ఇండియన్ ప్రీమియర్ లీగ్. దీన్నే షార్ట్ కట్ లో ఐపీఎల్ అంటారుట. ట…అనే పదం ఎందుకు వాడుతున్నానంటే క్రికెట్ గురించి పెద్దగా గ్రిప్ లేదు కాబట్టి. దాదాపు 22 ఏళ్ల క్రితం ఓ పెద్ద పత్రికలో ఇంటర్వ్యూకు వెళ్లినపుడు ఆ పత్రిక చీఫ్ ఎడిటర్, అసోసియేట్ ఎడిటర్, చీఫ్ న్యూస్ ఎడిటర్ తోపాటు సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ అర్థరాత్రి 1.30 గంటలకు ఇంటర్వ్యూ చేశారు. అర్థరాత్రి ఇంటర్వ్యూ ఏమిటని అడక్కండి. ఆ పత్రికలో అప్పుడు అదే ట్రెండ్. అక్కడ ఉద్యోగం కావాలంటే ఆ సమయంలో జరిగే ఇంటర్వ్యూలకు అటెండ్ కావలసిందే. పత్రికా రంగంలో యోధానుయోధులైన ఆయా పెద్దలతోపాటు పత్రిక యజమాని నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. ఆదివాసీల నుంచి సమకాలీన రాజకీయాలు, సాహిత్యం తదితర అన్ని అంశాలపై ప్రశ్నలు కురిపించారు. గిరిజనులంటే బంజారాలు మాత్రమే కాదని, వారిలో కోయలు, గోండులు, చెంచులు, భగత వంటి అనేక జాతులవారు ఉంటారనే విషయాన్ని సంస్థ చైర్మెన్ నా సమాధానాలవల్ల తెలుసుకున్నందుకు నేను గర్వపడ్డాను కూడా. అంత డెప్త్ గా సాగింది మరి ఇంటర్వ్యూ. అనేక అంశాలపై అడిగిన అన్నిప్రశ్నలకూ జవాబు చెప్పాను… ఒక్క క్రికెట్ గురించి తప్ప. ఎందుకంటే నాకు దాని గురించి మొదటి నుంచీ ఆసక్తి లేదు. తెలుసుకోవాలనే ఆశ కూడా ఎన్నడూ పుట్టలేదు. దాదాపు ఇంటర్వ్యూ పూర్తయిందని భావిస్తున్న దశలో క్రికెట్ గురించి ఏదో ప్రశ్న అడిగారు చైర్మెన్. నాకు తెలియదని చెప్పాను. మరి క్రీడల వార్తలు ఎలా కవర్ చేస్తావు? అని అడిగారు పత్రికా యజమాని. అందుకు స్పోర్ట్స్ రిపోర్టర్ ఉంటాడు సర్, అతను చూసుకుంటాడు అని చెప్పాను. యజమాని అసోసియేట్ ఎడిటర్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అతను చెప్పేది కరెక్టేనన్నట్లు అసోసియేట్ ఎడిటర్ సైగ చేశారు. మొత్తానికి అర్థరాత్రి ఇంటర్వ్యూ పూర్తయింది. ఉద్యోగం కూడా వచ్చింది. ఈ సోది అంతా ఎందుకు అనుకుంటున్నారు కదూ? వస్తున్నా…వస్తున్నా..అక్కడికే వస్తున్నా…ఓ ముఖ్య విషయం చెప్పాలంటే కాస్త ఉపోద్ఘాతం వంటి జ్ఞాపకం కూడా అవసరమే.

ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు మిత్రుడు ఉన్నాడు. శ్రేయోభిలాషి కూడా. రెండు రోజుల క్రితమే ఫోన్లో పిచ్చాపాటీ మాట్లాడుతూ, సార్, ఐపీఎల్ గురించి మీ వెబ్ సైట్లో మంచి స్టోరీ రాయకూడదా? అని కోరాడు. నీకు తెలుసు కదా? నేను స్పోర్ట్స్ రిపోర్టింగ్ లో వీక్ అని నిట్టూర్చాను.

అయ్యో…అది కాదు సార్…ఐపీఎల్ అంటే క్రికెట్ గురించి కాదు…రాజకీయాల గురించి అన్నాడు. ఐపీఎల్ అంటే క్రికెట్టే కదా? రాజకీయమేమిటి? అని మళ్లీ ప్రశ్నించాను.

ఐపీఎల్ క్రికెట్లో క్రీడాకారులు ఏ దేశానికి చెందినవారైనా, మరే రాష్ట్రానికి చెందిన వారైనా వాళ్ల, వాళ్ల దేశం, రాష్ట్ర టీముల్లోనే కాదు సర్…ఏ టీముల్లోనైనా, ఎక్కడైనా క్రికెట్ ఆడవచ్చు అన్నాడు.

అదేమిటీ? అని ప్రశ్నించాను. ఎందుకంటే అదేమిటో నాకు నిజంగానే తెలియదు కాబట్టి. (క్రికెట్టు గురించి అసలే తెలియదని ముందే చెప్పాను కదా?)

అంటే…ఆటగాడు ఎక్కడివాడన్నది ఐపీఎల్ లో ముఖ్యం కాదు. ఏ టీములోనైనా ఆడవచ్చు. అదే ఐపీఎల్ ప్రత్యేకత. ప్రస్తుత రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి కదా? అన్నాడు ఆ స్పోర్ట్స్ జర్నలిస్టు మిత్రుడు.

అప్పుడు గాని విషయం బోధపడలేదు. నిజమే కదా? రాజకీయాలు ఐపీఎల్ తరహాలోనే ఉన్నాయి కదా? అని బోధపడుతున్నది.

ముందు తెలంగాణా రాష్ట్రాన్నే తీసుకోండి. గత ప్రభుత్వంలో తెలుగుదేశం తరపున గెల్చిన ఎమ్మెల్యేలు కేసీఆర్ మంత్రివర్గంలో చోటు సంపాదించారా? లేదా?

మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెల్చిన అనేక మంది ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకోకపోయినా, కేసీఆర్ సర్కార్ చేస్తున్న అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారా? లేదా?

అంతెందుకు? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తరపున గెల్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి నాయకులు ఆ పార్టీ తీరును, అధ్యక్షుని వైఖరిని తూర్పారబడుతూ, సీఎం జగన్ సర్కార్ కు మద్ధతు ప్రకటించారా? లేదా?

జాతీయ రాజకీయాలను కూడా పరిశీలిస్తే, తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ సర్కారు పంచన చేరారా? లేదా?

తాజా రాజకీయ పరిణామాలనూ నిశితంగా పరిశీలించండి. మహారాష్ట్రలో ఎన్సీపీ తరపున గెల్చిన అజిత్ పవార్ అనే నాయకుడు బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారా? లేదా?

కాదా మరి  ఇది ఐపీఎల్? అదేనండీ ఇండియన్ పొలిటికల్ లీగ్.

‘రాజకీయాల్లో, క్రికెట్లో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు.’ అంటూ కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ కూడా చేసిన వ్యాఖ్యలు నిజమే కదా? తాజాగా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇండియన్ పొలిటికల్ లీగ్ వ్యాఖ్యకు సరైన నిర్వచనమే కదా! ఐపీఎల్ క్రికెట్లో ఆడే క్రీడాకారులకు రూ. కోట్లు వస్తాయి. మరి ఇండియన్ పొలిటికల్ లీగ్ లో ఆడే రాజకీయ నాయకులకు ఏంటి ప్రయోజనం అని అడక్కండి. నాకు క్రికెట్ గురించే తెలియదు.

-ఎడమ సమ్మిరెడ్డి

Comments are closed.

Exit mobile version