‘‘కోర్టు వివాదంలో గల భూములకు పాస్ పుస్తకాలు జారీ చేయవద్దని ప్రభుత్వమే ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి సర్క్యులర్లు కూడా విడుదల చేసింది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వివిధ సమావేశాల్లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య కోర్టులో వివాదంలో గల భూములకు సంబంధించి చట్టపరిధిలోనే వ్యవహరించాలని ఆదేశించారు. ఇందుకు విరుద్ధంగా పాస్ పుస్తకాలు జారీ చేస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తే,  న్యాయవ్యవస్థ విచారణలో గల భూములకు పాస్ బుక్కులు ఇవ్వకపోతే చంపేస్తారా?’ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనానంతరం రెవెన్యూ ఉద్యోగ వర్గాలు వేస్తున్న ప్రశ్నఇది.

రెవెన్యూ శాఖపై ప్రజల్లో అసంతప్తి, ఆగ్రహం గతంలో ఉండేది. కానీ అది ఈ స్థాయిలో ఎన్నడూ బహిర్గతం కాలేదు. అందరికీ పెద్దగా భావించే నాయకుడే ‘అధికారులను తన్నండి…చెప్పుతో కొట్టండి’ అని వ్యాఖ్యలు చేయడం వల్లనే పరిస్థితి తీవ్ర రూపం దాల్చిందని ఆ వర్గాలు అంటున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లాగే తమ విభాగంలోనూ మంచీ, చెడూ ఉన్నాయని, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు గల శాఖ కావడం వల్ల తాము ఎక్కువగా బద్నాం కావలసి వస్తున్నదని రెవెన్యూ వర్గాల వాదన.  విజయారెడ్డి సజీవదహనం ఘటన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన తీరు తెన్నులనే ఈ సందర్భంగా  ఆక్షేపిస్తున్నాయి.

రెవెన్యూ ఉద్యోగ వర్గాల కథనం ప్రకారం…వాస్తవానికి భూరికార్డుల ప్రక్షాళన సదుద్ధేశంతో చేపట్టిన కార్యక్రమమే. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఆలోచనకు సీసీఎల్ఎ అధికార వర్గాలు గండి కొట్టాయి. సర్వే నిర్వహించిన తర్వాత మాత్రమే చేపట్టాల్సిన రికార్డుల ప్రక్షాళన పద్ధతిని ఏసీ గదుల్లో ఉండే ఉన్నతాధికారులు దారి మళ్లించారు. పహణీ నుంచి కంప్యూటర్ కు, అక్కడి నుంచి ధరణి ద్వారా రికార్డుల ప్రక్షాళన చేపడితే వివాదాలు ఇంతగా ఉండేవి కావు. వెబ్ లాండ్ నుంచి నేరుగా ధరణిలోకి భూ వివరాలను లాగడం వల్ల అనేక తప్పడు దొర్లాయి. సీసీఎల్ఎ అధికార వర్గాలకు క్షేత్ర స్థాయి అవగాహన లేదు. ప్రస్తుత రికార్డులు 95 శాతం కరెక్ట్ అని ముఖ్యమంత్రికి నివేదించారు. అందువల్లే అనేక వివాదాలు ఏర్పడ్డాయి.

ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థకు అనుసంధానంగా ఉన్నటువంటి భూముల్లోనే వివాదాల తీవ్రత ఎక్కువగా ఉంది. కారణాలు ఏవైనప్పటికీ కొందరు భూస్వాములు ఎప్పడో దశాబ్ధాల క్రితం తమ భూములను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో కొందరు రైతులు తీసుకువచ్చిన కాగితాలు దొంగవో, దొరవో తెలియని పరిస్థితి ఏర్పడింది. అంతేగాక మొత్తం భూరికార్డుల ప్రక్షాళన అంశంలోనే ఎటువంటి గైడ్ లైన్స్, శిక్షణ లేదని, ప్రయివేట్ ఆపరేటర్లపై ఆధారపడి రికార్డుల ప్రక్షాళన చేయకతప్పలేదు. కంప్యూటర్ ఆపరేటర్ తప్పులు చేసినా బాధ్యత తమదే అయినప్పటికీ, కళ్యాణలక్ష్మి వంటి అనేక రకాల అన్ని పనులూ రెవెన్యూ శాఖ నెత్తినే రుద్దారు. దీనికి తోడు తహశీల్దార్ల కార్యాలయాల్లో సిబ్బంది కొరత. కొన్ని కార్యాలయాల్లో ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. రికార్డుల  ప్రక్షాళనకోసం సర్వే నిర్వహించడానికి ప్రభుత్వ పర్వేయర్లు కూడా లేరు. సర్వే విభాగపు అధికారులు ప్రయివేట్ సర్వేయర్లను నియమించారు. వీళ్ల ఉద్యోగాలు ప్రభుత్వ కొలువులు కాకపోవడంతో తప్పు చేస్తే ఉద్యోగం పోతుందనే భయం లేకపోవడం అనేక పరిణామాలకు దారి తీసింది. ఇటువంటి అనేక ఒత్తిడిల మధ్య పని చేస్తున్న తమను విజయారెడ్డి ఉదంతం తీవ్ర కలవరానికి గురి చేసిందని రెవెన్యూ ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తప్పులు జరిగితే అధికారులను శిక్షించడానికి కూడా ఉన్నతాధికారులు, చట్టాలు, కోర్టులు ఉన్నాయని, ఆటవిక పద్ధతులను అనుసరించి సజీవ దహనం వంటి ఘటనలకు పాల్పడుతుంటే తాము ఏ ధైర్యంతో ఆఫీసులకు వెళ్లాలని రెవెన్యూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మెజిస్టీరియల్ అధికారాలు గల అధికారికే రక్షణ లేని పరిస్థితి ఏర్పడితే గ్రామాల్లో తిరిగే వీఆర్వో వంటి కింది స్థాయి సిబ్బంది పరిస్థితి ఏమిటన్నది రెవెన్యూ ఉద్యోగుల ప్రశ్న. విషాదం ఏమిటంటే బాచారపు భూ వివాదం అబుల్లాపూర్ మెట్ తహశీల్దార్ పరిధిలోని అంశమే కాదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ ప్రకటించారు. అయినప్పటికీ సురేష్ పట్టాదార్ పాస్ పుస్తకం కోసం విజయారెడ్డిపై పలుసార్లు ఒత్తడి తీసుకువచ్చాడని ఆయన పేర్కొన్నారు. అంటే విజయారెడ్డి హత్యకు ఈ భూవివాదం అసలు కారణం కాదా? భూ వివాదంలో కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ నాయకులు ఎవరన్నదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

Comments are closed.

Exit mobile version