దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆస్తులు. ఇందులో 1,019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రూ.2 కోట్ల నగదు. ఈ ఆస్తులన్నీ ఎలా సంపాదించారని అడిగితే హసీనా ఏం చెప్పిందో తెలుసా? టైలరింగ్ వృత్తిలో సంపాదించానని. నోరెళ్లబెట్టడం ఇన్కం టాక్స్ అధికారుల వంతయింది. టైలరింగ్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో సంపాదించినట్లు హసీనా చెప్పిన ఆస్తుల వివరాల్లోకి వెడితే, హైదరాబాద్‌లోని అల్కాపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ. 6 కోట్లు, మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ దాదాపు రూ.5 కోట్లు, పుప్పాలగూడలోని 12 ప్లాట్ల విలువ దాదాపు రూ. 6 కోట్లు, షాద్‌నగర్‌లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్‌ల విలువ సుమారు రూ. 25 కోట్లు, తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్‌ విలువ సుమారు రూ. 35 కోట్లుగా అప్పట్లో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అంచనా వేసింది. సిట్ దర్యాప్తు చేసిన ఈ ఆస్తులకు సంబంధించి టైలరింగ్ వృత్తిని సమాధానంగా చెప్పిన హసీనా ఎవరనేగా మీ సందేహం? గ్యాంగ్ స్టర్ నయీం భార్య.

నయీం భార్య హసీనాను పోలీసులు కోర్టుకు తీసుకువచ్చినప్పటి చిత్రం (ఫైల్)

మాజీ మావోయిస్టు నయీం గ్యాంగ్ స్టర్ గా మారి చేసిన దందాలకు సంబంధించి మొత్తం 251 కేసులు నమోదయ్యాయి. తెలంగాణా పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో 2016 ఆగస్టులో నయీమ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదిగో ఇన్ని రోజుల తర్వాత నయీమ్ ఆస్తులపై ఐటీ అధికారులు విచారణ చేపట్టారు. నయీమ్ ఆస్తులకు సంబంధించి దర్యాప్తు జరిపిన పోలీసు అధికారుల నుంచి ఐటీ అధికారులు వివరాలు సేకరించారు. అయితే నయీమ్ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు అతని భార్య హసీనా వద్దే ఉన్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఈ సందర్భంగా హసీనా చెప్పిన మాటలు విని ఐటీ అధికారులు షాక్ కు గురైనట్లు సమాచారం. తాను దర్జీ పని నిర్వహించడం ద్వారా ఆయా ఆస్తులు సంపాదించానని హసీనా చెప్పిందట. దీంతో పాలుపోని ఐటీ అధికారులు తమ వద్ద గల ఆధారాలను హసీనా ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఈ అంశంలో నయీమ్ బంధువులను కూడా ఐటీ అధికారులు విచారించే అవకాశం ఉందట. వాళ్లేం చెబుతారో మరి!

Comments are closed.

Exit mobile version