ఒక నాయకుడు. మూడు పత్రికలకు చెందిన వెబ్ సైట్ల వార్తా కథనాలు. ఘటన ఒక్కటే. ప్రాంతమూ అదే. కానీ ఎవరి రచనా నైపుణ్యం వారిదే. ఓ సైట్ పూలవర్షం కురిసింది అంటుంది. మరో సైటు రాళ్ల దాడి జరిగిందని నివేదిస్తుంది. రైతులు ఆగ్రహించి నిరసన తెలిపారని, అడుగడుగునా అడ్డుకున్నారని, దిష్టిబొమ్మలు కూడా దహనం చేశారని ఇంకో సైటు విశదీకరిస్తుంది. ఇంతకీ అక్కడ కురిసింది పూలవర్షమా? రాళ్ల వానా? ఏదీ తేల్చుకోలేని అయోమయ స్థితి పాఠకులది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం అమరావతిలో పర్యటించిన సందర్భంగా ప్రముఖ తెలుగు దిన పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి సంస్థలకు చెందిన వెబ్ సైట్లలోని వార్తా కథనాల తీరు భిన్నరకాలుగా ఉండడ విశేషం. ఈ మూడు వార్తా కథనాలు చదివాక ఏది కరెక్ట్? అనే ప్రశ్న మాత్రం వేయకండి. ఎందుకంటే ఆయా పత్రికల తీరుపై గతంలో, ప్రస్తుతం అధికారంలో గల నేతలు చేసిన విమర్శలను కూడా ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ తర్వాత ఏది నిజమనేది మీ ఆలోచనా శక్తికి పరీక్ష.

ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఫొటో

ఆంధ్రజ్యోతి కథనం:

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు. చంద్రబాబు అమరావతి పర్యటనను అడ్డుకునేందుకు అడుగడుగునా యత్నించారు. ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు విసిరారు. చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ వర్గీయులను రోప్ పార్టీ అడ్డుకుంది.

ఈనాడు కథనం:

ఈనాడు కథనంలో ప్రచురించిన చంద్రబాబు ఫొటో

ఏపీ రాజధాని అమరావతి పర్యటనలో ఉన్న చంద్రబాబు..ఉద్దండరాయుడిపాలెం వద్ద గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక రైతులు, మహిళలు పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. ప్రపంచం గర్వించే రాజధాని నిర్మాణం కొనసాగించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధాని నిర్మాణం ఆపడం అంటే.. 33 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులను అవమానించడమే అని వారు పేర్కొన్నారు. అనంతరం వారందరితో కలిసి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లి.. అక్కడ చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు.

సాక్షి కథనం:

సాక్షి ప్రచురించిన ఫొటో

రాజధానిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలపుతున్న తమపై పచ్చపార్టీ శ్రేణులు గుండాల్లా దాడులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అన్నదాతలపై టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ రాజధాని ప్రాంతం రైతులు గురువారం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజధాని పేరుతో భూములు తీసుకుని చంద్రబాబు తమకు అన్యాయం చేశారని, ఈ అన్యాయాన్ని నిలదీయడానికి వస్తే..  చంద్రబాబు విజయవాడ గుంటూరు నుంచి తీసుకువచ్చి రౌడీలను తీసుకొచ్చి తమపై దాడి చేయించారని రైతులు మండిపడుతున్నారు. రాజధానికి‌ భూములు ఇచ్చినందుకు ప్రతిఫలంగా చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో తమపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి చంద్రబాబుకు కచ్చితంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు, నిరసనల నడుమ చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు రాజధానిలో పర్యటిస్తున్నారు.

Comments are closed.

Exit mobile version