భౌతిక విధ్వంసం కంటే అమూర్తమైన విధ్వంసం అత్యంత శరాఘాతంగానూ, విభ్రాంతికరంగానూ ఉంటుందని కరోనా కాలం చెబుతున్న సత్యం. ఇంతకుముందెన్నడూ చూడని వాస్తవాలను, భ్రమాత్మక లోకంలోని లొసుగులను కరోనా ఏ అరమరికలు లేకుండా కళ్లకు కట్టింది. మనుషులుగా మనం ఎక్కడున్నామో.. అభివృద్ధి పరంగా ఏ ఎత్తులకు ఎదిగామో… మన ఆర్థిక వ్యవస్థ ఏ శిఖరాలను అధిరోహించిందో… కరోనా క్రిస్టల్‌ క్లియర్‌గా లెక్కలు వేసి మరీ చూపింది.

కాలగతి చాలా చిత్రమైనది. పాలకులు అబ్రకదబ్ర అంటూ మాయాలోకాన్ని చూపిస్తూ, జనసామాన్యాన్ని ఒట్టి దద్దమ్మలను చేసి ఆడుకుంటున్నప్పుడు… ఏదో ఒక సందర్భంలో అది చెర్నాకోలాతో ఒక్క దెబ్బ వేసి దెయ్యాన్ని వదిలిస్తుంది. మనం ఎక్కడున్నామో.. ఎవరో ఆడిస్తే మనం ఎలా ఆడుతున్నామో.. అనుభవపూర్వకంగా తెలియజేస్తుంది. దేశ అభివృద్ధి పైపై బుడగల నిజరూపాన్ని, పాలకుల లోలోపలి డొల్లతనాన్ని కళ్లముందు నగ్నంగా నిలబెడుతుంది.

కరోనా– అత్యంత కఠోర వాస్తవాలను, మింగలేని చేదు నిజాలను ఆవిష్కరించింది. లాక్‌డౌన్‌ అమలు చేసిన నాలుగురోజులకే ఈ దేశంలో పేదరికం ఎలా పరిమళిస్తోందో… జీవన భద్రత ఎంత అద్భుతంగా ఉందో… అసంఘటిత రంగం ఎంత బలిష్టంగా నిలిచి వెలుగుతోందో తెలియజెప్పింది. ఢిల్లీ, ముంబయి వంటి మహానగరాల్లోనే కాకుండా, దేశం నలుమూలలా పొట్ట చేత పట్టుకొని బతుకుతున్న లక్షలాది మంది… లాక్‌డౌన్‌ వేటుతో రోడ్ల వెంబడి బారులు బారులుగా సొంతూళ్లకు పయనమైన దృశ్యాలు మన దేశంలో ‘భద్ర జీవనం’ ఎంత భద్రంగా వర్ధిల్లుతున్నదో మహ బాగా చెప్పాయి.

విచిత్రం ఏమిటంటే.. లాక్‌డౌన్‌ తాత్కాలికమేనని, కొంత ఉపశమనం తర్వాత యధావిధిగా కార్యకలాపాలు మొదలవుతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెప్పినా మహా నగరాల్లో ఉన్న వలస కూలీలు, కార్మికులు వినిపించుకోలేదు. తెలంగాణ వంటి అనేక రాష్ట్రాలు నిత్యావసరాలు, తక్షణ నగదు సహాయాలు అందించినా వాళ్లు ఆగిపోలేదు. సొంతూళ్లలో ఉపాధి కరువై బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన కార్మిక కుటుంబాలు… తమ ఊళ్లలో ఏముందని తిరిగి అక్కడికే బాటపట్టాయి..? అనే ప్రశ్నకు అంత సులభంగా జవాబు దొరకదు. వలస కూలీల సంఖ్య విషయంలో, సమాచారం విషయంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే వాదనలు ఉన్నాయి. మొత్తం సంఖ్యలో నాలుగో వంతు మందికి కూడా సహాయం అందలేదనేది దాచేస్తే దాగని సత్యం. వారి వలసలకు ఇదొక్కటే కారణమా?

వలసకూలీల జీవితాలు చిత్రమైనవి. వారికి స్థిరమైన ఆవాసం అంటూ ఉండదు. ఎక్కడ ఎన్నాళ్లు పని దొరికితే అక్కడ ఉంటారు.. ఆ తర్వాత మరో చోటుకు పయనం. ఇట్లా… శరీరంలో సత్తువ ఉన్నంత కాలం దేశదిమ్మరులై భార్యాపిల్లలతో పనికోసం సాగుతూనే ఉంటారు. వారికి ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు ఉండవు.. బ్యాంకుల్లో ఖాతాలు ఉండవు.. అంతెందుకు చాలామందికి తమ చిరునామాయే తమకే తెలీదు. ‘పని–కూలి’ చుట్టూ తిరిగే వారి జీవితాలకు చిరునామాలతో పని ఉండదు గనుక వాటిని తెలుసుకోవాల్సిన అగత్యమూ ఏర్పడలేదు. ఈ చిక్కే లెక్కలు తేల్చడానికి ఇబ్బందిగా మారిందని ఆధికారులు చెబుతుంటారు. చిరునామాలు లేనప్పుడు… ఆధార్‌లు లేనప్పుడు వారు ఏ లెక్కల్లోనూ ఇమడలేరు. ఎవరి లెక్కల్లోకి ఎక్కిపోరు. అందుకే వలసకూలీలు ఎవరికీ పట్టని అనాథలైపోయారు. ఓటు ఉన్న వాళ్లు మాత్రమే మనిషి విలువను పొందుతున్న ఈ దేశంలో, అది లేని వలసకూలీల పట్ల ఏ పాలకుడికైనా, ఏ నాయకుడికైనా, ఏ ప్రజాప్రతినిధికైనా బాధ్యత ఎందుకు ఉంటుంది….? వారిని ఆదుకోవాలనీ, వారికి తృణమిచ్చి ఫలం పొందాలనే యావ ఎందుకు ఉంటుంది.. ?

లాక్‌డౌన్‌ వేళ బతుకుదెరువు మీద పోయిన నమ్మకం కంటే, కూలి డబ్బులు లేక పూట గడిచేదెలా అనే భయం కంటే.. ప్రభుత్వాలిచ్చే అరకొర చేయూత కంటే, తాముంటున్న చోట ‘సమాజం’ అంతా ఐసోలేట్‌ కావడంతో.. ‘బతుకు’మీద నమ్మకం కోల్పోయి వలస కూలీలు గడగడా వణికిపోయి ఉంటారు. భద్రలోకపువాసుల ఇళ్లన్నీ ‘లాక్‌’డౌన్‌లో మునిగి పోగా, అండగా నిలిచే వ్యవస్థ కానరాక.. తాముంటున్న ప్రాంతం తమది కాదని, తాము ఇక్కడి వాళ్లకు పరాయివాళ్లమన్న ఎరుక అనుభవంలోకి వచ్చి ఉంటుంది. అందుకే పూట గడవడం అనేది సమస్యగా మారకపోయినా.. ఆర్థిక సమస్యలు అప్పుడే సతమతం చేయకపోయినా.. తల్లి పొత్తిళ్ల వంటి సొంత ఊరికి చేరిపోవాలనే ఆతృత ఎక్కువైంది.. బతుకైనా చావైనా తాము పుట్టిన చోటే అనుకుంటూ పయనమైనట్టు కనిపిస్తుంది.

అసంఘటిత రంగంలోని వలస కార్మికులు, కూలీల జీవితాలు ఎంత అభద్రంగా, అగమ్యగోచరంగా ఉన్నాయో పాలకులు తెలుసుకున్నారో లేదో తెలియదు కానీ, మన ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రతలోని డొల్లతనాన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ వేళ భారత్‌లో రోడ్డెక్కిన వలస కూలీల వెతలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆర్థిక ప్రమాణాలతో పాటు సామాజిక భద్రత, భరోసా ఎంతో అథమంగా ఉన్నాయో తేటతెల్లమైంది. లాక్‌డౌన్‌ పరిణామాలు, పర్యవసానాలు ఇంకా పూర్తిగా అనుభవంలోకి రాకమునుపే, వలసకూలీలు వడివడిగా సొంతూళ్లకు పయనం కావడంలోని అనేకానేక అంతర్లీన అంశాలపై పాలకులు కాదుగానీ, మానవీయ ఆర్థికవేత్తలు విశ్లేషణలు జరపాలి.

కరోనా కట్టడి విషయంలో విదేశాల కంటే మనమే ముందున్నామని చెప్పుకోవడం కాక, స్వదేశంలో కరోనా కట్టడి ఫలితాలపై అవలోకనం చేసుకోవాలి. అనేకానేక దారుల్లో బారులు బారులుగా పయనమవుతున్న వలస కూలీలకు అనేక చోట్ల మానవత్వమున్న వారు అండగా నిలుస్తున్నారు. ఏ ప్రయోజనమూ, ఫలితమూ ఆశించకుండా, ఏ లెక్కలు వేసుకోకుండా సహాయపడుతున్నారు. మనిషికి మనిషే ముప్పు అని కరోనా చాటిచెబుతున్న కాలంలో ఎప్పటికైనా మనిషికి మనిషే అండ అని చాటిచెబుతున్నారు. ఈ నిస్వార్థగుణాన్ని, మానవీయతను సత్యసంపన్నతతో పాలకులు కూడా ఒంటబట్టించుకుంటే ఎంత బాగుండు..!? వలసకూలీల వెతలు ఆవిష్కరించిన కొత్త చిత్రాలు కొత్త సంస్కరణలకు నాంది పలికితే ఎంత బాగుండు!?

–శంకర్‌ శెంకేసి

Comments are closed.

Exit mobile version