దిగువన గల ప్రకటనను అక్షరం పొల్లు పోకుండా పరిశీలనతో చదవండి. సోషల్ మీడియాలో కొంత కాలంగా చక్కర్లు కొడుతోంది. ఓ జర్నలిస్టు మిత్రుడు తాజాగా దీన్ని పోస్ట్ చేశారు. ‘మీ సమాచారం కోసం సార్’ అని పోస్ట్ దిగువన నాలుగు వాక్యాల మెసేజ్ కూడా పెట్టారు. సదరు జర్నలిస్టు మిత్రుడు ఏదేని పోస్టును పంపిస్తూ, ‘మీ సమాచారం కోసం సార్’ అన్నారంటేనే ఏదో సందేహం. ‘అసలు విషయం’ ఏమిటో కాస్త కనుక్కుని ఛేదించగలరు అనే నర్మగర్భ సంకేతం ఆ మిత్రుని మెసేజ్ ద్వారా గోచరిస్తుంది. ఇంతకీ ఈ వాట్సాప్ పోస్ట్ సారాంశం ఏమిటంటే…

‘రైతులు కావలెను. ప్రియమైన కర్షకుడా! మా సొసైటీ ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల తయారీకి మీ మద్ధతు అవసరం. ఆరోగ్యకరమైన, మెరుగైన జీవితాన్ని అందించేందుకు మాతో చేతులు కలపండి. సేంద్రీయ సేద్యంలో అనుభవం గల వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. వేతనం రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు. ఆహారం, వసతి ఉచితం’

ఇదీ ఇంగ్లీషులో గల సదరు ప్రకటన తెలుగు సారాంశం. చదువుతున్న కొద్దీ ప్రకటన ఆసక్తికరంగానేకాదు, కాస్త అనుమానాస్పదంగానూ గోచరించింది. ‘రైతుకు ఉద్యోగం ఇచ్చే ఉదార స్వభావులెవరబ్బా?’ అనేది అసలు డౌటు. ఎందుకంటే రైతు నైపుణ్యానికి, కష్టానికి తగిన ఉద్యోగం, ప్రతిఫలం దొరికితే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? రైతు సంక్షేమాన్ని కాంక్షించే వారెవరైనా ఈ పరిణామాన్ని ఆహ్వానించక తప్పదు. కానీ అసలైన రైతు ఒకడి దగ్గర పనిచేయడానికి అంగీకరించడు. అర ఎకరం భూమిని కలిగి ఉన్నా తన సేద్యం తానే చేసుకుంటాడు. పుడమి తల్లిని నమ్ముకుని సేద్యం చేసే కర్షకునికి ‘జీతం’ అనే పదమే మనస్కరించదు కూడా. రైతుకుండే ఆత్మాభిమానం అటువంటిది.

అందుకే… జర్నలిస్టిక్ బుర్ర సందేహిస్తే ఊరకే ఉండదు కదా? వెంటనే ప్రకటనలో పేర్కొన్న ఫోన్ నెంబర్లలో ఓ దానికి కాల్ చేయక తప్పలేదు. ఎవరో శ్రీరాం అట. ఫోన్లో కొంచెం, కొంచెం అరవం మిక్సింగ్ తెలుగు మాట్లాడారు. ‘తమిళ్ సొల్లు’ అన్నాడు. తమిళ్ సొల్లడం రానందున, చివరికి మరో భాషలోకి లాగేసరికి అసలు విషయం చెప్పేశాడు. తమ సంస్థ కోయంబత్తూరులో ఉందని, తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్న సదరు పోస్టుతో తమకు ఎటువంటి సంబంధం లేదని శ్రీరాం తేల్చేశాడు. ఇది ఎవరి పని సామీ? అని నిలదీస్తే ‘మీడియా వాళ్ల పని… మాకు సంబంధం లేదు’ అని ఖరాఖండిగా చెప్పేశాడు. అర్థమైందిగా రైతుకు ఉద్యోగం ఇచ్చే కోయంబత్తూర్ ‘కీరాయ్ కడాయ్ డాట్ కామ్’ సోషల్ మీడియా పోస్ట్ అసలు కత. ఈ ‘కీరాయ్ కడాయ్’ ఏంటీ అనుకుంటున్నారా? సదరు సంస్థ వాళ్లు కీరా దోసకాయలు ఎక్కువగా పండిస్తారట. అక్కడ పనిచేసేందుకు వాళ్లకు మనుషులు కావాలట. అంటే వాస్తవంగా వాళ్లకు కావలసింది రైతులు కాదు. వాళ్లు ఇచ్చేది ఉద్యోగమూ కాదు.

సదరు సంస్థకు అవసరమున్నది వ్యవసాయ కూలీలు మాత్రమే. అదీ ’తమిళ్ సొల్లు’ వాళ్లకేనట. నెలసరి రూ. 15 వేల జీతమంటే దినసరి రూ. 500 కూలీ అన్నమాట. తెలంగాణాలో సొంత ఎడ్లు, నాగలి గల వ్యవసాయ కూలీకి ఎకరానికి రూ. 1,200 నుంచి రూ. 1,500 వరకు లభిస్తున్నది. గట్టిగా శ్రమిస్తే దినసరి మూడెకరాల్లో ‘గొర్రు’ కొట్టి రూ. 4,500 సంపాదించే సత్తువ వీరిలో ఉంటుంది. పొలాల్లో పనిచేసే పురుష కూలీలకు దినసరి రూ. 600 ప్లస్ సాయంత్రం 90 ఎంఎల్ మందు గిట్టుబాటు అవుతోంది. సాయంత్రం ‘90 ఎంఎల్’ అనేది పురుష కూలీల తాజా డిమాండ్ కూడా.

ఇటువంటి పరిస్థితుల్లో ‘కీరాయ్ కడాయ్’ నౌకరీ కోసం తమిళనాడు వరకు వెళ్లడం అవసరమా? అందునా కోయంబత్తూర్ అట. కొసమెరుపు ఏమిటంటే… తమకు సంబంధం లేదని శ్రీరాం ఖరాఖండిగా పేర్కొన్న ఈ ప్రకటన సదరు ‘కీరాయ్ కడాయ్ డాట్ కామ్’లో వెదికితే ఇమేజ్ రూపంలో సాక్షాత్కరించడం. సదరు సంస్థ ఇమేజ్ లు కార్పొరేట్ సేద్యాన్ని తలపిస్తున్నాయి కూడా. ఉత్పత్తులు ‘షాపింగ్ మాల్స్’లో విక్రయానికి ఉంచిన తరహాలో సాక్షాత్కరిస్తున్నాయి. సరే ఎవరి వ్యాపకం వారిది. బహుషా ఇది వాళ్ల వ్యాపారమే కావచ్చు, కాకపోవచ్చు. ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేకపోవచ్చు. కానీ ‘రైతుకు ఉద్యోగం’ అనగానే ఆకర్షితులయ్యేవారు ‘కీరాయ్ కడాయ్’ ప్రకటనను మాత్రం జాగ్రత్తగా చదువుకోవలసి ఉంటుంది. సంస్థ నిర్వాహకులు సైతం తమ ప్రకటనలో ‘WANTED FARMERS’ అని కాకుండా ‘WANTED FARM LABORERS’ అని సవరించాల్సి ఉంది. అప్పుడే స్పష్టత ఉంటుందన్నది నిర్వివాదాంశం.

Comments are closed.

Exit mobile version