తెలంగాణా సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఇది అనూహ్య ఘటనగా అధికార పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎప్పటిలాగే తన వరంగల్ పర్యటనలో కేసీఆర్ ఈసారి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు ఇంటికి వెళ్లడం లేదు. గత పర్యటనల నేపథ్యానికి భిన్నంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటికి కేసీఆర్ మధ్యాహ్న భోజనానికి వెడుతుండడమే రాజకీయ చర్చకు దారి తీసింది. కేసీఆర్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్లకపోవడం చర్చనీయాంశం కాకపోవచ్చు, కానీ ఈసారి వరంగల్ పర్యటనలో ఆయన కడియం శ్రీహరి ఇంటికి వెడుతుండడమే ఆసక్తికర పరిణామంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి ఉద్యమ కాలం నుంచి కూడా కేసీఆర్ ఎప్పుడు వరంగల్ వచ్చినా హంటర్ రోడ్డులోని కెప్టెన్ ఇంటికి వెళ్లేవారు. కేవలం భోజనానికే కాదు, బస చేయాల్సి వచ్చినా కెప్టెన్ నివాసాన్ని మాత్రమే ఇందుకు ఎంచుకునేవారు. ఉద్యమకాలం నుంచి కూడా కెప్టెన్ నివాస గృహాన్ని కేసీఆర్ సెంటిమెంట్ గా భావించేవారని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఒక్కోసారి రోజుల తరబడి ఉండాల్సి వచ్చినా, కెప్టెన్ ఇంటినే కేసీఆర్ తన పర్యటనల్లో బసకు ఉపయోగించుకునేవారు. ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సందర్భనకు వచ్చిన సందర్భంలోనూ కేసీఆర్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికే భోజనానికి వెళ్లిన సంగతి తెలిసిందే. గడచిన రెండు దశాబ్ధాలుగా కేసీఆర్ వరంగల్ పర్యటనల్లో 90 శాతానికిపైా కెప్టెన్ ఇంట్లోనే భోజనాలు, బస చేసిన రికార్డు ఉంది.

అయితే గత రికార్డుకు భిన్నంగా సీఎం కేసీఆర్ సోమవారంనాటి పర్యటనలో కడియం శ్రీహరి ఇంటికి భోజనానికి వెడుతుండడం విశేషం. ఇటీవలే ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా ముగిసిన కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తు, పయనంపై భిన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆయన ఇంటికి భోజనానికి వెడుతుండడం ఆసక్తికర పరిణామంగా గులాబీ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. వాస్తవానికి గత రెండు పర్యటనలకు ముందే సీఎం కేసీఆర్ కడియం శ్రీహరి ఇంటికి వెళ్లాల్సి ఉండగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు మోకాలొడ్డినట్లు కథనం ప్రచారంలో ఉంది. దీంతో కేసీఆర్ అప్పట్లో కడియం ఇంటికి వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావుల మధ్య రాజకీయ విభేదాలు ఈనాటివి కావనే విషయం అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కాలంలోనూ వీరిద్దరి మధ్య ఎడతెడని రాజకీయ వైరుధ్యపు ఘటనలు అనేకసార్లు చర్చనీయాంశాలుగా మారాయి కూడా.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన సోమవారంనాటి వరంగల్ పర్యటనలో భోజనానికి కడియం శ్రీహరి ఇంటికి వెడుతుండడం సహజంగానే రాజకీయ చర్చకు దారి తీసింది. ఈటెల రాజేందర్ రాజీనామా అనంతర రాజకీయ పరిణామాలు, నిన్నటి సిద్ధిపేట పర్యటనలో కేసీఆర్ నోటివెంట దళితుల సాధికారత, వారి అభివృద్ధి కోసం రూ. 1,000 కోట్ల కేటాయింపు ద్వారా సీఎం దళిత ఎంపవర్ మెంట్ (సీఎండీఈ) పథకం ప్రకటన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటికి వెడుతుండడం గమనార్హంగా పరిశీలకులు ఉటంకిస్తున్నారు. ఆయా పరిణామలు భిన్న చర్చకు ఆస్కారం కలిగిస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల, నేతల అభీష్టానికి విరుద్ధంగా కేసీఆర్ కడియం శ్రీహరి ఇంటికి వెడుతున్నారని, అది భవిష్యత్ రాజకీయాల్లో ఎటువంటి సంచలన పరిణామాలకు దారి తీస్తుందనే అంశంపైనే తాజా చర్చ జరుగుతండడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version