గత కొద్ది గంటలుగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. ఖమ్మం కలెక్టర్ గా పనిచేస్తున్న ఆర్ వీ కర్ణణ్ బదిలీ అయ్యారని, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా నియమితులయ్యారనేది ఆయా పోస్ట్ సారాంశం. కర్ణణ్ స్థానంలో ఖమ్మం నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న అనురాగ్ జయంతిని నియమించారనే వాక్యాలతో సోషల్ మీడియాలో పోస్టు తెగ తిరుగుతోంది. ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ అంశపు పోస్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలోనే తమకు ఏ మాత్రం సమాచారం లేకుండా బదిలీలు ఎప్పుడు జరిగాయో? అసలీ సోషల్ మీడియా పోస్ట్ వెనుక ఎవరున్నారనే అంశంపై ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్ణణ్ ఆరా తీస్తున్నారు. వాస్తవానికి కలెక్టర్ ఆర్ వీ కర్ణణ్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతిల బదిలీకి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు జారీ కాలేదు. కానీ ఓ వార్తా సంస్థ ద్వారా బదిలీల పోస్ట్ సర్క్యులేషన్ లోకి వచ్చినట్లు అధికార వర్గాలు గుర్తించాయి. జిల్లా కలెక్టర్ కర్ణణ్ ఆదేశం మేరకు సంబంధిత అధికార వర్గాలు అసలు ఈ పోస్ట్ క్రియేట్ చేసిందెవరనే అంశంపై వివరాలు సేకరిస్తున్నాయి.

ఇంకా అసలు విషయమేమిటంటే కర్ణణ్, అనురాగ్ జయంతిల బదిలీకి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయని, పలువురు శుభాకాంక్షలు చెప్పారని కూడా నకిలీ వార్తకు ‘దారి’ చూపిన న్యూస్ యాప్ ఒకటి నివేదించినట్లు అధికార వర్గాలు ప్రాథమికంగా గుర్తించాయి. పూర్తి సమాచారం సేకరించి ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలకు కూడా కలెక్టర్ కర్ణణ్ ఆదేశించినట్లు సమాచారం. మొత్తంగా ఖమ్మం కలెక్టర్ ఆర్ వీ కర్ణణ్ బదిలీ వార్త బూటకంగా తేలిపోయింది. అదీ అసలు విషయం.

Comments are closed.

Exit mobile version