదు. పాత విషయాన్నే తిరగేసి, మరగేసి కొత్తగా ‘వంటకం’ చేయడం కానే కాదు. ఓ ఎమ్మెల్యేకో, మరెవరో నాయకుడికో చెంచాగిరీ చేస్తూ పెద్ద జర్నలిస్టుగా చెలామణి కావడం అంతకన్నా కాదు. మరేమిటి అంటున్నారా? ఎవరికీ తెలియని విషయాన్ని తెలుసుకుని తాను మాత్రమే అందరికన్నా ముందుగా సమాజానికి తెలియజేయడం. ఇది తనకు మాత్రమే సాధ్యమని వృత్తి నైపుణ్యం ద్వారా నిరూపించుకోవడం. కృష్ణంరాజు నటించిన ‘అంతిమ తీర్పు’ సినిమా టైపు కాదు. వాస్తవిక జర్నలిస్టుగా భారీ ప్రాచుర్యం పొందడం. ముంబయికి చెందిన సుధీర్ సూర్యవంశీ ప్రస్తుతం ఇదే తరహాలో జర్నలిజంలో హీరోగా నిలిచాడు. అతన్నేమీ ‘కొని’ తెచ్చిపెట్టుకున్న అవార్డులు, రివార్డులు వరించలేదు. తాను ప్రజలకు అందించిన వార్తా విశేషాలు ఇప్పడు మీడియా రంగంలో సుధీర్ ను కూడా ఓ ప్రముఖ వార్తగా నిలిపాయి. న్యూస్ కవరేజీ అంశంలో ప్రధాన మీడియా దుస్తులు విప్పి మరీ బజారున నిలబెట్టినంత పని చేశాడు సుధీర్.

వాస్తవానికి సుధీర్ చేతిలో ప్రస్తుతం ఎటువంటి పత్రికా లేదు. టీవీ ఛానల్ కూడా లేదు. ఏ సంస్థలోనూ ప్రస్తుతం ఉద్యోగి కూడా కాదు. కాకపోతే అతను కొద్ది నెలల క్రితం వరకు జర్నలిస్టు. సుధీర్ గతంలో ఢిల్లీ నుంచి వెలువడే డీఎన్ఏ (డెయిలీ న్యూస్ అనాలసిస్) అనే పత్రికలో రిపోర్టర్ గా పనిచేశారు. ముద్రణా రంగంలో ఏర్పడిన భారాన్ని తట్టుకలేక గత అక్టోబర్ నెలలో దాని యాజమాన్యం ఆ పత్రికను మూసేసింది. ప్రస్తుతం ఆన్ లైన్ ఎడిషన్ మాత్రమే వస్తున్నట్లుంది. పాత్రికేయునిగా దశాబ్ధంన్నర అనుభవం గల సుధీర్ రాజకీయాలు, వ్యవసాయ, రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాయడంలో దిట్టగా ప్రాచుర్యం పొందారు. జీ న్యూస్, ముంబయి మిర్రర్ వంటి వార్తా సంస్థలకు వ్యాసాలు కూడా రాశారు. అయితే డీఎన్ఏ పత్రిక మూసివేత ఫలితంగా రోడ్డున పడిన సుధీర్ తన పరిస్థితిపై ఏ మాత్రం డీలా పడలేదు. సొంతంగా న్యూస్ వెబ్ సైట్ గాని, వెబ్ పోర్టల్ గాని ప్రారంభించాలని యోచించారు.

ఈ పరిస్థితుల్లోనే మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ‘కట్టా న్యూస్’ అనే వేదిక నుంచి అనేక సెన్సేషనల్ వార్తా కథనాలు వచ్చాయి. మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన సంచలన పరిణామాలను అందరికన్నా ముందు ‘కట్టా న్యూస్‌’ వెల్లడించి సంచలనం సృష్టించింది. ఎన్సీపీకి చెందిన శాసనసభా పక్ష నేత అజిత్ పవార్ నాయకత్వాన ఓ వర్గం చీలిపోయి బీజేపీతో చేతులు కలపనుందని ఈనెల 20వ తేదీన వెలువరించిన వార్తా కథనం 23వ తేదీన వాస్తవ రూపం దాల్చింది. అదే రోజు సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయా పరిణామాల్లో అజిత్ పవార్ కు నచ్చజెప్పడం తన వల్ల కావడం లేదంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అసహనం వ్యక్తం చేసినట్లు కూడా కట్టా న్యూస్ మరో వార్తా కథనాన్ని వెల్లడించింది. బీజేపీతో చేతులు కలిపిన నేపథ్యంలో అజిత్ పవార్ పై గల రూ. 70 వేల కోట్ల అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులను మాఫీ చేయబోతున్నారంటూ కట్టా న్యూస్ మరో సంచలనాత్మక కథనాన్ని వెల్లడించింది. ఈ అంశంలో మహారాష్ట్ర ఏసీబీ తీరుపై విమర్శలు రావడం, ఆ తర్వాత నాలుక మడతేసి అటువంటిదేమీ లేదని అక్కడి ఏసీబీ డీజీ వివరణ ఇవ్వడం కూడా తెలిసిందే. ఇటువంటి సంచలనాత్మక కథనాలను అందించిన కట్టా న్యూస్ మహారాష్ట్రలో పెద్ద పత్రికా కాదు, న్యూస్ ఛానల్ అంతకన్నా కాదు. కేవలం ఓ ట్విట్టర్ వేదిక. డీఎన్ఏ పత్రిక మూతతో రోడ్డున పడ్డ సుధీర్ అనే జర్నలిస్టు గురించి ముందే చెప్పుకున్నాం కదా? ఆ జర్నలిస్టుదే ఈ ట్విట్టర్ ఖాతా. దీని ద్వారానే సుధీర్ మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను అందరికన్నా ముందుగా, వేగంగా అందించి పలువురు రాజకీయ నాయకుల, సామాజిక కార్యకర్తల నుంచి జేజేలు అందుకున్నారు. ఈనెల 18వ తేదీన తన ట్విట్టర్ ఖాతా ద్వారా కట్టా న్యూస్ ను ఏర్పాటు చేసిన సుధీర్ 20వ తేదీ నుంచే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను వరుసగా అందించి సంచలనం సష్టించారు. ‘కట్టా‘ అంటే మరాఠీ భాఫలొ వార్తా విశేషాలు తెలుసుకునేందుకు ప్రజలంతా ఓ చోట గుమిగూడటం అని అర్థమట. ఇప్పడు మరాఠా ప్రజలు ‘కట్టా న్యూస్’ గురించే గుంపులు గుంపులుగా చర్చించుకుంటున్నారట. కొసమెరుపు ఏమిటో తెలుసా? ముంబయిలోని ఆంటిలియా నివాసంలో అడుగిడిన ముఖేష్ అంబానీ ఇంటి మొదటి నెల కరెంటు బిల్లు రూ. 70 లక్షల రూపాయలు అనే సంచలన వార్తను వెలుగులోకి తీసుకువచ్చింది కూడా ఈ సుధీరే.

Comments are closed.

Exit mobile version