అటవీ భూముల్లోని సంపదను అక్రమంగా అమ్ముకుంటున్న స్మగ్లర్లను నిలువరించిన పాపానికి ఓ అటవీ అధికారి సస్పెండయ్యారు. ఔను… మీరు చదువుతున్నది కరెక్టే. డ్యూటీ చేసినందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులు బీట్ ఆఫీసర్ కు విధించిన శిక్ష ఇది. ఇప్పుడీ ఘటన అటవీ శాఖలో విధులు నిర్వహించే అధికారుల, సిబ్బంది ఆత్మస్థయిర్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందంటున్నారు.
ఇందుకు దారి తీసిన ఘటన పూర్వాపరాల్లోకి వెడితే.. గత నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తి బీట్ పరిధిలో కొందరు వ్యక్తులు అటవీ భూముల్లో యధేచ్ఛగా అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతుండగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీను పట్టుకున్న సంగతి తెలిసిందే. అక్రమంగా మట్టి తవ్వకానికి ఉపయోగిస్తున్న జేసీబీ ఇతర వాహనాలను స్వాధీనం చేసుకుని అటవీ శాఖ కార్యాలయానికి తరలిస్తుండగా మట్టి మాఫియాగా భావిస్తున్న వ్యక్తులు కొందరు బీట్ ఆఫీసర్ శ్రీనును అడ్డగించారు. పట్టపగలు ఖమ్మం-ఇల్లెందు మెయిన్ రోడ్డుపై బీట్ ఆఫీసర్ శ్రీనును అటకాయించి అతనిపై దాడి చేసి, స్వాధీనం చేసుకున్న వాహనాలను తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తి ఒకరు ‘కిరణ్ పీఏ’ బంధువునంటూ ‘రుబాబ్’కు దిగిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి రఘునాథపాలెం పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
అయితే నడిరోడ్డుపై మట్టి మాఫియాకు చెందిన వ్యక్తలు చేతుల్లో దాడికి గురై, పిడిగుద్దుల వర్షపు బాధితునిగా మారిన చింతగుర్తి బీట్ ఆఫీసర్ శ్రీనును అటవీ శాఖ అధికారులు సస్పెండ్ చేయడం గమనార్హం. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఇందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్న కారణాలు ఏమిటో తెలుసా…? బీట్ ఆఫీసర్ శ్రీను విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారట. ప్రజాప్రతినిధులు తనకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పి అటవీ శాఖ గౌరవం దెబ్బతినేలా వ్యవహరించారట. తన పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా గుర్తించకపోగా, ప్రజాప్రతినిధుల తీరుతో తనకు అన్యాయం జరుగుతోందని మీడియాకు వెల్లడించినట్లు శ్రీనుపై ఆరోపణలు ఉన్నాయట. ఫలితంగా అటవీ శాఖ గౌరవం దిగజారుతున్నట్లు గుర్తించి బీట్ ఆఫీసర్ శ్రీనును సస్పెండ్ చేసినట్లు డీఎఫ్ వో ప్రవీణ వివరించినట్లు వార్తల సారాంశం.
వాస్తవానికి ఈ ఘటనలో అటవీ శాఖ ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై సహజమైన విమర్శలే వస్తున్నాయి. చింతగుర్తి బీట్ లో అటవీ శాఖకు చెందిన దాదాపు రూ. 25 కోట్ల విలువైన మట్టి అక్రమంగా తవ్వకానికి గురైనట్లు ఓ కథనం ప్రచారంలో ఉంది. రెండు నెలలుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోలేదన్నది ఉన్నతాధికారుల ప్రధాన ఆరోపణ. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ మట్టి మాఫియాకు తెగబడిన వ్యక్తులు తమకు రాజకీయ పరపతి ఉందని నడిరోడ్డుపైనే చేసిన సవాల్ ను బలపరిచే విధంగా ఉన్నతాధికారుల చర్య ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నెలల తరబడి మట్టి తవ్వకం జరుగుతున్న మాట వాస్తవమైనప్పటికీ, ఇప్పుడు… ఈ పరిస్థితుల్లో బీట్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు వేయడం అటవీ శాఖకు చెందిన సిబ్బంది ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసినట్లుగా ఉందంటున్నారు. ఈ వ్యవహారంలో శ్రీను నిర్లక్ష్యం ఉంటే శాఖాపరంగా మెమో జారీ చేసి, సంజాయిషీ కోరాల్సి ఉందని, నేరుగా సస్పెండ్ చేయడమేంటని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ఈ చర్య అటవీ శాఖ ఉద్యోగుల విధినిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతుందనే వాదన వినిపిస్తోంది. ఘటన జరిగిన రోజు బీట్ ఆఫీసర్ శ్రీనును కొందరు వ్యక్తుల అటకాయించి ఎలా వ్యవహరించారో దిగువన గల లింక్ లోని వీడియోను మరోసారి చూసేయండి.