రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలోని ఓ జిల్లాలో ప్రముఖ పత్రికకు నేను బ్యూరో ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులు అవి. ఇదే జిల్లాలోని ఓ పుణ్య క్షేత్రం కేంద్రంగా ఓ కంట్రిబ్యూటర్ ఉండేవాడు. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో విలేకరిగా పని చేయాలని అదే పనిగా తను తపన పడేవాడు. ఇదే విషయమై సంస్థ యజమానికి పలుసార్లు విజ్ఞప్తి కూడా చేశాడు. ఎంతకీ ఇందుకు ఆ సంస్థ యజమాని అంగీకరించలేదు. ‘ సార్…మీరు ఓసారి చైర్మన్ గారికి చెప్పవచ్చు కదా?’ అని నన్ను కూడా కోరాడు. పోనీలే అని విషయాన్ని నేను సంస్థ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాను. అందుకు ఆయన నవ్వుతూ… ఏ విషయమూ చెప్పకుండా అసలు విషయాన్ని దాటవేసి, వేరే విషయం మాట్లాడసాగారు. ఎప్పుడూ ఏ విషయంపైనైనా స్పష్టంగా మాట్లాడే ఛైర్మన్ ఈ అంశంలో ఎందుకు నవ్వారో, విషయాన్ని ఎందుకు దాటవేశారో నాకు అర్థం కాలేదు. తాను పని చేసే ప్రదేశం నుంచి దాదాపు 700 కిలో మీటర్ల దూరం వెళ్లి ఆ కంట్రిబ్యూటర్ తిరుమలలో ఎందుకు పని చేయాలనుకున్నాడో ఇన్నేళ్లుగా ఎంతకీ నాకు బోధపడలేదు. వేంకటేశ్వర స్వామిపై భక్తి కాబోలు అని భావించాను. కానీ తిరుమలను ఆ కంట్రిబ్యూటర్ ఎందుకు ప్రత్యేకంగా ఎంచుకున్నాడో? ఇదిగో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టింగ్ చూశాక గాని అసలు విషయం అర్థం కాలేదు. పాత్రికేయ విలువల ధర్మం ప్రకారం ఈ పోస్టింగ్ ను యధాతథంగా కాకుండా, అభ్యంతరకర వ్యాఖ్యలను ఎడిట్ చేసి దిగువన మీకు అందిస్తున్నాను.

“ఓ ప్రముఖ పత్రికకు విలేకరిగా పని చేస్తున్న వ్యక్తిని తిరుమల రిపోర్టింగ్ బాధ్యతల నుంచి దాని యాజమాన్యం తొలగించింది. 2019 జనవరి నుంచి జూన్ వరకు 820 విఐపి టిక్కెట్లు(కల్యాణం, సుప్రభాతం, ఇతర సేవలు) పొందినట్లు తేలగా, ఇందులో 80 కూడా తాను పని చేసే సంస్థకు సంబంధించిన వారు లేరు. వీటి విక్రయం ద్వారా ప్రతిరోజూ ఒక లక్ష రూపాయల మొత్తాన్ని ఆ పత్రిక విలేకరి సంపాదించేవాడని తెలిసింది. తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇతను కోటి యాభై లక్షల రూపాయల విలువైన ఇంటిని కొనుగోలు చేశాడట. గత 10 సంవత్సరాలుగా కొండ పైన తిష్ట వేసి పెద్ద దళారిగా మారటంతో ఆ పత్రిక యాజమాన్యం ఇతన్ని విధుల నుంచి తప్పించింది. మరో టీవీ న్యూస్ చానల్ కు చెందిన విలేకరిని సైతం ఆ సంస్థ తిరుమల రిపోర్టింగ్ బాధ్యతల నుంచి తప్పించింది. కొండ మీద మూడు తట్టలు, ఆరు అక్రమ దర్శనాల దందా సాగిస్తూ వచ్చిన ఇతనికి ఉద్వాసన పలికింది. కొండపైన నెలకు 3 నుండి 4 లక్షలు అక్రమ ఆర్జన చేస్తున్నాడని గుర్తించిన ఆయా సంస్థ ఇతన్ని కొండ దింపింది.

మరో ప్రముఖ న్యూస్ ఛానల్ విలేకరికీ ఉద్వాసన పలికేందుకు దాని యాజమాన్యం సిద్ధమవుతోంది.. టెన్త్ కూడా పాస్ కానీ ఇతను ఏంఎ చదివానని చెప్పి ఆయా ఛానల్ హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ కు అడ్డంగా దొరికిపోయాడు. సర్టిఫికెట్ల కోసం 20 రోజులు గడువు కోరి కొనసాగుతున్న ఇతను కనీసం టెన్త్ క్లాస్ మార్కుల లిస్టు కూడా ఇవ్వలేక పోయాడు. లైవ్, ఫేస్ 2 ఫేస్, పి2సి సంగతి తిరుపతి దేవుడు ఎరుగు… కనీసం ఫోన్ ఇన్ కూడా చెప్పలేని ఇతను ఇంతకాలం అంత ప్రముఖ చానల్ లో ఎలా కొనసాగగలిగాడని కొత్త యాజమాన్యం ఆరాతీస్తే దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయట. కనీసం రెండు లైన్ల వార్త రాయడం చేతకాని ఇతను నలుగురు బినామీ రిపోర్టర్లతో కథ నడిపిస్తున్నట్లు తేలింది. తిరుమలలో ఈ ఛానల్ ఆఫీసు దళారుల అడ్డగా మారిందట. ఇతని బినామీలు పనిచేస్తున్న ఆరు టీవీ ఛానళ్ళకు ఫీడ్, స్క్రిప్ట్ ఈ ప్రముఖ చానల్ ఆఫీసు నుంచే వెళ్లేవట. తాను పని చేస్తున్న ఈ ప్రముఖ చానల్ లెటర్లతో 2019 జనవరి నుంచి జూన్ వరకు 783 విఐపి దర్శనం, సేవా టిక్కెట్లు పొందగా.. ఇందులో సంస్థ ఆబ్లిగేషన్ 90 లోపే ఉన్నట్లు తేలిందట. మిగిలినవన్నీ సదరు విలేకరి దుర్వినియోగం చేసినట్లు తేలిపోయింది. ప్రతి రోజు గదులు, లడ్డూల దందా మెుత్తం తమ ఛానల్ ఆఫీసు నుంచే నడిపిస్తూ, లక్షలాది రూపాయలు ఆర్జించినట్లు విచారణలో బట్టబయలైంది.. రెండు కార్పొరేట్ సంస్థల పెద్దలకు ఛానల్ లెటర్లతో దర్శనాలు చేయిస్తూ, ఆ సంస్థలకు అనధికారిక పిఆర్వో గా జీతాలు కూడా తీసుకుంటున్నాడని తెలిసింది. సంస్థను మోసం చేసిన ఈ విలేకరి తిరుమల నుంచి సాగనంపడమే కాదు, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఛానల్ యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలిసింది.

మరోవైపు తిరుమల, తిరుపతి దేవస్థానం కూడా ఈ తరహా మీడియా గద్దలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే మీడియా సిఫార్సు లేఖలపై నిఘా పెట్టిన తిరుమల జేఈవో కార్యాలయం, ఏ మీడియా సంస్థ తరపున లెటరు పెట్టినా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. నేరుగా మీడియా సంస్థ హెడ్ ఆఫీసులో ఎడిటర్లు, సీఈవోలకు మెసేజ్ పంపుతున్నారు. దీంతో బ్రేక్ దర్శనాల పేరుతో కొందరు జర్నలిస్టులు సాగిస్తున్న అక్రమ వ్యాపారానికి చెక్ పడింది. తినడానికి అలవాటు పడ్డ వీరు చివరకు గదులు, లడ్డులను బ్లాక్ లో అమ్ముకుని సొమ్ము చేసుకునే కొత్త దందాకు తెరతీసినట్లు టిటిడి విజిలెన్స్ గుర్తించింది. తాజాగా పట్టుపడ్డ 13 మంది దళారుల నుంచి స్వాధీనం చేసుకున్న లడ్డూలలో అధిక భాగం మీడియా సిఫార్సు ద్వారా పొందిన లడ్డూలేనని తేలడంతో టిటిడి కంగు తినాల్సి వచ్చింది. ఇకపై గదులు, లడ్డూల దందాకు కూడా బ్రేక్ వేసేందుకు టిటిడి చర్యలు తీసుకోనుంది.”

Comments are closed.

Exit mobile version