తెలంగాణా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైన అంశమిది. తెలంగాణా అడవుల్లో ఛత్తీస్ గఢ్ మావోయిస్టు నక్సల్స్ చొరబడడమే ఇందుకు కారణం. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా నాలుగు మావోయిస్టు నక్సల్స్ టీమ్ లు తెలంగాణాలోని మూడు జిల్లాల్లోకి ప్రవేశించినట్లు పోలీసు యంత్రాంగమే స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఈమేరకు తమకు విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు. దీంతో ఛత్తీస్ గఢ్ సరిహద్ధుల్లోని భద్రాద్రి-కొత్తగూడెం, జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘ఆపరేషన్ ప్రహార్’ కార్యక్రమాన్ని నిరాటంకంగా, నిరవధికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రం నుంచి నాలుగు మావోయిస్టు నక్సల్ టీమ్ లు ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో గల తెలంగాణాలోని మూడు జిల్లాల్లో ప్రవేశించినట్లు పోలీసులు ప్రకటించడం గమనార్హం. దీంతో తాము మణుగూరు, ఏడూళ్ల బయ్యారం, గుండాల, కరకగూడెం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు భద్రాద్రి-కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ప్రకటించారు. ఈ సందర్భంగా నీలాద్రిపేట గుట్ట వద్ద పోలీసులను చూసిన ఏడుగురు మావోయిస్టులు పారిపోయారని, ఆ తర్వాత పరిసర ప్రాంతాలను పరిశీలించగా మావోయిస్టులు వదలివెళ్లిన వివిధ సామాగ్రి లభ్యమైనట్లు చెప్పారు. అందులో ఐఈడీ వంటి పేలుడు పదార్థాలు, కిట్ బ్యాగులు, పెన్ డ్రైవ్ లు, సోలార్ పానెల్, విప్లవ సాహిత్యం, ప్లాస్టిక్ షీట్ల వంటి వస్తువులు ఉన్నాయన్నారు. పారిపోయిన ఏడుగురు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు కూడా భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ప్రకటించారు.

ఇదిలా ఉండగా తమకు తెలియకుండా గ్రామీణ ప్రాంతాల్లో సంచరించవద్దని అధికార పార్టీ నేతలకు ఆయా జిల్లాల పోలీసులు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త, భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు తమ లేఖల్లో అధికార పార్టీ నేతలకు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేగాక రాత్రి వేళల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారం అందించాలని, ఎవరేని వ్యక్తులు వస్తే ఆధార్ కార్డు చూపాల్సిందిగా కోరాలని కూడా పోలీసులు స్థానిక ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేసి మరీ సూచిస్తున్నారు.

Comments are closed.

Exit mobile version