ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే కాదు… ఎమ్మెల్సీ అంతకన్నా కాదు. ప్రస్తుతం ఎంపీ కూడా కాదు… కనీసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి కూడా కాదు. ఓ మాజీ ఎంపీ మాత్రమే. కానీ ఏకంగా తెలంగాణా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు ఛాంబర్ లో ఆమె పుట్టిన రోజు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆమె కల్వకుంట్ల కవిత. తన పుట్టిన రోజు సందర్భంగా కవిత సైతం ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. కవిత బర్త్ డే సంబురాల్లో మంత్రులు డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాసగౌడ్ లతోపాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.

తెలంగాణా సీఎం కేసీఆర్ సార్ కూతురు కవిత పుట్టిన రోజు వేడుకల నిర్వహణ ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సంతోషకర వేడుకే. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేకపోవచ్చు. సాధారణంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ లాబీల్లో తిరగడానికి, వీఐపీ గ్యాలరీలో కూర్చుని సమావేశాలను తిలకించడానికి నిబంధనల ప్రకారం ప్రాధాన్యత లభిస్తుంది. వీళ్లకు వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది కూడా. కానీ ప్రస్తుతం ఎటువంటి ప్రజాప్రతినిధి హోదా లేని కవిత జన్మదిన వేడుకలను అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో నిర్వహించడంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు అసెంబ్లీ నిబంధనలు అనుమతించే అంశంపై అధికార వర్గాలు సైతం పెదవి విరుస్తున్నాయి.

సీఎం కేసీఆర్ సారు కూతురైన కవిత పుట్టిన రోజు వేడుకలను సాక్షాత్తూ అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో నిర్వహించడంపై సహజంగానే రాజకీయ ఊహాగానాలు సాగుతున్నాయి. నిజామాబాద్ కు చెందిన మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభకు వెడుతున్నందున కవితను ఎమ్మెల్సీ చేస్తారనేది ఈ ఊహాగానాల సారాంశం. డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో పుట్టిన రోజు వేడుక అందుకు సంకేతంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలుకు ఈనెల 19వ తేదీ వరకు గడువు ఉండడం గమనార్హం.

డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఛాంబర్లో కవిత పుట్టిన రోజు వేడుకల వీడియోను దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version