పసుపు తాడు, జీలకర్ర, బెల్లం… పట్టుమని పది మందికి దాటని బంధుగణం హాజరు… అమెరికాలో ఓ జంట పెళ్లి. అదీ భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం. పురోహితుడు కూడా లేకుండానే ‘మాంగళ్యం తంతునానేనా…’ అంటూ మంగళసూత్రధారణ జరిగింది. అలాగాని ఈ జంటకు ఎవరూ లేరు కాబోలు అనుకుంటే పొరపాటే అవుతుంది. మన తెలుగు రాష్ట్రాలకే చెందిన ఈ యువతీ, యువకులకు బోలెడంత మంది బంధువులు. ఎంతో మంది శ్రేయోభిలాషులు. వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి వంటి ప్రముఖుల ఆశీస్సులను స్వయంగా అందుకోవలసిన ఈ జంట దాదాపు ఏడుగురి సమక్షంలో తమ వివాహాన్ని చేసుకోవలసి వచ్చింది.

కంచికి వెళ్లి తెచ్చిన పట్టుచీరలు, కాకినాడ సమీపంలోని ఉప్పాడ నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక పట్టు వస్త్రాలు, చెన్నయ్ తదితర నగరాల నుంచి కొనుగోలు చేసిన బంగారు నగలు… అంతా సజావుగా ఉంటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి బంధుగణం, స్నేహ బృందం ఫ్లయిట్లో వెళ్లి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాల్సిన సంబురం. కానీ ఈ పెళ్లి సంబరానికి కరోనా విలన్ గా మారింది.

ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది, ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ కోశాధికారి స్వామి రమేష్ కుమార్-జయశ్రీ దంపతుల కనిష్ట పుత్రుడు సందేశ్ వివాహం రాజమండ్రికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ చీమకుర్తి గోపాల్ కూతురైన సాహితితో భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి న్యూజెర్సీలో వివాహం జరిగింది. వాస్తవానికి ఈ పెళ్లి కోసం స్వామి రమేష్ కుమార్ దంపతులు గత కొన్ని నెలలుగా చేసుకున్న ఏర్పాట్లు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. వ్యయ, ప్రయాసకోర్చి చేసుకున్న అన్ని ఏర్పాట్లనూ కరోనా ఛిన్నాభిన్నం చేసింది.

తన కుమారుని వివాహాన్ని స్వామి రమేష్ కుమార్ దంపతులతోపాటు, ఆయన తల్లి, దండ్రులు వీడియో ద్వారా వీక్షించాల్సి వచ్చింది. ఆశీస్సులు అందించాల్సిన రామసహాయం సురేందర్ రెడ్డి వంటి ప్రముఖులు ఫోన్ ద్వారా మాత్రమే నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు. అమెరికాలోనే ఉంటున్న స్వామి రమేష్ కుమార్ రక్త సంబంధీకులు సైతం సందేశ్-సాహితిల పెళ్లికి హాజరుకాకుండా అక్కడా లాక్ డౌన్ అడ్డుకుంది. కేవలం 3 కిలోమీటర్ల దూరంలోని స్వామి రమేష్ కుమార్ మేనల్లుడు సైతం ఈ పెళ్లికి హాజరు కాలేని కఠిన నిబంధనలు.

ఇటువంటి పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేయవచ్చు కదా? అనే ప్రశ్నకు స్వామి రమేష్ కుమార్ స్పందిస్తూ, ‘ఫలానా తేదీ వరకు కరోనా కల్లోలం ముగుస్తుందంటే వాయిదా వేయవచ్చు. లాతూర్ భూకంపం, విశాఖ హుద్ హుద్ తుపాను ఓ వ్యవధి వరకే విధ్వంసం సృష్టించి వెళ్లాయి. కానీ కరోనా విలయం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి. ముందే నిర్ణయించిన ముహూర్తం ప్రకారం పెళ్లి జరిగింది. పిల్లలు సంతోషంగా ఉంటే చాలు కదా?’ అని అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ భారతీయ సంప్రదాయం ప్రకారమే పెళ్లి జరగడం తనకూ, తన కుటుంబ సభ్యులకు ఎనలేని సంతోషాన్ని కలిగించిందని స్వామి రమేష్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు.

Comments are closed.

Exit mobile version