పోడు భూముల సమస్యపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పోడు భూముల విష‌యంలో అవసరమైతే అఖిల‌ప‌క్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామ‌ని, ఈ స‌మ‌స్య‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్కరిస్తామన్నారు. హ‌రిత‌హారంపై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ చేప‌ట్టిన సంద‌ర్భంగా పోడు భూముల స‌మ‌స్య‌ల‌పై స‌భ్యులు లేవనెత్తిన అంశాల‌పై సీఎం కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు.

అత్యుత్సాహం ఉండే అధికారులు అడ‌వి మీద ఆధార‌ప‌డి బ‌తికే గిరిజ‌నుల‌ను డిస్ట‌ర్బ్ చేస్తున్నారని, ఇటీవ‌లి కాలంలో ఘ‌ర్ష‌ణ‌లు కూడా జ‌రిగాయన్నారు. పోడు భూముల స‌మ‌స్య‌ల‌పై గ‌తంలో చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయని, యూపీఏ గ‌వ‌ర్న‌మెంట్ గతంలో ఒక చ‌ట్టం కూడా తెచ్చిందన్నారు. పోడు భూములు దున్నుకునే వారికి ర‌క్ష‌ణ క‌ల్పిద్దామ‌ని ఆ చ‌ట్టంలో పొందుప‌రిచారని, ఎట్టి ప‌రిస్థితుల్లో ఫారెస్ట్ కింద నోటిఫై అయిన ల్యాండ్ ఓన‌ర్‌షిప్‌కు మార‌దన్నారు. అది సెంట్ర‌ల్ యాక్ట్ అంటూ… అది మ‌న చేతుల్లో కూడా లేదని, సుప్రీంకోర్టు జ‌డ్జిమెంట్ల మేర‌కు రూపొందించిన యాక్ట్ అని సీఎం స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 96,676 మంది గిరిజ‌నుల‌కు 3.8 ల‌క్ష‌ల ఎకరాల‌కు ఆర్వోఎఫ్ఆర్ ప‌ట్టాలు ఇచ్చారని, రైతుబంధు ప్రారంభించిన‌ప్పుడు వీరికి రైతు బంధు వ‌చ్చేది కాదని, ఆ త‌ర్వాత వారికి కూడా రైతుబంధు ఇస్తున్నామన్నారు. ఈ పోడు భూముల వ్య‌వ‌హ‌రాన్ని తేల్చుతామ‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చామని, తేల్చాల్సిన అవ‌స‌రం ఉందని, అట‌వీ అధికారులు, గిరిజ‌నుల మ‌ధ్య గొడ‌వ‌లు ఉండ‌టం మంచిది కాదన్నారు.

ఈ స‌మ‌స్య‌పై మంత్రి సత్య‌వ‌తి రాథోడ్ ఆధ్వ‌ర్యంలో కేబినెట్ స‌బ్ క‌మిటీ చేశామని, వారు ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చించారన్నారు. ఇప్ప‌టికే ప‌ట్టాలిచ్చిన భూములు కాకుండా, ఎంత భూమి పోడు వ్య‌వ‌సాయం చేస్తున్నారో తేల్చితే, వారికి కూడా ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాలు ఇచ్చి, రైతుబంధు ఇస్తే ఆ స‌మ‌స్య స‌మ‌సిపోతోందని, ఘ‌ర్ష‌ణ కూడా త‌గ్గిపోతుందని సీఎం అన్నారు.

అది కావాలంటే ఆ యాక్ట్ తేదీని పొడిగించాల‌ని కేంద్రానికి విజ్ఞప్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంటుందని, స‌బ్ క‌మిటీ రిపోర్టు ఆధారంగా ఈ శాస‌న‌స‌భ స‌మావేశాల్లోనే ఏక‌గ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామన్నారు. ఆర్వోఎఫ్ఆర్ ప‌ట్టా ఇచ్చినంత మాత్రం వారు ఓన‌ర్లు కారని, జీవ‌న భృతి కోస‌మే ఈ ప‌ట్టా ఉప‌యోగ‌ప‌డుతుందని అవ‌స‌ర‌మైతే పోడు భూముల విష‌యంలో అఖిల‌ప‌క్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

Comments are closed.

Exit mobile version