సంఘ్ పరివార్ పంతం నెగ్గించుకుంది. తెలంగాణా బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియామకపు ఆదేశం జారీ చేశారు. తెలంగాణా బీజేపీ అధ్యక్ష రేసులో డీకే అరుణ, బండి సంజయ్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, ఆర్ఎస్ఎస్ సూచన మేరకు బీజేపీ అధినాయకత్వం సంజయ్ నియామకానికే ఆమోదం వేసినట్లు ఆ పార్టీ వర్గాలు ఉటంకిస్తున్నాయి.

కరీంనగర్ జిల్లాలో 1971లో జన్మించిన సంజయ్ కుమార్ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన నేత.

బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడిగా ఉన్నారు.

అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా,రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు.

ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-99, 1999-2003) డైరెక్టర్ గా పనిచేశారు.

బీజేపీ జాతీయ కార్యాలయం ఢిల్లీ లో ఎన్నికల ప్రచార ఇంచార్జ్ గా వ్యవహరించారు.

భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంచార్జి గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

ఎల్.కె అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జి గా ఉన్నారు.

కరీంనగర్ నగర పాలక సంస్థ గా ఏర్పడిన తర్వాత 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్ గా హ్యాట్రిక్ విజయం సాధించారు.

వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్ సిటీ బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు.

2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66,009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో నిలిచారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి టీఆరెస్ కంచుకోటను బద్దలు కొట్టి 96వేల పైచిలుకు ఓట్లతో ఎంపీగా విజయం సాధించారు.

Comments are closed.

Exit mobile version