మావోయిస్టు పార్టీతో అదే పార్టీకి చెందిన మాజీ అగ్ర నేత ఒకరు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈమేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్, ప్రభుత్వానికి లొంగిపోయిన ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జీనుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న పరస్పర పత్రికా ప్రకటన ద్వారా అక్షర యుద్ధం చేస్తున్నారు. జంపన్నను హెచ్చరిస్తూ అభయ్ పేరున గత నెల 18వ తేదీన ఓ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఆయుధాలను త్యజించి జనజీవన స్రవంతిలో కలిసిన కేంద్ర కమిటీ స్థాయి సభ్యుడు తాను పనిచేసిన పార్టీ ద్వారానే హెచ్చరికను అందుకోవడం, అందుకు ప్రతిగా ఆయన కూడా అక్షర యుద్ధం చేస్తుండడం సహజంగానే విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లో చర్చకు దారి తీసింది. ఇంతకీ ఇందుకు దారి తీసిన పరిణామాలేమిటో ఓసారి పరిశీలిస్తే…
‘కరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టి’ శీర్షికతో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరున గతనెల 18వ తేదీన ఓ ప్రకటన విడుదలైంది. అందులో జంపన్నను ఉటంకిస్తూ అభయ్ హెచ్చరిక జారీ చేశారు. ‘విప్లవ రాజకీయాల నుంచి హీనాతి హీనంగా దిగజారిపోయిన జంపన్నకు విప్లవ రాజకీయాలపై, మా పార్టీపై మాట్లాడడానికి కనీస నైతిక అర్హత కూడా లేదని మా పార్టీ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తోంది. మాజీ మావోయిస్టుగా అవతారమెత్తిన జంపన్న చీటికి మాటికి పోలీసుల కథనాలకు వంత పాడుతూ మీడియా ముందు ప్రత్యక్షం కావడం ఆయనకు మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నాం’ అని అభయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ హెచ్చరికపై జంపన్న కూడా తీవ్రంగానే స్పందించారు. అభయ్ జారీ చేసిన ప్రకటనను ‘ఫత్వా’గా అభివర్ణిస్తూ జంపన్న మరో ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యవహార తీరును, తనను హెచ్చరించిన రీతిని ప్రశ్నిస్తూ జంపన్న ఘాటు వ్యాఖ్యలతో గత నెల 20న సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.
జంపన్న జారీ చేసిన ప్రకటనపై అభయ్ స్పందిస్తూ ఈనెల 6వ తేదీన మరో ప్రకటన జారీ చేశారు. తాము జారీ చేసిన ప్రకటనపై జంపన్న సందేహాన్ని వెలిబుచ్చారని, అది పార్టీ నుంచి వచ్చిందో లేక నకిలీలు చేసిన పనో అన్న సంశయాన్ని వ్యక్తపరిచాడన్నారు. జంపన్నకు అటువంటి శంక అవసరం లేదని, పార్టీ అధికార ప్రతినిధిగా ఆ ప్రకటన తాను జారీ చేసిందేనని స్పష్టం చేస్తూ అభయ్ నాలుగు పేజీల సుదీర్ఘ ప్రకటన జారీ చేశారు. ఇందులో జంపన్న ప్రకటనను ఉద్ధేశిస్తూ.., అనేక అంశాలపై పార్టీపైన అహంకారపూరిత, అసత్య ఆరోపణల దాడి చేస్తూ, తన అక్కసును వెళ్లబోస్తూ, పాలకవర్గాలకు తాను నమ్మిన బంటుననే విషయాన్ని జంపన్న మరోసారి రుజువు చేసుకున్నారని అభయ్ వ్యాఖ్యానించారు. తమ విమర్శను, హెచ్చరికను జంపన్న ‘ఫత్వా’ స్థాయికి తీసుకువెళ్లి తాము ప్రకటించనిదాన్ని ప్రకటించినట్లుగా ఫోకస్ చేసి, చౌకబారు ఎత్తుగడలకు పాల్పడ్డాడని అభయ్ పేర్కొన్నారు. ఇటువంటి అనేక అంశాలను అభయ్ ప్రస్తావిస్తూ, ఓ యూ ట్యూబ్ ఛానల్ పేరును ఉటంకిస్తూ, ఇతర ఎలక్ట్రానిక్ మీడియాలతో అపవిత్ర కలయిక ఏర్పరచుకుని పార్టీ మీద, దాని పంథామీద ఒక పథకం ప్రకారం జంపన్న దాడి చేయడం లేదా? అని అభయ్ ప్రశ్నించారు. తన నాలుగు పేజీల సుదీర్ఘ ప్రకటనలో అభయ్ ఇంకా అనేక అంశాలను సృశిస్తూ జంపన్నపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అయితే అభయ్ జారీ చేసిన తాజా ప్రకటనపై జంపన్న సైతం వెనుకంజ వేయకపోవడం గమనార్హం. ఇందుకు తాను రెండు రోజుల్లో జవాబు చెబుతానంటూ జంపన్న తన ఫేస్ బుక్ ఖాతా వేదికగా ప్రకటించారు. అభయ్ పేరు ప్రస్తావించకుండానే నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. జంపన్న ఫేస్ బుక్ పోస్టులను ఇక్కడ చూడవచ్చు.