ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ పై తిరుగుబావుటా ఎగురవేయడానికి కారణం ఏమిటి? కేవలం తన ఆర్థిక బలాన్ని చూసుకుని పొంగులేటి కాలు దువ్వుతున్నారా? లేక అభిమాన, అనుచర, అనుయాయుల అంగబలంతో కేసీఆర్ అధికార పీఠాన్ని ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారా? అసలు పొంగులేటి దమ్ము ఏంటి? ధైర్యం ఏమిటి? శక్తి, యుక్తులేమిటి? లేదా ఆయన వెనుక ఏదేని బలమైన రాజకీయ శక్తి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే నిన్న హైదరాబాద్ లో కనిపించిన పొలిటికల్ పిక్చర్ ను ఓసారి నిశితంగా పరిశీలించాల్సిందే.

పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర నాయకులు నిన్న హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. తన ఇంటికి వచ్చిన కాంగ్రెస్ పెద్దలకు, ముఖ్యులకు తనదైన శైలిలో ఆహ్వానం పలికి ఆతిథ్యం ఇచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడే ఓ సీన్ ను ప్రధాన మీడియా ఏదీ పట్టించుకోకపోవడమే అసలు ట్విస్ట్. ఫొటోను జాగ్రత్తగా చూడండి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుని పొంగులేటికి ఏదో చెబుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన కేవలం వ్యక్తి కాదు సుమీ.. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో 93 ఏళ్ల రాజకీయ భీష్ముడు. నిన్న పొంగులేటి ఇంట జరిగిన పొలిటికల్ ఎపిసోడ్ లో ఇతని గురించి ఏ మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు.. అని ప్రస్తావించడం కన్నా, బహుషా అతనెవరో ఇప్పటి తరం జర్నలిస్టులకు అతని నేపథ్యం తెలిసి ఉండకపోవచ్చు. ఇంతకీ అతనెవరు? పొంగులేటికి అతను చెబుతున్నదేమిటి? కాంగ్రెస్ పార్టీకి, అతనికి గల సంబంధమేంటో తెలుసుకునేముందు అతని రాజకీయ చరిత్రను ఓసారి చూద్దాం.

రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారికైనా అతనెవరొ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఖమ్మం జిల్లాకే చెందిన అతను కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నేత. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో ఆయనకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యునిగా, మరో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు మరపురాని సేవలు అందించారు. ఓసారి ఎంపీగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. 1967-71, 1989-91,1991-96లలో వరంగల్ పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. అంతకు ముందు ఆయన 1978-83, 1983-85, 1985-89 సంవత్సరాల్లో డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన రాజకీయ జీవితంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలోనేగాక, ప్రత్యేక తెలంగాణాలో రాజకీయ పరిణామాలు ఎన్ని మారినా ఆయన మాత్రం కాంగ్రెస్ జెండాను వీడలేదు.

అయితే 1996 నుంచి రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్న ఇతను ఇప్పటికీ కాంగ్రెస్ నాయకుడే కావడం విశేషం. పదవులకోసమో, రాజకీయ ఆధిపత్యం కోసమో పార్టీలు మారే అలవాటు ఆయనకు లేకపోవడం గమనార్హం. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యధినేత అయినప్పటికీ ‘లో ప్రొఫైల్’గా ఉండడమే అతని ప్రత్యేకత. ఎస్.. అతనే రామసహాయం సురేందర్ రెడ్డి.

దాదాపు 27 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న సురేందర్ రెడ్డి టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి పొంగులేటి ఇంటికి వచ్చిన సందర్భంగా అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడమే అసలు రాజకీయంగా పరిశీలకులు భావిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రామసహాయం సురేందర్ రెడ్డికి దాదాపు ఏడాది క్రితం బంధుత్వం ఏర్పడింది. సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి పుత్రునికి పొంగులేటి తన కూతురును ఇచ్చి వివాహం జరిపించారు. సురేందర్ రెడ్డి భావనలో చెప్పాలంటే రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు. అందుకే కాబోలు 27 ఏళ్ల అనంతరం సురేందర్ రెడ్డి రాజకీయంగా క్రియాశీలకంగా మారుతున్నారనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని రాజకీయ శక్తిగా చక్రం తిప్పిన సురేందర్ రెడ్డికి పెద్ద ఎత్తున శిష్యగణం ఉంది. వాళ్లంతా ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, వరంగల్ మాజీ ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య వంటి అనేక మంది ముఖ్య నేతలు సురేందర్ రెడ్డి శిష్యులే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారైన నేపథ్యంలో సురేందర్ రెడ్డి రాజకీయంగా క్రియాశీలకం కావడం ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని, అది కేవలం పొంగులేటికేగాక, రాష్ట్ర కాంగ్రెస్ కు తిరుగులేని శక్తినిస్తుందని ఆ పార్టీ అభిమానులు అంచనా వేస్తున్నారు. పొలిటికల్ స్కెచ్చులు వేయడంలో తిరుగులేని నేతగా పేరుగాంచిన సురేందర్ రెడ్డి వ్యూహాలు మున్ముందు ఎలా ఉండబోతున్నాయనే అంశం ఆసక్తికరం అంటున్నారు పొలిటికల్ అబ్జర్వర్స్.

Comments are closed.

Exit mobile version