హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ తనకు ఖరారైనట్లు కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇదే విషయంపై కౌశిక్ రెడ్డి ఓ యువకుడితో మాట్లాడుతున్న ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయేందర్ అనే యువకుడితో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, హుజూరాబాద్ టికెట్ తనకు కన్ఫర్మ్ అయినట్లు వెల్లడించడం విశేషం. మాదన్నపేటకు చెందిన విజయేందర్ తో ఆయన మాట్లాడుతున్న ఆడియో క్లిప్ రాజకీయంగా పెను దుమారం కలిగిస్తోంది.

ఎందుకంటే కౌశిక్ రెడ్డి ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉండడం, నల్లగొండ ఎంపీ, నిన్న మొన్నటి వరకు టీపీసీసీ అధ్యక్షునిగా వ్యవహరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి తమ్ముడు కావడమే ఇందుకు ప్రధాన కారణం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో సన్నిహితంగా కౌశిక్ రెడ్డి సంభాషిస్తున్న ఫొటోలు కూడా ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి తనకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఖరారైందని, యువతను సమీకరించాలని, వాళ్లకు అవసరయ్యే ఖర్చులు కూడా తాను భరిస్తానని భరోసా ఇస్తూ విజయేందర్ అనే యువకుడితో సంభాషించిన ఆడియోను దిగువన వినవచ్చు.

https://ts29.in/wp-content/uploads/2021/07/koushik.mp3

UPDATE:
కాగా హుజురాబాద్ కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణా పీసీసీ క్రమశిక్షణా సంఘం కొద్ది సేపటి క్రితం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ సందర్భంగా క్రమశిక్షణా సంఘం చైర్మెన్ కోదండరెడ్డి మాట్లాడుతూ, పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించినా మారలేదని, 24 గంటల్లోగా ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొన్నట్లు క్రమశిక్షణ సంఘం చైర్మెన్ చెప్పారు. లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు కోదండరెడ్డి వెల్లడించారు.

ఫొటోలు: కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి మంతనాలు (ఫైల్)

Comments are closed.

Exit mobile version