కల్వకుంట్ల కవిత. తెలంగాణా సీఎం కేసీఆర్ కూతురు. నిజామాబాద్ మాజీ ఎంపీ కూడా. దాదాపు ఏడాది కాలంగా క్రియాశీలక రాజకీయ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొంటున్న దాఖలాలు లేవు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన కవిత అనంతర పరిణామాల్లో రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న దృశ్యాలు కూడా అంతంత మాత్రమే. ఆ మధ్య అలిగి అమెరికా వెళ్లినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆమె హైదరాబాద్ కు వచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.

తాజా రాజకీయ పరిణామాల్లో కవిత మళ్లీ చర్చల్లోకి వచ్చారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న కొందరు సభ్యుల కారణంగా ఖాళీ అవుతున్న మొత్తం సీట్లలో తెలంగాణాలోనూ రెండు ఉన్నాయి. ఈ రెండు సీట్లలో కేసీఆర్ ఎవరిని కూర్చోబెడతారనే అంశంపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నయన్నది వేరే విషయం. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ కవిత అభిమానులు ఆమెను దేవతలా ఆరాధిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. ‘రావాలి కవితక్క..కావాలి కవితక్క’ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. రా అక్కా అంటూ పార్టీ కార్యకర్తలు పిలుపునిస్తున్నారు.

పదవుల భర్తీ, సీట్ల కేటాయింపు అంశంలో కేసీఆర్ అంతరంగం మూడో కంటికి కూడా తెలియదంటారు. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పడానికి అనేక ఉదాహరణలు. ఈ నేపథ్యంలోనే కవితక్క రావాలంటూ ఆమె అభిమానులు పార్లమెంట్ ఫొటో వేసి మరీ సోషల్ మీడియా పోస్టులు షేర్ చేస్తున్న తీరు అధికార పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

రాజ్యసభ సీటు కేటాయించేందుకు అభిమానుల ద్వారా వేస్తున్న రాజకీయ ఎత్తుగడ కాదుగా…? పరోక్షంగా తీసుకువస్తున్న ఒత్తిడి కాదుగా? అని టీఆర్ఎస్ కేడరే సందేహిస్తోంది. ఏమో… కేసీఆర్ నిర్ణయం తీసుకోనూ వచ్చు. కవిత రాజ్యసభ సభ్యురాలు కావచ్చు. అవకాశం దక్కితే కేంద్ర మంత్రి పదవి కూడా రావచ్చు. నిర్ణయం కేసీఆర్ సార్ చేతిలో మాత్రమే… అంతే… ఇప్పటికింతే!

Comments are closed.

Exit mobile version