తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు. వరంగల్ పర్యటన ముగిసిన తర్వాత తిరుగు పయనంలో ఆయన యాదాద్రి పుణ్యక్షేత్రంలోనూ పర్యటించనున్నారు. ఈమేరకు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లను చేసింది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజి మైదానానికి ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అక్కడి నుంచి కూల్చివేసిన సెంట్రల్‌ జైలు ప్రదేశానికి వెళ్తారు. ఇక్కడ 30 అంతస్థుల్లో నిర్మించే మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

ఆ తర్వాత ఉదయం 11.35 గంటలకు కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో నిర్మించిన కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ భవనాన్ని, హన్మకొండ సుబేదారి ప్రాంతంలో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడే అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారు. వరంగల్‌ మహానగరంలో పర్యటన ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌ తిరుగు పయనంలో సాయంత్రం నాలుగు గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. పెద్దగుట్టపై టెంపుల్‌సిటీ లే ఔట్‌, గండిచెరువు వద్ద నిర్మాణాలు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను పరిశీలిస్తారు. ప్రధానాలయ ప్రాకార గోపుర సముదాయానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్‌ను సీఎం వీక్షిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ కు సీఎం కేసీఆర్ చేరుకుంటారని అధికారిక ప్రకటన వివరించింది.

Comments are closed.

Exit mobile version