‘కేసు ఏమిటంటే…? ఓ ఫార్మసీ విద్యార్థిని విచ్చలవిడి జీవితానికి అటవాటు పడింది… ఓ ప్రియుడితో కలిసి వెళ్లింది. గంజాయి దట్టించింది. ప్రియుడితోనే కాదు. తన ఇద్దరు సోదరులతోనూ ‘ఎంజాయ్’ చేసింది… ఒకసారి గీత దాటాక ఇక అడ్డేమంది…? సంఖ్యతో పనేముంది…?

హమ్మయ్య… కడుపు నిండింది. మీడియాకు… సొసైటీకి… చట్టానికి… ప్రస్తుతానికి వీటి ఆకలి తీరింది. ఇప్పుడిక మరో కొత్త బతుకును, మరో శవాన్ని వెతుక్కోవాలి ఈ అఘోరాలు. చట్టానికి థర్డ్ డిగ్రీలు తప్ప, మరే డిగ్రీలు తెలియవు. మీడియా మసాలా వేసుకుని వండింది.

పరస్పర విరుద్దంగా ఉన్నాయ్ కదూ…! ఈ వాక్యాలు, వ్యాఖ్యలు? ఒకే కలం నుంచి వెలువడిన పరస్పర భిన్న కథనాల్లోని సారాంశమిది. నిందాపూర్వక రాతలు రాసేదీ, నీతులు చెప్పేదీ ‘శోషల్ మీడియా’ అయినప్పుడు అది చర్చనీయాంశమే. ఈ టైపు మీడియా ముసుగుకు రెండు నాల్కలు ఉంటాయ్ మరి. విచక్షణ ఉండదు. ‘ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి…’ సుమతీ శతకంలోని పద్యం టైపు అన్నమాట. సున్నిత ఘటనల్లో విచక్షణను విస్మరించరాదని, తీర్పరులుగా మారవద్దని మీడియాకు సుప్రీంకోర్టు చెప్పినా చెవికెక్కడం లేదు. బీ ఫార్మసీ విద్యార్థి ఘటనలోనూ ఇదే అంశం వెల్లడైంది. కిడ్నాప్ ఘటనలో బీ ఫార్మసీ విద్యార్థి అబద్ధాలే చెప్పి ఉండవచ్చు. ఘటనలో వాస్తవాలను వెల్లడించేందుకు పోలీసులు పూర్వాపరాలను పూసగుచ్చినట్లు వివరించి ఉండవచ్చు. కానీ మీడియా ఏం చేసింది?

ఆ మీడియా, ఈ మీడియా అని తేడా ఏమీ లేదు. అన్ని మీడియాలూ రెచ్చిపోయాయి. ఎలాగంటే ఫస్ట్ పేరాలోప్రస్తావించిన వాక్యాల టైపు అన్నమాట. వాక్యాలు, వ్యాఖ్యల్లో తేడా ఉండొచ్చేమోగాని, విద్యార్థిని వ్యక్తిత్వ హననం అంశంలో మాత్రం పోటీలు పడి మరీ కలాలలకు పదును చెప్పారు కొందరు మీడియా వీరులు. విద్యార్థిని, ఆమె కుటుంబ మనుగడను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా రాసిన రాతలే ఆమెను ఆత్మహత్య వైపు తీసుకువెళ్ళాయనడంలో సందేహం లేదు. కానీ ఘటన జరిగిన సమయంలో పోలీసులు వెల్లడించిన వివరాలకన్నా, సోషల్ మీడియాలో కొందరు తమ కలాల పైత్యాన్ని విదిల్చిన తీరు జుగుప్పాకరం. ఈ కథనంలో ప్రస్తావించిన తొలి పేరాలోనే వాక్యాలను, వ్యాఖ్యలను మరోసారి చదవండి.

ఇంతకీ బీ ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణానికి బాధ్యులెవరు? ఇటువంటి రాతలు రాసిన వారిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు ఎందుకు నమోదు చేయకూడదు? ఇదీ ఈ కేసులో అసలు సందేహం. రాచకొండ పోలీసుల అత్యుత్సాహం వల్లే బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, ప్రెస్ మీట్ పెట్టి అధికారులు వివరాలను వెల్లడించడం చట్ట విరుద్దమని ఆరోపిస్తూ ఓ న్యాయవాది మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పనిలో పనిగా ఇటువంటి రాతలు రాసినవాళ్లు కూడా బాధ్యులేనని సదరు న్యాయవాది తన పిటిషన్ లో పేర్కొంటే బాగుండేదనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.

Comments are closed.

Exit mobile version