బ్రెజిల్, ఈక్వెడార్ దేశాల నుంచి దిగుమతి అయిన చికెన్, చేపలు, పీతల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించినట్లు చైనా చేసిన ప్రకటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. ఆహార పదార్థాల ఉత్పత్తులు, వాటి ప్యాకింగ్ ల ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదని పేర్కొంది. బ్రెజిల్ నుంచి తమ దేశానికి దిగుమతి అయిన ‘ఫ్రోజెన్ చికెన్’ (నిల్వ గల కోడి మాంసం)లో కరోనా వైరస్ కనిపించిందని, ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న చేపలకు, పీతలకు కూడా కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామని చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే.
చైనా చేసిన ఆయా ప్రకటనపై అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తా కథనాలను కూడా ప్రచురించాయి. అయితే చైనా ప్రకటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందిస్తూ, ప్రజలు ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ఆహార పదార్థాలు, ఫుడ్ చైన్ సిస్టమ్ ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది. ఇందుకు సంబంధించి WHO ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ హఎడ్ మైక్ ర్యాన్ ఓ ప్రకటన చేశారు.
ఇదిలా ఉండగా చైనా ఆరోపణలపై బ్రెజిల్ ఈక్వెడార్ దేశాలు స్పందిస్తూ, కరోనా నిబంధనలను తమ దేశాలు కఠినంగా పాటిస్తున్నాయని చెప్పాయి. ఓసారి తమ దేశం దాటాక ఫుడ్ ప్యాకేజీలతో తమకు ఎటువంటి సంబంధం ఉండదని ఈక్వెడార్ వ్యాఖ్యానించగా, ఈ విషయంలో తాము పూర్తి సమాచారం కోసం వేచి చూస్తున్నట్లు బ్రెజిల్ వెల్లడించింది. ఎన్నో వేల ఫుడ్ ప్యాకింగ్ లను చైనా పరిశీలించగా, చాలా తక్కువ స్థాయిలో కరోనా వైరస్ కారకాలను గుర్తించినట్లు WHO ఎపిడిమాలజిస్ట్ వాన్ కెర్ ఖోవ్ పేర్కొనడం గమనార్హం.