ఖమ్మం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఓ అధికారిపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు అటవీ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇక్కడ పనిచేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ ఒకరు తెగబడి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులోని ఆరోపణల సారాంశం. అయితే తనకు అందిన ఈ ఫిర్యాదుపై అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ విచారణకు ఆదేశించడం గమనార్హం. ఇదే ఫిర్యాదు ప్రతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తదితర విభాగాలకు కూడా అందడం గమనార్హం. ఖమ్మం ఫారెస్ట్ రేంజ్ విభాగంలో పనిచేస్తున్న ఆయా అటవీ అధికారిపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదులోని ఆరోపణల ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

  • సా మిల్లుల వద్ద కర్ర కోతకు సంబంధించి పరతి పర్మిట్ కు రూ. 2,500 చొప్పున వసూలు చేస్తున్నారు.
  • కర్ర కొనుగోలుదారుల నుంచి కూడా ప్రతి పర్మిట్ కు రూ.1,250 చొప్పున వసూల్ చేస్తున్నారు.
  • ఖమ్మంలోని సామిల్లుల వద్ద ప్రతి మిల్లుకు ఏటా మిల్లు రెన్యువల్ సర్టిఫికెట్ కోసం రూ.1,5000 చొప్పున వసూల్ చేస్తున్నారు.
  • రైతులు తమ వేప చెట్లను నరుక్కోవడానికి ఆన్ లైన్ లో చెల్లించే మొత్తానికి అదనంగా రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు లంచంగా తీసుకుంటున్నారు.
  • తాము పెంచిన టేకు చెట్లను నరికేందుకు రైతుల నుంచి అన్ లైన్ లో చెల్లించే రుసుముకు అదనంగా రవాణా పర్మిట్ ఇవ్వడానికి ప్రతి లారీ కర్రకు రూ. 25,000 అదనంగా వసూల్ చేస్తున్నారు.
  • డిపార్ట్మెంట్ వర్కులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో 50 శాతం తన వాటాగా తీసుకుంటున్నారు. ఈ విషయంలో పనులను పరిశీలిస్తే వాటి నాణ్యత తెలుస్తుంది.
  • వెలుగుమట్ల పార్కు కోసం రూ. కోట్ల నిధులు విడుదల కాా, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేసి నిధులను మింగేస్తున్నారు.
  • అవసరం లేని చోట కూడా ఉన్న అడవిని తొలగించి మొక్కలు నాటి నిధులను మింగుతున్నారు. ప్లాంటేషన్ కోసం ఎంపిక చేసిన ఏరియాలో మొక్కలు వృక్షాలుగా మారడం అసాధ్యం. కేవలం ప్రభుత్వ నిధులను మింగడం కోసమే ఈ పనులు చేస్తున్నారు.
  • ఖమ్మం ఫారెస్ట్ గెస్ట్ హౌజ్, ఆఫీసు బిల్డింగ్ పనుల్లో నాణ్యత లేకుండా పనులు చేసి నిధులు మింగేశారు. మంజూరైన నిధులతో సరికొత్త బిల్డింగ్ కట్టవచ్చు, కానీ పాత వాటికే పైపై మెరుగులు దిద్ది నిధులు స్వాహా చేశారు.
  • తనపై ఫిర్యాదు వెడితే ఉన్నతాధికారులను ఎలా మేనేజ్ చేసుకోవాలో తనకు తెలుసని, ప్రతీ పైఅధికారీ అవినీతిపరులేనని వ్యాఖ్యలు చేస్తున్నారు.
  • తాను రేంజ్ ఆఫీసర్ల అసోసియేషన్ లో ఉన్నానని, వచ్చే కౌన్సెలింగ్ లోనూ తాను ఖమ్మంలోనే ఉంటానని దిగువ స్థాయి ఉద్యోగులను బెదిరిస్తున్నారు.
  • కొద్ది కాలంలోనే కోట్ల ఆస్తులు కూడా బెట్టారు.

ఆయా అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ ఖమ్మం రేంజ్ ఆఫీసు పరిధిలో పనిచేస్తున్న అధికారి ఒకరిపై వచ్చిన ఫిర్యాదును అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సీరియస్ గా తీసుకున్నారు. ఈమేరకు విచారణ జరిపి నివేదిక సమర్పించాలని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పీసీసీఎఫ్ ఆదేశించారు. ఇప్పుడీ అంశం ఖమ్మం అటవీ శాఖ వర్గాల్లోనేకాదు, స్థానిక సామిల్లు యాజమాన్యాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఫొటో: ప్రతీకాత్మక చిత్రం

Comments are closed.

Exit mobile version