రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం ఉండదనేది నానుడి. కానీ రాజకీయ నేతల, వ్యాపారవేత్తల మధ్య కూడా మిత్రుత్వం, శత్రుత్వం శాశ్వతం కాదనేది ఏపీలో తాజా రాజకీయ ముఖ చిత్రంలో సాక్షాత్కరిస్తున్న దృశ్యం. 2009లో ఏం జరిగిందో గుర్తుందిగా…? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడం, సీఎంగా మరోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత కొద్ది నెలల్లోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలీకాప్టర్ ‘మిస్సింగ్’లో దుర్మరణం చెందారు. తమ అభిమాన నేత అనూహ్యంగా దూరమైన దుఃఖాన్ని తట్టుకోలేక తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది గుండెలు బాదుకోగా, వందలాది హృదయాలు ఠక్కున ఆగిపోయాయి కూడా.

వైఎస్ మరణానికి సంబంధించి రష్యన్ వెబ్ సైట్ పత్రిక ‘ది ఎక్సైల్డ్’ ప్రచురించిన వార్తా కథనం వైఎస్ఆర్ అభిమానుల్లో రక్తాన్ని మరిగించింది. మహానేత వైఎస్ మరణం వెనుక రిలయన్స్ సోదరుల పాత్ర ఉందనే సారాంశంతో ప్రచురితమైన ‘ఎక్సైల్డ్’ వార్తా కథనాన్ని కొన్న టీవీ ఛానళ్లు, సాక్షి మీడియా కూడా ప్రముఖంగానే ప్రచురించి, ప్రసారం చేశాయి. దీంతో వైఎస్ఆర్ అభిమానుల్లో కోపం మరింత కట్టలు తెంచుకుంది. రిలయన్స్ సంస్థకు చెందిన పెట్రోల్ బంకులపై, షాపింగ్ మాల్స్ పై, ఇతర వ్యాపార సంస్థలపై విరుచుకుపడ్డారు. రిలయన్స్ సంస్థలకు పెద్ద ఎత్తున నష్టం కూడా వాటిల్లింది. పోలీసు బలగాలు రిలయన్స్ ఆస్తులకు భద్రత కల్పించాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి.

అయితే వైఎస్ మరణాన్ని తమకు అంటగట్టడం దారుణమని, వ్యాపారంలో తమను దెబ్బ తీసేదుకు ప్రత్యర్థులు వేసిన ఎత్తుగడగా అంబానీ సోదరులు వేర్వేరుగా అప్పట్లో స్పందించి వివరణ ఇచ్చారు. రిలయన్స్ ఆస్తుల విధ్వంసానికి సంబంధించిన కేసుల్లో వైఎస్ఆర్ అభిమానులు ఇప్పటికీ నిందితులుగానే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ కావడం సహజంగానే చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణాలు ఏవైనా ఉండొచ్చు. పరస్పర అవసరాలు మరేవైనా కావచ్చు. ప్రస్తుతం జగన్, ముఖేష్ భాయీ…భాయి. ఎటొచ్చీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు మాత్రమే రిలయన్స్ సంస్థకు దుష్మన్లు… అంటే శత్రువులన్నమాట. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కలిసిన ‘చరిత్రాత్మక భేటీ’ గురించి మీ సైట్లో ఏమీ రాయరా సర్? అని ప్రశ్నించాడు ఆంధ్రాకు చెందిన ఓ జర్నలిస్టు మిత్రుడు కోపంతో రగులుతూ. అందుకే ‘కట్టె…కొట్టె…తెచ్చె’ టైపులో కుప్తంగా రాసిన కథనమిది. కొసమెరుపు ఏమిటంటే… ముఖేష్ అంబానీ తాడేపల్లికి వస్తున్నదీ… ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తున్నదీ చివరి వరకు అత్యంత రహస్యంగానే ఉందట. ముఖేష్ జగన్ కోసం రాగానే ఇంటలిజెన్స్ అధికారులు సైతం నివ్వెరపోయారట. అత్యంత గోప్యంగా ఉంచారట. అదీ విషయం.

Comments are closed.

Exit mobile version