జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేతికి దొరికే ఏ అవకాశాన్ని వదలడం లేదు రాజకీయ పక్షాలు. ఫేక్ సర్వేలతో ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయని ప్రముఖ సంస్థల పేర్లతో గ్రాఫిక్ డిజైన్లు రూపొందించి సోషల్ మీడియాలో కుక్కడం గురించి తెలిసిందే. న్యూస్ ఛానళ్ల లోగోలతో ‘బ్రేకింగ్ న్యూస్’ పేరుతో ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి దిగడం పాత విషయమే. సోషల్ మీడియాలో కనిపించే సర్వే నివేదికల చిత్రాలు, న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ న్యూస్ ప్లేట్లు ఒరిజినలా? డూప్లికేటా? అనే విషయాలు తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరుగుతుంది. కొందరు బాధితులుగా మిగులుతారు కూడా.

ఇటువంటి నకిలీ యవ్వారాల గురించి అందరికీ తెలిసిపోయిందని అంచనా వేశారేమో సోషల్ మీడియా పోస్టుల క్రియేటర్స్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏకంగా అమెరికా కాన్సులేట్ ను రంగంలోకి దించారు. ‘క్లిష్ట సమయాల్లో తప్ప ఇలాంటి అడ్వయిజరీ జారీ చేయదు అమెరికన్ కాన్సులేట్’ అంటూ కాప్షన్లు కూడా జోడించి మరీ ప్రచార హోరెత్తిస్తుండడం గమనార్హం.

ఇంటెలిజెన్స్ విభాగంలో అపార అనుభవం గల ఓ పోలీసు ఉన్నతాధికారి కథనం ప్రకారం… అమెరికా కాన్సులేట్ ఈ తరహాలో హెచ్చరికలు చేయదు. విషయం ఏదైనా ఉంటే నేరుగా కేంద్ర హోం మంత్రిత్వశాఖకే నివేదిస్తూ తమ దేశ పౌరులకు రక్షణ కల్పించాలని కోరుతుంది. అంతేకాదు కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు, ఇండియాలో గల తమ పౌరుల మొబైల్ నంబర్లు, మెయిల్ ఐడీలు కూడా అమెరికా కాన్సులేట్ అధికారుల వద్ద ఉంటాయి. వారిని కూడా అలర్ట్ చేస్తుంది. ఇటువంటి అనేక ‘లాజిక్’లను విస్మరించిన సోషల్ మీడియా డిగ్రీ హోల్డర్స్ ఇదిగో… ఈ దిగువన గల పోస్టును తయారు చేసి వాట్సప్ గ్రూపుల్లో తిప్పుతున్నారు. అమెరికన్ కాన్సులేట్ నూ వదలకుండా నాలుగు ఓట్లు రాబట్టుకునే మరో ప్రయత్నమన్న మాట.

Comments are closed.

Exit mobile version