ముంబయి నగరంలోనే అతిపెద్ద శివాజీ పార్క్. దాదాపు 28 ఎకరాల వైశాల్యం. ఈరోజు సాయంత్రం అక్కడ పెద్ద సంబరం. అనేక రాజకీయ పరిణామాలు, అనూహ్య మలుపుల నేపథ్యంలో చివరికి మహారాష్ట్ర సీఎంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం. సాయంత్రం 6.40 గంటలకు ముహూర్తం. అంగరంగ వైభవంగా జరగనున్న ప్రమాణస్వీకారానికి హాజరయ్యేవారి కోసం 70 వేల కుర్చీలు వేస్తున్నారు. ఈ వేడుకకు రావాలని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని కాబోయే సీఎం ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య స్వయంగా ఆహ్వానించారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఉద్ధవ్ స్వయంగా పిలిచారు. కార్యక్రమానికి సోనియాగాంధీతోపాటు పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ ముఖ్యమంత్రులతోపాటు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. రాజకీయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ అగ్రనేత అద్వానీలను కూడా శివసేన ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అతిరథుల వంటి ఆయా నేతలే కాదు మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలకు చెందినవారిని కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారట. వీళ్లేగాక అనేక రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా వస్తున్నారట.

కానీ దేశ రాజకీయాల్లో ప్రముఖుడైన ఓ ముఖ్యనేత మాత్రం ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదట. ఎవరతను అనుకుంటున్నారా? పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం సంబరానికి రాహుల్ చాలా దూరంగా ఉంటున్నారట. ఎందుకంటే…అసలు శివసేన పార్టీకి కాంగ్రెస్ మద్ధతు పలకడం రాహుల్ గాంధీకి సుతారమూ ఇష్టం లేదట. ఏ రకంగానూ లౌకిక భావాలు లేని శివసేన పార్టీతో కాంగ్రెస్ కలిసి నడవడం రాహుల్ కు నచ్చలేదని వార్తలు వస్తున్నాయి. అదీ సంగతి.

Comments are closed.

Exit mobile version