కామాంధుల తరపున వకాల్తా పుచ్చుకుని, విషయాన్ని డైవర్ట్ చేసే దౌర్భాగ్యులున్న లోకమిది. అందుకే కామాంధులు స్వైర విహారం చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. అందువల్లే రాష్ట్ర రాజధానిలో డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య వంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎస్…కొన్ని ఘటనల్లో ప్రజలు సత్వర న్యాయాన్ని ఆశిస్తుంటారు. ఎందుకంటే నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకున్నపుడు అది న్యాయమైన కోరిక కాబట్టి. జనామోదం ఉంటే ఏదైనా సాధ్యమే. ఇందులో ఎటువంటి అనుమానం కూడా అక్కరలేదు. కాకపోతే ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చాలనే తపన పాలకుల్లోనూ ఉండాలి. అప్పడే కొన్ని సంఘటనలకు ప్రజామోదం లభిస్తుంది.

బహుషా 1998 సంవత్సరం కాబోలు. రంగారెడ్డి జిల్లాలో ఓ దోపిడీ దొంగల ముఠా ఫాం హౌజుల్లో చొరబడి దొంగతనాలు చేయడమేకాదు, వాటికి కాపలాగా ఉన్న జంటలపై అఘాయిత్యాలకు పాల్పడేది. భర్తలను కట్టేసి వారి కళ్లముందే భార్యలపై అత్యాచారానికి తెగబడేవారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన అనేక ఇటువంటి ఘటనల్లో నిందితుల ముఠా ఒకటే కావడం గమనార్హం. పాపాత్ములకు కాలం మూడుతుంది కదా? ఈ ముఠాకు కూడా కాలం మూడింది. అనూహ్య రీతిలో కరీంనగర్ పోలీసులకు (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) చిక్కారు. ఓ గొర్రెను దొంగిలించబోగా, వాటి కాపరులు దొంగలను చాకచక్యంగా బంధించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కూడా వారిని సాధారణ దొంగలుగానే తొలుత భావించారు. కానీ తమదైన శైలిలో మర్యాద చేసే సరికి ఈ గొర్రెల దొంగలు ఎంత కరడుగట్టిన నేరస్తులో తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. వెంటనే వారిని తదుపరి విచారణ కోసం రంగారెడ్డి జిల్లా పోలీసులకు అప్పగించారు. అప్పటికే ఫాం హౌజ్ ఘటనలపై సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నపోలీసులకు శ్రమ తప్పింది. నేర ఘటనలను రీ-కన్స్ట్రక్షన్ చేసే ప్రక్రియలో భాగంగా పోలీసులు వారిని ఫాం హౌజ్ ల వద్దకు తీసుకువెళ్లారు. అయితే నిందితులు పోలీసులపై తిరగబడి, వారి తుపాకులు లాక్కుని కాల్పులు జరిపేందుకు విఫలయత్నం చేశారు. అనూహ్య ఘటనతో తేరుకున్న పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పుల్లో ఫాం హౌజ్ ఘోరాల నిందితులు కుక్క చావు చచ్చారు. (గుర్తున్నంత వరకు ఫాం హౌజ్ నిందితుల ఎన్ కౌంటర్ ఘటన పూర్వాపరాలు ఇవే).

ఇక వరంగల్ విషయానికి వస్తే స్వప్నిక, ప్రణీత అనే ఇద్దరు విద్యార్థినులపై ముగ్గురు కామాంధులు 2008లో యాసిడ్ దాడికి తెగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలానికి కారణమైన ఈ ఉదంతంలో ఒక విద్యార్థిని మరణించగా, మరో విద్యార్థిని చావు చివరి అంచు వరకు వెళ్లి వచ్చింది. ఈ ఘోరంపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. నిందితులను పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఏర్పడిన అనూహ్య పరిణామాల మధ్య ఎన్కౌంటర్ ఘటన జరిగింది. నిందితులందరూ మరణించారు. రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో వేర్వేరుగా జరిగిన ఈ రెండు ఎన్కౌంటర్ ఘటనల్లోనూ ఇద్దరు ఐపీఎస్ అధికారులు ప్రజల దృష్టిలో హీరోలయ్యారు. ఇది చరిత్ర. వక్రీకరించడానికి కూడా ఏమీ లేదు.

ఇప్పడు ప్రియాంకరెడ్డి విషయంలోనూ ప్రజలు ఆశిస్తున్న సత్వర న్యాయానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉండడంలో తప్పు లేకపోవచ్చు. కానీ కులాన్ని, మతాన్ని ప్రామాణికంగా చేసుకుని కొందరు వాదించడమే మూర్ఖత్వం అవుతుంది. నేరాలకు పాల్పడే వ్యక్తుల కులాలను, మతాలను ప్రస్తావించడం కూడా నేర స్వభావ మనస్తత్వాన్ని ప్రస్ఫుటింపజేస్తుంది. జరగరాని ఘోరం జరిగినప్పుడు, ప్రజలు సత్వర న్యాయాన్ని కోరుకున్నప్పుడు అదే జరగాలని ఆశించడమూ సబబే. అందుకు ప్రజామోదంతోపాటు పాలకుల మద్ధతూ అవసరం. ప్రియాంకారెడ్డి ఘటనలో అనేక మంది ప్రముఖులు, మేధావులు కోరుకుంటున్న సత్వర న్యాయం జరిగేందుకు అనుకూల పరిస్థితులను అవకాశంగా మల్చుకోవడం కూడా చట్ట పరిరక్షణలో భాగమే. నేర నియంత్రణలో ప్రక్రియగానూ కొందరు పోలీసు అధికారులు చెబుతుంటారు. అయితే…‘వంద మంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు, కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు’ అనే న్యాయ సూత్రాన్ని విస్మరించనంత వరకే దేనికైనా ప్రజామోదం లభిస్తుంది. అప్పుడే కామాంధులకు సరైన గుణపాఠం నేర్పినట్లవుతుంది. ఇటువంటి కామాంధుల్లో ప్రియాంకారెడ్డిని దారుణంగా చంపిన నిందితులే కాదు, కన్నకూతురుపై అఘాయిత్యాలకు తెగబడే తండ్రులు ఉండవచ్చు, కూతురితో సమానమైన కోడళ్లపై అత్యాచారయత్నం చేసే మామలు కూడా ఉండి ఉండవచ్చు. ఇటువంటి అఘాయిత్యాలను నిలువరించేందుకు సజ్జన్నార్ వంటి అధికారులు చట్ట పరిధిలో సాహసించాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని గ్రహంచాలి కామాంధులు.

BREAKING NEWS

ఈ వార్తా కథనం రాస్తున్న సమయంలోనే శంషాబాద్ లో మరో దారుణం జరిగింది. సిద్ధులగుట్ట సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళపై అత్యాచారం చేసి, ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పు పెట్టినట్లు తాజా సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Comments are closed.

Exit mobile version