దేశంలో ఎక్కడ ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నా తెలంగాణా బీజేపీ నాయకులకు ‘మహా’ ఆశ పుడుతుంది. తెలంగాణాలో ఏదో జరగబోతోందనే భ్రమ కలిగే విధంగా సందర్భానుసార ప్రకటనలు చేయడంలో బీజేపీ నాయకుల శైలే వేరు. ఇటువంటి ఆశాపూరిత వ్యాఖ్యలు ఎవరో సాధారణ కార్యకర్త చేస్తే ఎవరూ పట్టించుకోకపోవచ్చు. సాక్షాత్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే పదే పదే ఇటువంటి ప్రకటనలు చేస్తే సహజంగానే బీజేపీ శ్రేణుల్లో ఏదో ఆశ. గుర్రం ఎగురుతుందేమోననే భావన. అధికారంలోకి వస్తాం కాబోలు అనే సంతోషం. ఇదిగో బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్లో ఎక్కడో, ఏవో ఆశలు కలిగిస్తున్నట్లే కనిపిస్తోంది.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణా రాజకీయాల్లో త్వరలోనే సర్జికల్ స్ట్రైక్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రధాన నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలు తెలంగాణాపై ప్రత్యేక దృష్టి సారించారని కూడా చెప్పారు. ఇదే సందర్భంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ అవమానపర్చిందని, బీజేపీని అణగదొక్కాలని చూస్తే అక్కడి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, తెలంగాణలోనూ అదే పునరావృతం అవుతుందని కూడా లక్ష్మణ్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. లక్ష్మణ్ తమ పార్టీ శ్రేణులకు తరచూ ఇటువంటి ఉత్తేజాన్ని కలిగించే వ్యాఖ్యలు చేస్తుంటారనే ప్రచారం కూడా ఉంది. గత మార్చి 11వ తేదీన ఓ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రధానిగా నరేంద్ర మోదీ మళ్లీ పగ్గాలు చేపట్టాక తెలంగాణా రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రకటించారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఇటువంటి అనేక ప్రకటనలు కూడా చేశారు. కానీ తెలంగాణా రాజకీయాల్లో బీజేపీ ఎంతవరకు ముందుకు వెళ్లిందనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఒకప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా తెలంగాణా రాజకీయాల్లో చక్రం తిప్పిన  చెన్నమనేని విద్యాసాగర్ రావును మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి తప్పించడంపైనా తెలంగాణా బీజేపీ శ్రేణుల్లో కొత్త ఆశలకు కారణమైంది. సీఎం కేసీఆర్ ‘దొర’ పోకడలకు విరుగుడుగా అదే సామాజిక వర్గానికి చెందిన విద్యాసాగర్రావును ఓ వ్యూహం ప్రకారం కేంద్రం మహారాష్ట్ర నుంచి మళ్లీ తెలంగాణాకు తీసుకువచ్చిందనే ప్రచారం కూడా జరిగింది. హైదరాబాద్ నగరాన్ని దేశ రెండో రాజధానిగా చేయాలన్నది అంబేద్కర్ అభిమతంగా ఈ మధ్యనే వ్యాఖ్యానించం ద్వారా విద్యాసాగర్ రావు కొత్త చర్చకు తెరలేపారు. అయితే కేంద్ర ప్రభుత్వం వద్ద అటువంటి ప్రతిపాదనేదీ లేదని హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ప్రకటించారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాల్లో గెలుపు జెండాను ఎగురవేసిన స్థాయి నుంచి బీజేపీ అడుగు ముందుకు పడుతున్న దాఖలాలు కూడా కనిపించడం లేదనే ప్రచారం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణాలో పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధంగా ఉన్నట్లు లక్ష్మణ్ ప్రకటించడం గమనార్హం. మహారాష్ట్ర తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు సహజంగానే రాజకీయ చర్చకు తావు కల్పిస్తున్నాయి. అయితే బీజేపీ నిర్వహించే పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ ఏ తరహాలో ఉంటుందన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే మహా రాష్ట్ర స్థాయిలో పార్టీ బలంగాని, ఎమ్మెల్యేల సంఖ్యగాని తెలంగాణాలో లేదు. ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ రాజకీయాల్లో ఆయన శైలి ఆయనదే. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ కు తెలంగాణాలో సహకరేందెవరు? మంత్రి ఈటెల రాజేందరా? తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రాజేందరే స్వయంగా తోసిపుచ్చారు. ఇంకా ఎవరున్నారబ్బా? హరీష్ రావా? బీజేపీ ఎత్తుగడలకు విరుగుడుగా కేసీఆర్ ముందస్తుగా హరీష్ రావుకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. మరి ఇంకెవరు? ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాదుగా? ప్రస్తుతం పొంగులేటి ప్రజాప్రతినిధి కాకపోయినా, రాజకీయంగా ఆయన శక్తి, యుక్తులేమిటో గత ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కు స్వయంగా తెలిసిందనే ప్రచారం వాడుకలో కూడా ఉంది. కానీ ఫిబ్రవరిలోనో, మార్చిలోనో కేసీఆర్ తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని గంపెడాశతో పొంగులేటి ఉన్నారు. మరి ఇంకెవరు తెలంగాణా అజిత్ పవార్? బీజేపి పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ జరిపితే, అప్పడు వెలుగులోకి వస్తాడేమో చూడాలి.

Comments are closed.

Exit mobile version