ఆరేళ్ల క్రితం అతను ఎంపీ. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన భావోద్వేగ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తాను గెలవడమేగాక, పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్న రాజకీయ నైపుణ్యత. యావత్తు తెలంగాణా రాష్ట్రంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఖమ్మం జిల్లా ఫలితాలు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పరిణామాల్లో తనతోపాటు పార్టికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం గులాబీ కండువాలు మార్చుకున్నారు. ఇందుకు రాజకీయ పరిణామాలు దోహదపడి ఉండవచ్చు… లేదా ఇతరత్రా అంశాలు కూడా దాగి ఉండవచ్చు.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల ఫలితానికి విరుద్ధంగా ఖమ్మం జిల్లా ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీ షాక్ కు గురైంది. పది అసెంబ్లీ సెగ్మెంట్లో ఖమ్మం మినహా మిగతా స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇందుకు కారణాలు అనేకం కావచ్చు. కానీ కొన్నిచోట్ల ఓటమికి ‘అతడు’ కారణమని పార్టీ వర్గాలు వేలెత్తి చూపాయి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ టికెట్ దక్కని పరాభవం. 2014 ఎన్నికల్లోనూ ఈ సిట్టింగ్ ఎంపీ విజయం సాధించింది టీఆర్ఎస్ అభ్యర్థిగా కాదు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా మాత్రమే. కానీ పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఇతర పార్టీలు బీ ఫారం పట్టుకుని నామినేషన్ల చివరి తేదీ వరకు ఎదురు చూసినా, ఆఫర్ ఇచ్చినా ఆయన పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించలేదు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపునకు పాటుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ విజయమే ప్రధానంగా భావించారు.

అభిమానుల మధ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫొటో)

పార్టీ చీఫ్ తనకు తప్పక న్యాయం చేస్తారనే నమ్మకంతోనే ఉన్నారు. అందుకోసం దాదాపు ఏడాది కాలంగా ఎదురు చూశారు. రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇందులో తనకు ఒకటి తప్పక కేటాయిస్తారనే విశ్వాసంతోనే ఆయన ఉన్నారు. బుధవారం రాత్రి వరకు కూడా ఆయన పేరే దాదాపు అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చింది. అధికార పార్టీ అధినేత సైతం అతనికి రాజ్యసభ అభ్యర్థిత్వం కేటాయించేందుకే మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగింది.అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లుగానే వార్తలు వచ్చాయి. కానీ అతను వస్తే తమ ‘పవర్’కు ముప్పు వస్తుందని, తీవ్ర విఘాతం కలుగుతుందని అదే పార్టీకి చెందిన కొందరు నేతలు కుట్ర చేశారన్నది ఆయన అభిమానుల అభిప్రాయం. ‘రెడ్డి’కి టికెట్ ఇవ్వాలనుకుంటే మరో ‘రెడ్డి’కి ఇవ్వాలని ఒత్తిడి చేశారట. అందువల్లే కేఆర్ సురేష్ రెడ్డి అభ్యర్థిత్వం వైపు కేసీఆర్ చివరి నిమిషంలో మొగ్గు చూపక తప్పలేదంటున్నారు. అందువల్లే తమ నేతకు మళ్లీ అన్యాయం జరిగిందన్నది ఆయన అభిమానుల వాదన.

విషయం అర్థమైనట్లే కదా? తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిబిరం మరోసారి నివ్వెరపోయింది. రాజ్యసభ టికెట్ అంశంలో ఆయనకు మళ్లీ చేదు అనుభవమే ఎదురైంది. తమ నేతకు మరోసారి ‘టికెట్’ రాలేదనే విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి, ఏడాది కాలంగా వేచి చూసిన తమ నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల ఎదురుచూపులకు చివరికి మిగిలింది నిరాశే అంటున్నారు. ఇక ఇప్పట్లో ఏ ఆశా లేదట. రాజకీయంగా ఇక ‘కింకర్తవ్యమ్’ అన్నదే పొంగులేటి అభిమానుల సంశయం.

Comments are closed.

Exit mobile version