హుజూరాబాద్ ఉప ఎన్నికల రాజకీయంలో ఇదో అనూహ్య పరిణామం. స్వతహాగా క్రీఢాకారుడైన పాడి కౌశిక్ రెడ్డి రాజకీయంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ పై ఆయనకు లభించిన వాస్తవిక భరోసా ఏమిటోగాని, ఫోన్ లో మాట్లాడుతూ లీకైన ఆడియో ద్వారా కౌశిక్ రెడ్డి రాజకీయంగా అగాధంలోకి కూరుకుపోయారనే వాదన పరిశీలకుల నుంచి వినిపిస్తోంది. దరిమిలా క్రికెట్ లో బ్యాట్స్ మెన్ గా పేరుగాంచిన కౌశిక్ రెడ్డి రాజకీయ క్రీడలో సెల్ఫ్ ఔట్ అయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో గట్టి అండదండలున్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి తమ్ముని వరుస అవుతారు. ఉత్తమ్, కౌశిక్ రెడ్డిల మాతృమూర్తులు స్వయానా అక్కా చెల్లెళ్లుగా సమాచారం. కౌశిక్ రెడ్డి ప్రస్తుత రాజకీయ హోదాకు ఉత్తమ్ అండదండలే ప్రధాన కారణమనే అభిప్రాయాలు కాంగ్రెస్ శ్రేణుల్లోనే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి 60 వేల ఓట్లకుపైగా సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జిగానూ వ్యవహరిస్తున్నారు.

గత కొంత కాలంగా టీఆర్ఎస్ నేతలతో కౌశిక్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారనే అభియోగాలు ఉన్నాయి. ముఖ్యంగా గత నెల 11వ తేదీన మంత్రి కేటీఆర్ తో కలిసి సన్నిహితంగా మెదలడం, ఆయన చెవిలో గుస గుసలాడిన ఫొటోలు వైరల్ కావడం తెలిసిందే. అయితే తన ఇంటిపక్కనే ఉండే స్నేహితుని ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారని, అనూహ్యంగా అక్కడ తాము కలుసుకున్నామే తప్ప, ఇందులో రాజకీయ ప్రధాన్యత లేదని కౌశిక్ రెడ్డి అప్పట్లో ప్రకటించారు. ఈ పరిణామాల్లోనే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం కావడం, ఈనెల 7వ తేదీన ఆయన పదవీ స్వీకారం చేసిన పరిణామాల్లోనూ కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పట్ల విశ్వాసాన్ని ప్రకటించినట్లుగానే వ్యవహరించారు.

రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారానికి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు కూడా. తన సోదరుని వరుసయ్యే ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేవంత్ తో చిరునవ్వులు సైతం చిందించారు. వచ్చే ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని, విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. అయినప్పటికీ కౌశిక్ రెడ్డి కదలికలపై హుజూరాబాద్ కాంగ్రెస్ శ్రేణులు సంశయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తనకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఖరారైందని, యవతను సమీకరించాలని, ఖర్చులు కూడా భరిస్తానని హామీ ఇస్తూ కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీకైంది.

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో ఉత్తమ్ తో కలిసి కౌశిక్ చిరునవ్వుల దృశ్యం (ఫైల్ ఫొటో)

దీంతో రాజకీయంగా కౌశిక్ రెడ్డి అనుసరిస్తున్న మార్గంపై స్థానిక కాంగ్రెస్ శ్రేణులకు క్లారిటీ వచ్చినట్లయింది. మరోవైపు కౌశిక్ రెడ్డి వ్యవహార తీరుపై పీసీసీ క్రమశిక్షణా సంఘం సీరియస్ అయ్యింది. షోకాజ్ నోటీస్ జారీ చేస్తూ 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కౌశిక్ రెడ్డిని కోరింది. అయితే తాజా సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కౌశిక్ రెడ్డి సర్వం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 14 లేదా 15 తేదీల్లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆటగాడైన కౌశిక్ రెడ్డికి తెలంగాణా స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ పదవి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది.

Comments are closed.

Exit mobile version