తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసోం పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలున్నాయా? అసోం పోలీసులు అదే యోచనలో ఉన్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. సర్జికల్ స్ట్రయిక్స్ అంశంపై తెలంగాణా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అసోం బీజేపీ నేతలు స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు అసోం పోలీసులు కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్జికల్ స్ట్రయిక్స్ పై కేసీఆర్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎంను బీజేపీ నాయకత్వం ప్రోత్సహిస్తుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

రాహుల్​పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని వదిలిపెట్టనని చెప్పారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ కు సంబంధించిన ఆధారాలు కేంద్రం బయటపెట్టాలని రాహుల్​ గాంధీ డిమాండ్​ చేయటంలో తప్పేమీ లేదని కేసీఆర్​ అన్నారు. తాను కూడా ఇప్పుడు వాటి ఆధారాలు అడుగుతున్నానని కేసీఆర్ అన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ను పొలిటికల్‌ స్టంట్‌ గా దేశంలో సగం మంది నమ్ముతున్నారని, ఇందులో నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Comments are closed.

Exit mobile version