మేడారం మహా జాతర ఘట్టం ప్రారంభమైనట్లే. నేటి నుంచి నాలుగు రోజులపాటు జరిగే జాతరకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కోటి మందికిపైగా భక్తుల హాజరవుతారని అధికారగణం అంచనా. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిషా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై వన దేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటారు. జాతర ప్రారంభానికి ముందే యాభై లక్షలకు పైగా భక్తులు మేడారాన్ని సందర్శించి ముందస్తు మొక్కులు చెల్లించుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే జాతరకు సమ్మక్క కుటుంబీకులు వివిధ ప్రాంతాల నుంచి మేడారంలోని గద్దెలపైకి చేరుకుంటారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును మంగళవారం తీసుకొని పూజారులు బయలుదేరారు. కాలినడకన 66 కిలోమీటర్లు ప్రయాణించడం ద్వారా పగిడిద్దరాజును మేడారం తీసుకువస్తారు. మార్గమధ్యంలో గోవిందరావుపేట మండం లక్ష్మీపురం గ్రామంలో మంగళవారం రాత్రి బస చేశారు. బుధవారం  రాత్రి పగిడిద్దరాజు మేడారం చేరుకుంటారు.

అదేవిధంగా సమ్మక్క కూతురైన సారలమ్మను మేడారం సమీపంలో గల కన్నెపల్లి నుంచి తీసుకువస్తారు. మేడారానికి సుమారు 3.5 కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గ్రామంలో కొలువై ఉన్న సారలమ్మను బుధవారం సాయంత్రం 5 గంటలకు పూజారులు తీసుకొస్తారు. సారలమ్మ జంపన్నవాగు వద్దకు వచ్చేసరికి పగిడిద్దరాజు, గోవిందరాజ పూజారులు సిద్ధంగా ఉంటారు. వీరంతా వాగులో నుంచి నడుచుకుంటూ గద్దెల ప్రాంగణానికి తరలివస్తారు. వేలాది మంది భక్తజనులు అనుసరిస్తారు. గద్దెలపై ఆయా దేవుళ్లు కొలువుదీరడంతో మేడారం మహా జాతర అట్టహాసంగా ప్రారంభమవుతుంది.

సమ్మక్క తల్లి రాకతో మేడారం జాతర ఘట్టం విశేష స్థాయికి చేరుకుంటుంది. జాతర జరిగే గద్దెల సమీపాన్నే గల చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గురువారం సాయంత్రం గద్దెలపైకి తీసుకురానున్నారు. తుపాకీ కాల్పుల మధ్య అధికారిక లాంఛనాలతో సమ్మక్క తల్లిని తీసుకొస్తారు. మేడారం జాతరలో అత్యంత కీలక దృశ్యం సమ్మక్కను గద్దెపైకి తీసుకురావడమే. అనంతర భక్తులు తమ మొక్కుబడులను చెల్లిస్తారు.

ఫొటో: పూనుగొండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు

Comments are closed.

Exit mobile version