రాజకీయ నాయకులకు మీడియా కావాలి. కానీ మీడియా ప్రతినిధులు పడే పాట్ల గురించి మాత్రం ఎవరికీ పట్టదు. కావాలంటే ఇక్కడ గల చిత్రాన్ని చూడండి. ఇది ఎక్కడో ఢిల్లీలోనో, ముంబయిలోనో కిక్కిరిసిన విలేకరుల సమావేశం కాదు. మన తెలంగాణా రాజధాని గడ్డమీద. సాక్షాత్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ వద్ద శనివారం కనిపించిన దృశ్యమిది.

ఇంతకీ విషయమేమిటంటే… కరోనా పుణ్యమా అని అసెంబ్లీలో మీడియా పాయింట్ ను తొలగించారు. దీంతో మాజీలైనా, ప్రస్తుత ఎమ్మెల్యేలైనా అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ వద్ద గల ఖాళీ ప్రదేశంలో మీడియాతో మాట్లాడి తమ ‘గొంతు’ను జనానికి వినిపించాల్సిందే. మంత్రుల స్థాయి నాయకులైతే తెలంగాణా భవన్ లోనో, మరే సౌకర్యవంతమైన ప్రదేశంలోనో మాట్లాడుతారనేది వేరే విషయం. కానీ ఎమ్మెల్యే స్థాయి, ముఖ్యంగా విపక్ష పార్టీల నేతలకు మాత్రం ప్రస్తుతానికి ఈ గన్ పార్కు ప్రదేశమే దిక్కు.

నేతలు చెప్పే మాటలను ‘రికార్డు’ చేసుకునేందుకు జర్నలిస్టులకు ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. మీడియా ప్రతినిధులకు మంచినీళ్లు ఇచ్చే మాట దేవుడెరుగు. కనీసం ఛానళ్ల లోగోలు పెట్టడానికి కూడా ఓ టేబుల్ లేదు. అందుకే కెమెరా స్టాండ్లనే లోగోల కోసం వినియోగిస్తూ వీడియో జర్నలిస్టు మిత్రులు పడరాని పాట్లు పడుతున్న చిత్రమిది. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతున్నది కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంత సేపు అక్కడ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఇదిగో ఇలా గన్ పార్కు వద్దే పడరాని పాట్లు పడాల్సిన పరిస్థితి.

Comments are closed.

Exit mobile version