తెలంగాణా బీజేపీ కొత్త అధ్యక్షురాలిగా డీకే అరుణను ఆ పార్టీ జాతీయ నాయకత్వం దాదాపుగా ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండు, మూడు రోజుల్లో డీకే అరుణ ఎంపిక నిర్ణయాన్ని బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ పెద్దల మాట నెగ్గితే మాత్రం చివరి నిమిషంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేరును ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

బీజేపీ వర్గాల కథనం ప్రకారం… తెలంగాణాలో కేసీఆర్ పార్టీని ఎదుర్కోవడానికి బీజేపీ తన వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగానే డీకే అరుణ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పరిస్థితులు డీకే అరుణ ఎంపికకు దారి తీస్తున్నట్లు సమాచారం.

తెలంగాణా బీజేపీ అధ్యక్ష పదవికి కొత్త నేత ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆ పార్టీ నాయకత్వం ఇటీవల జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ జరిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వాన్ని కొనసాగించే ఆలోచన బీజేపీ అగ్ర నాయకత్వానికి ఉంటే అసలు అభిప్రాయ సేకరణ ప్రక్రియ నిర్వహించేవారే కాదన్నది పార్టీ శ్రేణుల వాదన. ఆయన పనితీరు ఇప్పటికే తేటతెల్లమైనట్లు పార్టీ భావిస్తోందని కూడా అంటున్నారు..

బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ

ఈ నేపథ్యంలో కేసీఆర్ పార్టీని ఎదుర్కోవడానికి తెలంగాణాలో బలమైన సామాజిక వర్గానికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే తప్ప ఆశించిన లక్ష్యం నెరవేరదని బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘రెడ్డి’ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ డీకే అరుణకు నాయకత్వ బాధ్యతల అప్పగింతకు ఆ పార్టీ మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

అంతేగాక రాజధాని కేంద్రంలోని ఎంఐఎం పార్టీని కేంద్రంగా చేసుకుని పార్టీని విస్తరింపజేయడం, బలోపేతం చేయడం అనే ‘పాత చింతకాయ’ ఎత్తుగడల ద్వారా అసాధ్యమని, గడచిన 20 ఏళ్ల అనుభవంలో ఇదే అంశం స్పష్టమైందని అంటున్నారు. అందువల్ల బలమైన సామాజిక వర్గం, గ్రామీణ నేపథ్యం అనే అంశాలను ప్రామాణికంగా తీసుకున్నపుడు డీకే అరుణ ఎంపిక సరైనదనే నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చిందంటున్నారు.

వాస్తవానికి అధ్యక్ష పదవికి జరిపిన అభిప్రాయ సేకరణలో డీకే అరుణకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గట్టి పోటీ ఇచ్చారంటున్నారు. దీనికి తోడు సంఘ్ పరివార్ పెద్దల వేలు కూడా సంజయ్ వైపే చూపిందంటున్నారు. కానీ సంజయ్ ఎంపికకు ఇంకా చాలా సమయం ఉందని, ప్రస్తుత రాజకీయ అవసరాల నేపథ్యానికి, సంజయ్ ఎంపికకు ఇది సరైన సమయం కాదని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఇటువంటి అనేక అంశాలను బేరీజు వేసుకుని డీకే అరుణ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు బీజేపీ కేడర్ లో ప్రచారం జరుగుతోంది. ఈరోజు వరకు గల సమాచారం ప్రకారం తెలంగాణా బీజేపీ అధ్యక్ష పదవి రేసులో 99 శాతం డీకే అరుణ ముందున్నారని, ఒక శాతం మాత్రమే సంజయ్ కు అవకాశాలున్నాయని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Comments are closed.

Exit mobile version