‘సూర్యోదయంతోనే యుద్ధం మొదలుపెట్టి, సూర్యాస్తమయంతో విరమించాలి…’ ఇది మహాభారత యుద్ధ నీతి. భీష్ముని మార్గనిర్దేశకత్వంలో రూపొందించుకున్న మహాభారత యుద్ధ నియమాల్లో ఇదీ ఒకటి. తెలంగాణాలోని ఆదిలాబాద్ నుంచి మానుకోట జిల్లాల్లో గల అనేక గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఓ పెద్దపులి విషయంలో అటవీ శాఖ అధికారులు ఇదే నీతిని పాటిస్తుండడమే ఆసక్తికరం.

తెలంగాణాలో ఇద్దరు మనుషులను చంపిన ఏ2 అనే పెద్దపులి కోసం భారీ ఎత్తున వేట సాగుతన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కంది భీమన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఈ పెద్దపులిని పట్టుకునేందుకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 150 మంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. పులిని బంధించే విషయంలో తెలంగాణాకు చెందిన అటవీ అధికారులకు మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంటుకు చెందిన ర్యాపిడ్ రెస్క్యూ టీంలు కూడా రంగప్రవేశం చేశాయి. పులులను పట్టుకోవడంలో మాంచి నింపుణులుగా వీళ్లకు పేరుంది.

అటవీ ప్రాంత ప్రజలను వ్యవసాయ పనులు కూడా చేసుకోకుండా భయపెడుతున్న ఈ పులి ఆరు రోజుల క్రితం ఓ పశువును చంపింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు పులిని బంధించేందుకు ఆ మరుసటి రోజే రంగంలోకి దిగారు. తాను చంపిన పశువు మాంసాన్ని తినేందుకు పులి మరోసారి వస్తుందనేది అటవీ అధికారుల అంచనా. వాస్తవం కూడా ఇదే. తన ఆహారానికి సంబంధించిన పశువును లేదా దుప్పి, జింక, అడవి దున్నవంటి వన్యప్రాణులను చంపే పులి దాదాపు వారం రోజులపాటు దాన్ని తింటుందని కూడా అటవీ అధికారులు చెబుతుంటారు. ఆకలేసినపుడు తింటుంది… ఆ తర్వాత తన ఆవాస ప్రాంతంలో హాయిగా విశ్రమిస్తుంది. తన జీవనశైలిలో పులి సహజ స్వభావం కూడా ఇదే.

ఏ2 పెద్దపులి విషయంలో ఇటువంటి అదును కోసమే ఎదురుచూస్తున్న మహారాష్ట్ర ర్యాపిడ్ రెస్క్యూ టీం సహా మన అటవీ అధికారులు కంది భీమన్న అటవీ ప్రాంతంలో మకాం వేశారు. పులి చంపిన పశువు డెడ్ బాడీకి అతి సమీపాన, కేవలం 15 అడుగుల దూరంలో కాపు కాశారు. అటవీ అధికారుల అంచనా ప్రకారం పులి గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో రానే వచ్చింది. తాను చంపిన పశువును మరోసారి తినేందుకు అక్కడికి చేరుకుంది. కానీ పులిని బంధించేందుకు సకల ఏర్పాట్లతో కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు నిశ్చేష్టులుగా మిగిలిపోయారు. ఎందుకో తెలుసా? కేవలం మహాభారత యుద్ధ నియమం వంటి ఓ నిబంధనే అందుకు అసలు కారణమట.

జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్టీసీఏ) నిబంధనలే ఇందుకు ప్రధాన అడ్డంకిగా చెబుతున్నారు. ఎన్టీసీఏ నిబంధన ప్రకారం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు పులిపై ఎటువంటి మత్తును ప్రయోగించరాదట. అందువల్లే కనిపించిన పులిపై తాము మత్తు ఇంజక్షన్ ను వదల్లేకపోయామని అంటున్నారట. అంతేకాదు చీకట్లో మత్తు ఇంజక్షన్ ఇచ్చినా వెంటనే పులిని బంధించే అవకాశం తక్కువేనట. మత్తు ఇంజక్షన్ విసిరాక దాని ప్రభావం చూపడానికి దాదాపు 15 నిమిషాల సమయం పడుతుందని, ఈ వ్యవధిలో అది ఎక్కడికి వెడుతుందో తెలుసుకోవడం కష్టమని, లైట్లతో పులిని వెతికినా మత్తు ప్రభావం తగ్గితే, పులి దాడి చేసే ప్రమాదముందని కూడా భయపడుతున్నారట. అందుకే అవకాశం లభించినా పులిని బంధించలేకపోయామని అటవీ అధికారులు చెబుతున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు అంశమేంటో తెలుసా? ఇద్దరు మనుషులను పొట్టనబెట్టుకున్నట్లు అనుమానిస్తున్న ఏ2 పెద్దపులి కేవలం రాత్రి వేళల్లోనే సంచరిస్తున్నదట. పగటిపూట హాయిగా రెస్ట్ తీసుకుంటూ సూర్యాస్తమయం కాగానే రాత్రి వేళల్లో మాత్రమే సంచరించడం మొదలు పెడుతోందట. భళా పులి… భళే తెలివిగల పులి కదా!

Comments are closed.

Exit mobile version