పార్టీకి చెందిన అనేక మంది సీనియర్లు విముఖత వ్యక్తం చేసినా, మోకాలొడ్డినా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను తెలంగాణా రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ అధిష్టానం ఎలా ఎంపిక చేయగలిగింది? ఎంతగా సంఘ్ పరివార్ ఒత్తిడి చేసినా సీనియర్ల మాటను తోసిరాజని నిర్ణయం తీసుకోవడానికి గల బలమైన కారణాలేమిటి? సంజయ్ ఎంపిక వెనుక జరిగిన అసలు మంత్రాంగమేమిటి? ఇవీ తెలంగాణా బీజేపీ శ్రేణుల్లో, సీనియర్ నాయక గణంలో వ్యక్తమవుతున్న సందేహాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని పార్టీలోని అనేక మంది ఉద్ధండులు, సీనియర్లు ఆశించినప్పటికీ, చివరికి ‘హిందుత్వ’ సంజయ్ ఎంపిక వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపడం వెనుక బీజేపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వాస్తవానికి తెలంగాణా బీజేపీ అధ్యక్ష పదవీ బాధ్యతలు నిర్వహించే అంశంపై బీజేపీ ఈసారి భారీ కసరత్తే చేసిందని చెప్పాలి. జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ జరపడం ఇందులో భాగమే. అంతేగాక అధ్యక్ష పదవిని రాజధాని నేతల చేతుల నుంచి గ్రామీణ ప్రాంత నాయకులకు అప్పగించాలన్నది పార్టీ తీసుకున్న ముఖ్య నిర్ణయంగా బీజేపీ శ్రేణుల కథనం. రెండు దశాబ్ధాల పాటు చేసిన విఫల ప్రయోగాన్ని మరోసారి అనుసరించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదనేది కూడా బహిరంగ రహస్యమేనట. ఈమేరకు రూరల్ బేస్డ్ లీడర్లకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

తన పత్రికలో వివేక్ ఇచ్చిన ప్రకటన

దీంతో హైదరాబాద్ మినహా రూరల్ జిల్లాల నాయకులకే పార్టీ పగ్గాలు ఖాయమని తేలిపోయింది. ఫలితంగానే అధ్యక్ష పదవికి ప్రతిపాదిత పేర్లలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి, బండి సంజయ్ తదితర నేతల పేర్లు తెరపైకి వచ్చాయంటున్నారు. అయితే పార్టీ పగ్గాలు అందుకునే నేత పార్టీ బాధ్యతల నిర్వహణకు అవసరమయ్యే ఆర్థిక వనరుల అంశం కూడా సహజంగానే ప్రస్తావనకు వచ్చింది. ఫలితంగానే డీకే అరుణ వంటి నేతల పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వంటి నేతల పేర్లు ప్రముఖంగా వినిపించాయంటున్నారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి స్వల్ప వ్యవధిలోనే రాష్ట్ర స్థాయి పగ్గాలు అప్పగిస్తే మరో జాతీయ పార్టీ ‘కల్చర్’ వచ్చిందనే ప్రచారాన్ని భరించాల్సి ఉంటుందని, పార్టీతో దశాబ్ధాల అనుబంధం గలవారికే పగ్గాలు అప్పగించాలని ఆరెస్సెస్ ముఖ్యులు ఈ సందర్భంగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు, ఎదురుదెబ్బలు చవి చూసినప్పటికీ సంజయ్ మొదటి నుంచి పార్టీని పట్టుకుని ఉన్నారని, అతన్నే అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని సంఘ్ పెద్దలు తీవ్ర ఒత్తిడి చేసినట్లు తెలిసింది. అయితే పార్టీ కార్యకలాపాల నిర్వహణకు అవసరమయ్యే ఆర్థిక వనరుల సమీకరణ అంశం సంజయ్ కు అతిపెద్ద మైనస్ గా పార్టీలో చర్చ జరిగిన నేపథ్యంలో, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ ఎంటరైనట్లు ప్రచారం జరుగుతోంది. సంజయ్ కు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ కార్యక్రమాల నిర్వహణ వ్యవహారం తాను చూసుకుంటానని, ఆర్థిక వ్యవహారాల బాధ్యత తనదేనని వివేక్ పార్టీ అధిష్టానానికి భరోసా ఇచ్చినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సంజయ్ ఎంపికకు మార్గం సుగమమైందని, పార్టీ పెద్దలు తుది నిర్ణయం తీసుకుని తెలంగాణా అధ్యక్షునిగా ఆయన పేరును ప్రకటించినట్లు బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కొంత కాలం క్రితం వరకు టీఆర్ఎస్ లో గల వివేక్ అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీరుపై విమర్శలు చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Comments are closed.

Exit mobile version