మరో నాలుగు రోజుల్లో మేడారం జాతర ప్రారంభమవుతుంది. జాతర ప్రాశస్త్యం, ప్రతాపరుద్రుడి కప్పం కథ, సమ్మక్క-సారక్కల పోరాట పటిమ, జంపన్నవాగుకు పేరెలా వచ్చింది.. తదితర అంశాల గురించి అనేక వార్తలు వస్తుంటాయి. కానీ మేడారం జాతరలోని చరిత్రలో అరుదైన, ఆసక్తికర అంశాలు అనేకం పెద్దగా వ్యాప్తిలోకి రాకుండా ఉంటాయి. ప్రస్తుతం మీరు చదవబోయే ఆసక్తికర అంశం కూడా అందులో భాగమే.

తెలంగాణాలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లోని అనేక ప్రాంతాలలో కామన్ పేర్లు గల వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు తెలుసా? ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంటుంది. ఆయా పేర్లేమిటో తెలుసా? సమ్మయ్య, సారయ్య, సమ్మక్క, సారక్క, జంపన్న పేర్లు గల వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. ఆదివాసీ తెగల్లోనైతే ఈ సంఖ్య మరీ ఎక్కువ. తెలంగాణాలోని అనేక ప్రాంతాల్లో కులాలకతీతంగా వనదేవతల పేర్లతోనే కాదు, సమ్మక్క కుమార్తె, కుమారుడి పేర్లతోనూ చాలా మంది ఉంటారు. ఇక జాతర సమయంలో అక్కడే జన్మించిన పిల్లలకు ఖచ్చితంగా సమ్మక్క లేదా అమ్మవారి కుటుంబీకుల పేర్లతోనే నామకరణం చేస్తుంటారు.

వనదేవతల ఆశీస్సుల కోసమే కాదు ఇంకా అనేక అంశాల్లో సెంటిమెంట్ పరంగా ఈ పేర్లను భక్తులు తమ సంతానానికి పెడుతుంటారు. ఎందుకంటే..? సమ్మక్క అంటే ఓ శక్తి. ఆ పేరులోని పవర్ తమ పిల్లలకు సంక్రమిస్తుందనే విశ్వాసం భక్తుల్లో మెండుగా ఉంటుంది. తన జాతి అస్తిత్వం కోసం అసువులు బాసిన మేడారం వనదేవతల పేర్లకు గల ‘పవర్’ తమ పిల్లలకు రక్షాకవచంగా ఉంటుందని నమ్ముతుంటారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుని సైనిక శక్తికి సరిపడా సైన్యం లేకపోయినా అన్యాయాన్ని ఎదిరిస్తూ పోరాడిన సమ్మక్క, సారలమ్మల ధైర్యం, తెగువలు తమ సంతానానికి కూడా సంక్రమించాలని భక్తులు భావిస్తుంటారు. గెలుస్తామా? ఓడుతామా? అనే ప్రశ్నలతో సంబంధం లేకుండా ప్రజారక్షణే ధ్యేయంగా ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వనదేవతల పేర్లను ఎంతో ప్రీతిపాత్రంగా, అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తారు. అందుకే వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో సమ్మక్క, సారక్క, సమ్మయ్య, సారయ్య, జంపన్న, గోవిందరాజు, నాగులమ్మ, పగిడిద్దరాజు, సమ్మారావు, సమ్మిరెడ్డి వంటి పేర్లు ఎక్కువగా ఉంటాయి.

Comments are closed.

Exit mobile version