కుయ్…కుయ్…మంటూ తిరుగుతున్న ప్రయివేట్ అంబులెన్సులు, కరోనా కల్లోల పరిస్థితుల్లోనూ షటిల్ సర్వీసును వీడని కొందరు సర్కారు సార్లు కరోనా వైరస్ వినూత్న వ్యాప్తికి కారణమవుతున్నారా? కరోనా ధాటికి ఏరోజుకారోజు భారీగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సూర్యాపేట నుంచి ఖమ్మం నగరానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయా? ఎమర్జెన్సీ కేసుల పేరుతో కొందరు ప్రయివేట్ ఆసుపత్రుల నిర్వాహకుల నిర్వాకం, కోవిడ్-19 డ్యూటీ పేరుతో మరికొందరు ప్రభుత్వ ఉద్యోగుల షటిల్ సర్వీస్ ప్రయాణాలు ఖమ్మంలో కరోనా మరింత వ్యాప్తికి కారకంగా మారే అవకాశముందా? ఇవి ఖమ్మం నగర ప్రజలను భయపెట్టేందుకు ప్రస్తావిస్తున్న ప్రశ్నలు కావు. తాజాగా చోటు చేసుకున్న రెండు ఘటనల పరిణామాల నేపథ్యంలో మరింత అప్రమత్తతను, జాగరూకతను గుర్తు చేసే ప్రయత్నం మాత్రమే. వివరాల్లోకి వెడితే…

గురువారం రాత్రి… ఎమర్జెన్సీ కేసు పేరుతో ఓ అంబులెన్స్ కుయ్… కుయ్…మంటూ ఖమ్మం నగరంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రి వద్దకు రివ్వున దూసుకువచ్చింది. అందులోని రోగి ప్రాణరక్షణే ప్రధాన ధ్యేయంగా ప్రయివేట్ ఆసుపత్రి సిబ్బంది వెంటనే అతన్ని లోనికి తీసుకువెళ్లారు. అతని ఛాతీకి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. నివేదికను చూసి వైద్యులు నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఆ రోగికి కరోనా లక్షణాలు ఉన్నాయట. బెంబేలెత్తిన ప్రయివేట్ ఆసుపత్రి నిర్వాహకులు వెంటనే అతన్ని ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారట. కానీ సదరు రోగి ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన దాఖలాలు మాత్రం లేవనే వాదన వినిపిస్తోంది.

ఇంతకీ ఈ పేషెంట్ అంబులెన్స్ లో ఎక్కడి నుంచి ఖమ్మం వచ్చాడో తెలుసా? పొరుగున గల నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి. వాస్తవానికి ఆయా రోగి మిర్యాలగూడలోనే కరోనా పరీక్షలు చేయించుకుని వైరస్ సోకిన విషయాన్ని గుట్టుగా ఉంచాడన్నది ఓ కథనం. సాధారణ సమయాల్లో ఇరుగు, పొరుగు జిల్లాల నుంచి వైద్యం కోసం ఖమ్మం నగరానికి వచ్చే అంబులెన్స్ వాహనాలకు కొదువ లేదు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, చిల్లకల్లు, వత్సవాయి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట నుంచేగాక మహబూబాబాద్ జిల్లా నుంచి కూడా వైద్య చికిత్సల కోసం రోగులు రావడం సర్వసాధారణం. కానీ ప్రస్తుత కరోనా పరిణామాల్లోనూ ఆయా జిల్లాల నుంచి వస్తున్న అనేక అంబులెన్సులు, అందులోని రోగులను ఎమర్జెన్సీ పేరుతో ఎప్పటిలాగే ప్రయివేట్ ఆసుపత్రుల నిర్వాహకులు స్వీకరిస్తున్న తీరు కరోనా ప్రమాద ఘంటికలకు దారి తీయవచ్చనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

ఇతర జిల్లాల నుంచి వచ్చే అంబులెన్సుల విషయంలో జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు సైతం జిల్లా సరిహద్దుల్లో బేఖాతర్ అవుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ చెక్ పోస్ట్ సిబ్బంది తప్పేమీ లేకపోవచ్చు కూడా. అంబులెన్సును ఆపితే ఒక్కోసారి రోగి ప్రాణానికే ముప్పు ఏర్పడవచ్చు. కానీ కరోనా పాజిటివ్ కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్న సూర్యాపేట జిల్లా నుంచి అంబులెన్సులు రావద్దని అధికారులు ఆంక్షలు విధించడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే సూర్యాపేటలో 15 పాజిటివ్ కేసులు రాగా, అక్కడ కరోనా రోగుల సంఖ్య 54కు చేరినట్లు అధికారులు ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ప్రయివేట్ అంబులెన్సుల్లో జిల్లాకు వస్తున్న కొందరు రోగుల ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పడానికి మిర్యాలగూడ ఘటనే నిదర్శనం.

కాగా సూర్యాపేటలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తాజా సమాచారం. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పనిచేసే కార్యాలయానికి చెందిన ఓ ప్రభుత్వ అధికారి, మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులు నిత్యం ఖమ్మం నుంచి సూర్యాపేటకు ‘షటిల్ సర్వీస్’ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురితోపాటు వీళ్లను ప్రతిరోజు కారులో ఖమ్మం నుంచి సూర్యాపేటకు తీసుకువెడుతున్న డ్రైవర్ ను కూడా ప్రస్తుతం ఐసొలేషన్ వార్గులో ఉంచి, పరీక్షల నిర్వహణ కోసం రక్త నమూనాలను కూడా తీసినట్లు సమాచారం. పరీక్షల ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ వల్ల వీళ్లకు కరోనా టెస్టుల్లో పాజిటివ్ రావద్దని, నెగిటివ్ రావాలని ఆకాంక్షిద్దాం. కానీ ఒక వేళ పాజిటివ్ వస్తే మాత్రం ఆయా అధికారగణం నివాసముండే ఖమ్మం నగరంలోని మరో మూడు ప్రాంతాలను కూడా కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాకు ఈ తరహాలో నిత్యం షటిల్ సర్వీస్ చేస్తున్న అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల వల్ల కూడా వైరస్ వ్యాప్తి ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా పరిస్థితుల్లో అటు ప్రయివేట్ అంబులెన్సుల రాకపోకలపై, ఇటు ప్రభుత్వ అధికారుల, సిబ్బంది షటిల్ సర్వీస్ వ్యవహారంపై ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనే అంశం ప్రస్తుతం ప్రధానంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు ఏడు పాజిటివ్ కేసులకే పరిమితమైన ఖమ్మం జిల్లాను సూర్యాపేట జిల్లా నుంచి కొనసాగుతున్న అంబులెన్సుల, కొందరు ప్రభుత్వాధికారుల నిత్య రాకపోకలు వైరస్ వ్యాప్తి తీవ్రతకు దారి తీయకముందే అత్యవసర చర్యల అవశ్యకతను గుర్తు చేస్తున్నాయి.

Comments are closed.

Exit mobile version