‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా‘ అంటుంటారు. నీవు ఎవరికీ చెడు విద్యలు నేర్పించకు. అవతలి వాడు ఆ విద్యలు నీ మీద కూడా ప్రయోగించగలడు. నీటిలో నీ ముఖం ప్రతిబింబించినట్టుగా నీవు ఇతరులకి నేర్పిన విద్య నీ మీద కూడా ప్రతిఫలించ గలదు. ఇదీ ఆ దెప్పిపొడుపు సూక్తికి పూర్తి నిర్వచనం.

మహారాష్ట్ర తాజా రాజకీయాల్లో అజిత్ పవార్ తెలుసు కదా? శుక్రవారం అర్థరాత్రి రక్తికట్టిన మహా రాజకీయంలో ఇప్పడు అతని పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కు స్వయానా అన్న కొడుకు ఈ అజిత్ పవార్. బాబాయ్ శరద్ పవార్ నలభై ఏళ్ల క్రితం చేసిన రాజకీయ విన్యాసాన్నే అజిత్ పవార్ ప్రస్తుతం నిర్వహించడం విశేషంగా దేశవ్యాప్తంగా పత్రికలు, ఛానళ్లు ఉటంకిస్తున్నాయి. ఇంతకీ అప్పట్లో ఏం జరిగిందంటే…

దేశంలో ఎమర్జెన్సీ ముగిసిన అనంతరం 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేక పవనాలు వీచాయి. కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలుగా చీలిన పరిణామం. కాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్ (ఎస్)లుగా పార్టీ చీలింది. ప్రస్తుత ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తన రాజకీయ గురువు యశ్వంతరావు చవాన్ తో కలసి కాంగ్రెస్ (ఎస్)లో కొనసాగారు. ఈ నేపథ్యంలోనే 1978లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ప్రజలు పూర్తి ఆధిక్యతను కట్టబెట్టలేదు. కాంగ్రెస్ (ఐ) 65, కాంగ్రెస్ (ఎస్) 69, జనత పార్టీ 99 సీట్ల చొప్పను కైవసం చేసుకున్నాయి. కానీ జనతా పార్టీకి అధికారం చేజిక్కకుండా రాజకీయ పావులు కదిలాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ (ఎస్)కు చెందిన వసంత్ దాదా పాటిల్ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ (ఐ)కి చెందిన నాసిక్ రావు తిర్పుడే ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది. మన దేశ రాజకీయాల్లో కిచిడీ సర్కార్ల ఆయుష్షు సంగతి తెలిసిందే కదా. అప్పట్లోనూ అవే పరిణామాలు. అధికారంలో గల రెండు పార్టీల మధ్య పొసగక విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రభుత్వం నడపడమే అత్యంత కష్టంగా మారింది. ఇదే సమయంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నశరద్ పవార్ తన పదవికి రాజీనామా చేయడమే కాదు, ఏకంగా కాంగ్రెస్ (ఎస్) పార్టీ నుంచి బయటకు వచ్చారు. అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తో గల సత్సంబంధాలను అవకాశంగా మల్చుకుని ఆ పార్టీ మద్ధతుతో ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. తాను బయటకు వచ్చిన కాంగ్రెస్ (ఎస్)కు చెందిన 69 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది పవార్ కు మధ్ధతుగా నిలవగా, 99 మంది ఎమ్మెల్యేల బలం గల జనతా పార్టీ అండతో ముఖ్యమంత్రిగా శరద్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పవార్ సీఎం సంబరం మూన్నాళ్ల ముచ్చటే అయింది. కేంద్రంలో ఇందిరాగాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చిందే తడవుగా 1980లో శరద్ పవార్ సర్కార్ ను బర్తరఫ్ చేశారు. బాబాయ్ శరద్ పవార్ దారిలోనే ప్రస్తుతం అజిత్ పవార్ నడవడం గమనార్హం. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ సీఎం కాలేకపోయినా, డిప్యూటీ సీఎం అయ్యారు. నలభై ఏళ్ల క్రితం శరద్ పవార్ చేసిన రాజకీయ విన్యాసాన్నే అజిత్ పవార్ ప్రస్తుతం ప్రదర్శించడం విశేషం.

Comments are closed.

Exit mobile version