మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర మరో పది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జాతర జరగనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరలో నాలుగు రోజుల జాతర ప్రధాన ఘట్టాల విశేషాలు మీకోసం..

ఫిబ్రవరి 21: మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గద్దెల మీదకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు

ఫిబ్రవరి 22వ తేదీ గురువారం రోజున చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవత రాక.

ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం రోజున గద్దెలపై సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు భక్తులు మొక్కుల సమర్పణ.

ఫిబ్రవరి 24: మాఘశుద్ధ పౌర్ణమి శనివారం రోజున అమ్మవార్ల వన ప్రవేశం, మహా జాతర ముగింపు.

ఫిబ్రవరి 28: మాఘశుద్ధ బహుళ పంచమి బుధవారం రోజున తిరుగువారం పండుగ.

తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే జాతర ప్రక్రియను ఫిబ్రవరి 21న మాఘశుద్ధ పంచమి బుధవారం రోజున మండె మెలగడం, గుడి శుద్ధీకరణతో ప్రారంభిస్తారు.

కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో మేడారం జాతర ఊపందుకుంటుంది. సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు సుమారు 3 కి.మీ. దూరంలో ఉండే ఈ గ్రామంలోని ఆలయంలో ప్రతిష్టించిన సారలమ్మను ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకకు ముందే కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు.

జాతరలో అత్యంత ముఖ్యమైనది రెండోరోజు. ఫిబ్రవరి 22వ తేదీ గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుంది. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క రూపాన్ని చేతపట్టుకుని ప్రధాన పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి వర దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం భక్తిపారవశ్యంతో ఊగిపోతుంది.

గద్దెలపై ఆసీనులైన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ భక్తజనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు అప్పజెప్పుతారు.

జాతర ముగిసిన నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. అనంతరం భక్తులు తమ తమ ఇళ్లకు తిరుగు పయనమవుతారు.

Comments are closed.

Exit mobile version